కంది, అక్టోబర్ 25: ఆధ్యాత్మికంగానే కాకుండా నిత్యం లక్షలాది మందికి ఆహారం అందిస్తున్న అక్షయపాత్ర ఫౌండేషన్ అందిస్తున్న సేవలు గొప్పవని రాష్ట వైద్యా ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహా అన్నారు. సంగారెడ్డి జిల్లా కందిలోని అక్షయపాత్ర ఆవరణలో హరేకృష్ణ కల్చరల్ సెంటర్ నిర్మాణంలో భాగంగా శనివారం నిర్వహించిన మహా నర్సింహ హోమం, గర్భాలయ యంత్ర స్థాపన పూజా కార్యక్రమానికి మంత్రి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సనాతన ధర్మ పరిరక్షణ, మహోన్నత సాంస్కృతిక విలువలు అందించే అద్భుత ఆధ్యాత్మిక కేంద్రంగా ఈ హరే కృష్ణ కల్చరల్ సెంటర్ నిలుస్తుందన్నారు.
అంకితభావంతో ప్రతిరోజు లక్షలాది మందికి నాణ్యమైన ఆహారం అందించడం ఆశామాషీ విషయం కాదన్నారు. ఇలాంటి కార్యక్రమంలో పాల్గొనడం అదృష్ట్రంగా భావిస్తున్నట్లు తెలిపారు. అనంతరం అక్షయపాత్ర ఫౌండేషన్ నిర్వహిస్తున్న అతిపెద్ద కిచెన్, ఆధునిక వంట గదులు, స్నాక్స్, ఆటోమేటిక్ కూరగాయల వాషింగ్, కటింగ్ మిషన్లను మంత్రి పరిశీలించారు. మూడు కొత్త ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ వాహనాలను మంత్రి ప్రారంభించారు. కార్యక్రమంలో టీజీఐఐసీ చైర్పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి, అక్షయపాత్ర ఫౌండేషన్ అధ్యక్షులు సత్యగౌర చంద్రదాస, అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, ఫౌండేషన్ సభ్యులు, విద్యార్థులు పాల్గొన్నారు.