సాక్షాత్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గ కేంద్రమది.. సీఎం కేసీఆర్ విజయ ప్రస్థానంలో ఎన్నో విధాలుగా బంధం ముడిపడి ఉన్న పట్టణమది.. అలాంటి ఊరు ఎలా ఉండాలే..? జిల్ జిల్ జిగేల్మనాలే! ఔను, అచ్చూ అలాగే ముస్తాబయ్యాయి ఆ మున్సిపల్ పరిధిలోని ప్రధాన దారులు, ముఖ్య కూడళ్లు. కల్వకుంట్ల చంద్రశేఖరుడు నింపిన వెలుగుల్లో నిత్యం దివిలె వాతావరణాన్ని ఆస్వాదిస్తున్న గజ్వేల్ అందాలను చూడాలంటే ఆ పట్టణ వీధుల్లో గోధూళి వేళ విహరించాల్సిందే!
గజ్వేల్, మే 22: పట్టణంలో విశాలమైన అందమైన రోడ్లు.. మధ్యలో డివైడర్లు.. వాటి మధ్యలో సెంట్రల్ లైటింగ్‌తో వెన్నెల వికసించినట్లు కనిపిస్తున్నది. గతంలో ప్రయాణికులు రాత్రివేళలో రోడ్లపై వెళ్లాలంటే భయం భయంతో ముందుకుసాగేవారు. కానీ, తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి రాగానే సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావు కృషి ఫలితంగా గజ్వేల్ పట్టణ రూపురేఖలు మారాయి. ప్రధాన రోడ్లతోపాటు మండల కేంద్రాలకు వెళ్లే మార్గాల్లోనూ సెంట్రల్ లైటింగ్ రాత్రి సమయంలో ఎంతో అద్భుతంగా కనిపిస్తున్నది. గడిచిన తొమ్మిదేండ్లలో గజ్వేల్ పట్టణం కొత్తవారు గుర్తుపట్టలేని విధంగా మారింది. గజ్వేల్ నుంచి సంగుపల్లి, జాలిగామ బైపాస్, మూట్రాజ్‌పల్లి, పిడిచేడ్ రోడ్డు, వర్గల్ కమాన్ నుంచి ఐవోసీ కార్యాలయం వరకు ఏర్పాటుచేసిన సెంట్రల్ లైటింగ్‌తో రాత్రివేళలో గజ్వేల్ పట్టణం విద్యుత్ కాంతులతో జిగేల్మంటున్నది.
రూ.2.50 కోట్లతో సెంట్రల్ లైటింగ్…
ప్రజ్ఞాఫూర్ రాజీవ్ రాహదారి నుంచి గజ్వేల్‌లోని తూప్రాన్ మార్గం వరకు 2016లో నాలుగు కిలోమీటర్ల మేర రూ.2.50 కోట్లతో సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేశారు. గజ్వేల్ మహతి ఆడిటోరియం నుంచి మూట్రాజ్‌పల్లి వరకు రూ.40 లక్షలతో 1.90 కిలోమీటర్ల మేర 73 విద్యుత్ స్తంభాలను అమర్చారు. తూప్రాన్ పీడబ్ల్యూడీ రోడ్డు నుంచి పాండవుల చెరువు వరకు రూ.25 లక్షలతో 1.20 కిలోమీటర్ల మేర 50 విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేశారు. గజ్వేల్ ప్రభుత్వ దవాఖాన నుంచి పిడిచేడ్ మార్గంలోని రైల్వేట్రాక్ వరకు 2.50 కిలోమీటర్లు, వర్గల్ కమాన్ నుంచి ఐవోసీ భవనం వరకు, తూప్రాన్ మార్గం నుంచి సంగుపల్లి వరకు రూ.3.2 కోట్లతో ఏర్పాటు చేసిన సెంట్రల్ లైటింగ్‌ను ఇటీవల రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్‌రావు ప్రారంభించారు. ప్రస్తుతం గజ్వేల్ చుట్టూ మండల కేంద్రాలకు వెళ్లే మార్గాలు నాలుగు వరుసల రోడ్డుతో డివైడర్లు, సెంట్రల్ లైటింగ్స్ సందర్శకుల మనసు దోచేస్తున్నాయి.
