జహీరాబాద్/ఝరాసంగం, ఫిబ్రవరి 10: కనుమరుగవుతున్న పాత పంటలైన చిరుధాన్యాలను కాపాడడమే లక్ష్యంగా డెక్కన్ డెవలప్మెంట్ మహిళా సంఘాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పాత పంటల జాతర పండుగలా కొనసాగుతున్నది. సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలంలోని వడ్డి గ్రామంలో సంక్రాంతి నాడు ప్రారంభమైన పాత పంటల జాతర మంగళవారం (నేడు) ఝరాసంగం మండలంలోని మచ్నూర్లో ముగియనున్నది. పాత పంటల విత్తనాలతో అందంగా అలంకరించిన ఎద్దులబండ్లతో డప్పు చప్పుళ్లు, మహిళా సంఘాల సభ్యులు, రైతుల నృత్యాలు, పాటలు, కోలాటాల ప్రదర్శన 26 రోజులుగా జహీరాబాద్ నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో ప్రధాన వీధుల గుండా ఊరేగింపుతో పాతపంటల జాతర నిర్వహిస్తున్నారు.
జీవవైవిధ్యం నుంచి సుస్థిర వ్యవసాయం వైపు రైతులను నడిపించి, పాత పంటలను పరిరక్షించేందుకు డీడీఎస్ మహిళా సంఘాల సభ్యులు విశేష కృషిచేస్తున్నారు. డీడీఎస్ మహిళా సంఘాలు సభ్యులు 80 రకాల పాత పంటల విత్తనాలను కాపాడుతున్నారు. సేంద్రియ సాగు గురించి వివరిస్తున్నారు. సాగులో లేని ఆకుకూరలను పరిచయం చేశారు. నేడు జరిగే ముగింపు వేడుకలకు డీడీఎస్ ప్రతినిధులు, మహిళా సంఘాల ఆధ్వర్యంలో భారీగా ఏర్పాట్లు చేశారు. ముగింపు వేడుకల్లో మహిళా రైతులను సన్మానించనున్నారు. ఈ వేడుకలను స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, వ్యవసాయ నిఫుణులు తదితరులు రానున్నట్లు డీడీఎస్ ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ దివ్య వెలుగురి తెలిపారు.
రోజురోజుకూ మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఆహారపు అలవాట్లతో ప్రస్తుతం ప్రజలంతా అనేక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ప్రస్తుత రోజుల్లో చిరుధాన్యాలతోనే సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని ఆరోగ్య నిఫుణులు, వైద్యాధికారులు సూచిస్తున్నారు. కనుమరుగవుతున్న పాత పంటలను కాపాడుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపై ఎంతైనా ఉందని, వాటిని సాగు చేసుకోవాలని డీడీఎస్ మహిళా సంఘాల సభ్యులు సూచిస్తున్నారు. రానున్న రోజుల్లో పాత పంటలైన చిరుధాన్యాలకు మంచి రోజులు రానున్నాయని కేంద్ర ప్రభుత్వ ప్రాంతీయ ఐసీఏఆర్ డైరెక్టర్ అటారి జోన్-10 డా. షేక్ ఎన్.మీరా పేర్కొన్నారు.
రాగులు, కొర్రలు, అవిసలు, జొన్నలు, సామలు, సజ్జలు వంటి చిరుధాన్యాలతో పాటు తెల్లగవ్వల కూర, ఉత్తరేణి, జొన్న చెంచులి, పానగంటి కూర, తలేల్ల ఆకుకూర, ఎలకచెవినకూర, సన్నపాయల కూరల్లో అనేక పోషక విలువలు ఉన్నాయని, వాటిని ఆహారంగా తీసుకుంటే సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని మహిళా సంఘాల సభ్యులు సూచిస్తున్నారు. డీడీఎస్ మహిళా సంఘాల సభ్యులు పాత పంటలైన చిరుధాన్యాలను మార్కెట్లో విక్రయిస్తున్నారు. పాత పంటల చిరుధాన్యాలతో వంటకాలతో జహీరాబాద్ పట్టణంలో కెఫే ఎథ్నిక్ హోటల్‌ను నడిపిస్తున్నారు.