జహీరాబాద్, ఫిబ్రవరి 13 : డీడీఎస్ సంస్థ ప్రతినిధులు అమ్మిన భూములు తిరిగి ఇవ్వడంతో పాటు ఎఫ్డీఆర్, పీడీఎస్, డిపాజిట్ డబ్బులను వెంటనే చెల్లించాలని డీడీఎస్ మహిళా సంఘాల సభ్యులు డిమాండ్ చేశారు. డీడీఎస్ ప్రాజెక్టులో జరిగిన అవినీతి, అక్రమాలతో నష్టపోయిన బాధిత మహిళా సంఘాల సభ్యుల సమావేశాన్ని గురువారం జహీరాబాద్ పట్టణ సమీపంలోని పస్తాపూర్ గ్రామ శివారులో నిర్వహించారు. సమావేశంలో పస్తాపూర్ డీడీఎస్ వ్యవసస్థాపక మాజీ ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ కేఎస్ గోపాల్ మాట్లాడారు. డీడీఎస్ మహిళా సంఘాల సభ్యులకు అండగా ఉండి న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామన్నారు. పేదరిక నిర్మూలన కార్యక్రమంలో భాగంగా 1979 నియోజవర్గం లోని 75 గ్రామాల్లో మహిళా సంఘాలతో పస్తాపూర్‌లో డీడీఎస్ (ప్రాజెక్టు) సంస్థనును ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
5వేల మంది మహిళలను పేదరికం నుంచి బయటకు తీసుకువచ్చామని గుర్తుచేశారు. డీడీఎస్ ప్రాజెక్టు పరిధిలోని 43 గ్రామాల్లోని 2,600 ఎకరాల్లో మహిళా సంఘాల సభ్యులతో చిరుధాన్యాలు పండిస్తూ వాటిని కాపాడుతున్నట్లు చెప్పారు. సభ్యుల పిల్లలకు పౌష్టికాహారం కింద చిరుధాన్యాలు అందించినట్లు గుర్తుచేశారు. మహిళలు పొదువు చేసిన డబ్బులు బ్యాంకులో రూ. 3కోట్ల వరకు డిపాజిట్ ఉన్నట్లు తెలిపారు. అంతర్జాతీయ దాతలు, రాష్ట్ర ప్రభుత్వం ద్వారా రూ. 12 కోట్లను నిధులు సేకరించినట్లు తెలిపారు. 2005లో దాతల పర్యవేక్షణ ముగిసిన తర్వాత మహిళా సంఘాలకు తెలియకుండానే 2006లో రూ.62, 68, 600ను జోవర్ అల్టర్నేట్ పీడీఎఫ్ డీడీఎస్ సంఘం రివాల్వింగ్ ఫండ్ ఎఫ్డీ సర్టిఫికెట్‌ను ఫిక్సిడ్ డిపాజిట్లోకి మార్చుకున్నట్లు ఆరోపించారు.
20 ఏండ్ల బ్యాంకు డిపాజిట్‌తో పాటు చక్రవడ్డీ కలిపి ప్రస్తుతం బ్యాంకులో రూ. 5 కోట్ల వరకు నిల్వ ఉంటుందని తెలిపారు. డీడీఎస్ సంఘం మహిళా సభ్యులకు తెలియకుండానే 103 ఎకరాల భూమిని ఇతరులకు విక్రయించారన్నారు. డీడీఎస్ మహిళా సం ఘాల ఆమోదం, స్వచ్ఛంద సంస్థల చట్టాల అనుమతి లేకుండానే దివంగత డీడీఎస్ ప్రాజెక్టు కార్యదర్శి సతీశ్ డయాలసిస్ కోసం డీడీఎస్ ప్రతినిధులు రూ. 3 కోట్ల వరకు ఖర్చుచేశారని పేర్కొన్నారు. డీడీఎస్ మహిళా సంఘాల సభ్యులకు తెలియకుండా అమ్మిన భూములను తిరిగి ఇవ్వాలని, ఎఫ్డీఆర్, పీడీఎస్, డిపాజిట్ డబ్బులను చెల్లించేందుకు తగు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కలెక్టర్, ఆర్టీవో, ప్రజాప్రతినిధులకు మొరపెట్టకున్నా ఫలితం లేకుండా పోయిందని కేఎస్ గోపాల్ ఆవేదన వ్యక్తం చేశారు.
డీడీఎస్ సం స్థ ప్రతినిధులు అమ్మిన్న భూములు తిరిగి మహిళా సంఘాలకు ఇవ్వడంతో పాటు ఎఫ్డీఆర్, పీడీఎస్, డిపాజిట్ డబ్బులు వెంటనే చెల్లించాలన్నారు. లేకపోతే మహిళా సంఘాల సభ్యులతో కలసి పోరాటాన్ని ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు. అనంతరం మహిళా సంఘాల సభ్యులు న్యాయం చేయాలని డీడీఎస్ ప్రాంతీయ కార్యాలయానికి భారీ ర్యాలీగా వెళ్లి ముట్టడించారు. ఈ విషయంలో డీడీఎస్ ప్రతినిధులు, బాధిత మహిళా సంఘాల సభ్యులకు వాగ్వాదం చోటుచేసుకుంది. జహీరాబాద్ రూరల్ పోలీసులు అక్కడి చేరుకుని బాధిత మహిళలను సముదాయించారు. డీడీఎస్ ప్రతినిధి రుక్మిణికి బాధిత మహిళా సంఘాల సభ్యులు వినతి పత్రాన్ని అందజేశారు.
అనంతరం డీడీఎస్ ప్రతినిధి రుక్మిణీ మాట్లాడుతూ.. డీడీఎస్పై తప్పుడు ఆరోపణలు చేయడం సరికాదన్నారు. డీడీఎస్లో ఎలాంటి అవినీతి, అక్రమాలు జరగలేదన్నారు. మహిళా సంఘాల సభ్యులకు ఏవైనా సమస్యలు ఉంటే గ్రామాల పెద్దలను డీడీఎస్ కార్యాలయాన్ని తీసుకువస్తే లెక్కలు చూపిస్తామని, మహిళలకు రావాల్సిన డబ్బులు ఉంటే చెల్లిస్తామని తెలిపారు. కార్యక్రమంలో డీడీఎస్ మాజీ డైరెక్టర్ వసంత్ కన్నాబిరాన్, డీడీఎస్ మాజీ సభ్యులు జగన్నాథ్‌రెడ్డి, జయప్ప, మహిళా సంఘా ల సభ్యులు రంగమ్మ, తుల్జమ్మ, రత్నమ్మ, చిల్క మ్మ, సంగమ్మ తదితరులు పాల్గొన్నారు.