తొమ్మిదేండ్లలో కోట్లాది నిధులతో…
గత ప్రభుత్వాల హయాంలో అభివృద్ధికి నోచుకొని గజ్వేల్ తొమ్మిదేండ్లలో కోట్లాది రూపాయల నిధులతో అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నది. గతంలో రాత్రి సమయంలో గజ్వేల్ నుంచి ప్రజ్ఞాపూర్ వెళ్లాలంటే వాహనదారులు ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని వెళ్లాల్సిన పరిస్థితి ఉండేది. దానితోపాటు మూట్రాజ్‌పల్లి, జాలిగామ, పిడిచేడ్, క్యాసారం, సంగుపల్లి, సంగాపూర్ గ్రామాల ప్రజలు రాత్రి సమయంలో గుంతలమయమైన రోడ్లపై వెళ్లాలంటే భయంతో బిక్కుబిక్కుమంటూ ముందుకు సాగేవారు. కానీ, సీఎం కేసీఆర్ ప్రత్యేక కృషి, రాష్ట్ర మంత్రి తన్నీరు హరీశ్‌రావు సహకారంతో గజ్వేల్‌లోని రోడ్లన్నీ నాలుగు వరుసల అందమైన రోడ్లుగా ముస్తాబయ్యాయి. రోడ్ల మధ్యలో డివైడర్లు, అందులో సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ ఏర్పాటు చేయడంతో రాత్రి సమయంలో కూడా రోడ్లపై వాహనదారులు నిర్భయంగా వెళ్లే పరిస్థితులను సీఎం కేసీఆర్ తీసుకొచ్చారు. కోట్లాది రూపాయల నిధులు వెచ్చించి సెంట్రల్ లైటింగ్ ఏర్పాటుతో గజ్వేల్ పట్టణం నలువైపులా జిగేల్మంటూ కనిపిస్తున్నది. కొత్తవారొస్తే హైదరాబాదా..? గజ్వేల్‌లా..?! అని అచ్చెరువొందేలా సెంట్రల్ లైటింగ్‌తో విద్యుత్ కాంతులు విరజిమ్ముతున్నాయి.
సీఎం కేసీఆర్ కృషితో అభివృద్ధి…
సీఎం కేసీఆర్ కృషి, మంత్రి హరీశ్‌రావు సహకారంతో గజ్వేల్ పట్టణాన్ని అభివృద్ధి చేసుకున్నాం. గజ్వేల్ పట్టణం రాత్రి సమయంలో సెంట్రల్ లైటింగ్ ఎంతో అందంగా కనిపిస్తున్నది. గతంలో చిమ్మచీకట్లతో కనిపించే గజ్వేల్ నేడు దేదీప్యమానంగా వెలిగిపోతున్నదంటే సీఎం కేసీఆర్ చూపించిన ప్రత్యేక చొరవే కారణం. ఆయన మేలు ఎప్పటికీ మరిచిపోలేం. గజ్వేల్ అభివృద్ధికి కృషి చేసిన సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావుకు పట్టణవాసుల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు.
– ఎన్సీ రాజమౌళి, మున్సిపల్ చైర్మన్, గజ్వేల్
సెంట్రల్ లైటింగ్‌తో గజ్వేల్‌కు కొత్త కళ…
గజ్వేల్‌లోని అన్ని ప్రధాన రోడ్లలో ఏర్పాటు చేసిన సెంట్రల్ లైటింగ్‌తో పట్టణానికి కొత్త కళ వచ్చింది. సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావు కృషి ఫలితంగా అభివృద్ధి చెందిన గజ్వేల్ గుర్తుపట్టలేని విధంగా మారింది. గజ్వేల్ నుంచి కేసీఆర్ ఎమ్మెల్యేగా ఎన్నికవడమే పట్టణవాసులు చేసుకున్న అదృష్టంగా భావిస్తున్న. గజ్వేల్ అభివృద్ధి నిరంతరం అన్ని రంగాల్లో అభివృద్ధి జరగడం సంతోషంగా ఉంది.
– బబ్బురి రజిత, కౌన్సిలర్