పాపన్నపేట, జూన్18: ప్రముఖ పుణ్యక్షేత్రం ఏడుపాయల వనదుర్గాభవానీ మాత సన్నిధిలో ఆదివారం అమావాస్యను పురస్కరించుకుని భక్తులు భారీగా తరలివచ్చారు. సుదూర ప్రాంతాల నుంచి ఏడుపాయలకు చేరుకున్న భక్తులు మంజీరా నదిలోని వివిధ పాయల్లో పుణ్యస్నానాలు చేశారు. అనంతరం దుర్గామాతను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. పలువురు భక్తులు అమ్మవారికి ఒడిబియ్యం, కుంకుమార్చనలు, తలనీలాలు, బోనాలు సమర్పించి మొక్కులు సమర్పించుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఆలయ ఈవో సార శ్రీనివాస్, సిబ్బంది సూర్యశ్రీనివాస్, మధుసూదన్‌రెడ్డి, రవివీర్కుమార్, నరసింహులు, వరుణాచారి, బత్తిని రాజు, శ్రీకాంత్, ఏర్పాట్లు చేశారు. వేదపండితులు శంకరశర్మ, పార్థివశర్మ, రాముశర్మ, మురళీధర్, రాజశేఖర్‌శర్మ ప్రత్యేక పూజలు చేశారు. పాపన్నపేట ఎస్సై విజయ్‌కుమార్ తగిన బందోబస్తు చర్యలు చేపట్టారు.
ఏడుపాయల వనదుర్గా భవానీమాతను తెలంగాణ టూరిజం చైర్మన్ గెల్లు శ్రీనివాస్‌యాదవ్ దర్శించుకున్నారు. వేద పండితులు ప్రత్యేక పూజలు చేయించారు. అనంతరం ఆయనకు ఆలయ మర్యాదల ప్రకా రం అధికారులు స్వాగతం పలికి, ఆలయ సిబ్బంది మధుసూదన్‌రెడ్డి, సూర్య శ్రీనివాస్ సన్మానించారు.