భారతమాతకు రక్షణగా… దేశ సరిహద్దుల్లో కాపలాదారుడిగా పనిచేసే భాగ్యం కలగడం అదృష్టం… ఈ అదృష్టం ఎందరికో రాదు.. చావు ఎన్నటికి తప్పదు… దేశం కోసం ప్రాణాలర్పిస్తే ఆ తృప్తి వేరు. అదే స్ఫూర్తితో దేశ త్రివిధ దళాల్లో వంద మంది వరకు వివిధ హోదాల్లో పనిచేస్తున్నారు సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలంలోని కట్కూరు వాసులు.
ఒకప్పుడది కల్లోల ప్రాంతం… పగలంతా పోలీస్ ఇనుపబూట్ల చప్పుళ్లు… రాత్రంతా విప్లవ పార్టీల కదలికలతో నిత్యం అలజడి నెలకొనేది. మూడు జిల్లాలకు సరిహద్దుల్లోని మారుమూల ప్రాంతమైన కట్కూర్ రెండున్నర దశాబ్దాల వరకు నక్సలైటు ఉద్యమానికి కంచుకోట. చుట్టుపక్కల ప్రాంతాల్లో ఏం జరిగినా పోలీసులు నేరుగా ఈ గ్రామానికి వచ్చి అమాయకులను చితికబాదేవారు. ఇదే సమయంలో అప్పుడప్పుడే చైతన్యవంతులు అవుతున్న యువత చదువులపై దృష్టిసారించారు. అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ సైనిక దళాల్లో చేరడం మొదలుపెట్టారు. ఒకరొకరుగా మొదలై వందమంది వరకు చేరారు. మూడున్నర దశాబ్దాల క్రితం మొదలైన ప్రస్థానంతో ఇప్పటి వరకు 100 మందికి పైగా కట్కూర్ వాసులు త్రివిధ దళాలు ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌లో వివిధ హోదాల్లో పనిచేస్తూ దేశసేవలో నిమగ్నమయ్యారు.
అక్కన్నపేట, మే 9: సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం కట్కూర్‌కు చెందిన జేరిపోతుల డేనియల్ అనే యువకుడు 45 ఏండ్ల క్రితం తొలుత నావికా దళంలో చేరారు. తర్వాత అతడిని స్ఫూర్తిగా తీసుకుని వర్ష శ్రీనివాస్ అనే మరో గ్రామస్తుడు ఆర్మీలో చేరారు. ఇలా ఒకరి తర్వాత ఒకరితో నాడు మొదలైన ప్రస్థానం నేడు 100 మందికి పైగా చేరుకుంది. కల్కూరు నుంచి అన్ని కులాల యువత ఆర్మీలో పనిచేస్తున్నారు. గ్రామంలో ప్రధానంగా వ్యవసాయమే జీవనాధారం. రాష్ట్రంలో జరిగే ప్రతి ఆర్మీ రిక్రూట్మెంట్లో కట్కూరుకు చెందిన యువకులు ఎంపికవుతుండడం విశేషం. పదో తరగతి, ఇంటర్ పూర్తి చేసిన యువకులు ప్రస్తుతం ఆర్మీలో పనిచేస్తున్న వారిని ఆదర్శంగా తీసుకుని త్రివిధ దశాల్లో చేరేందుకు శ్రమిస్తున్నారు.
ఆర్మీలో పనిచేస్తున్న గ్రామస్తుల సలహాలు, సూచనలు తీసుకుని కొందరు గ్రామంలోనే శిక్షణ పొందుతుండగా, మరికొందరు ఇతర ప్రాంతాలకు వెళ్లి శిక్షణ తీసుకుంటున్నారు. ఒక ఇంటిలో నుంచి ఇద్దరు అన్నదమ్ములు ఆర్మీలో పనిచేస్తుండగా, ఊరిలో సుమారు 20 కుటుంబాల నుంచి ఒక్కగానొక్క కొడుకు ఉన్న కూడా ఆర్మీలో పనిచేస్తున్నారు.
జవాన్లకు పుట్టినిల్లుగా మారిన కట్కూరులోని పురాతన బురుజును జవాన్ల సేవలు, పోరాటానికి చిహ్నంగా మాజీ సర్పంచ్ జిల్లెల అశోక్‌రెడ్డి సర్వాంగ సుందరంగా త్రివర్ణ రంగుల్లో ముస్తాబు చేయించారు. దేశానికి అన్నం పెట్టే రైతు… దేశాన్ని కాపాడే జవాన్ నినాదంతో బురుజు కింద భాగంలో జై జవాన్… జై కిసాన్ నినాదం రాయించారు. రైతు, జవాన్ల చిత్రాలను బురుజుపై వేయించారు.
కట్కూర్ పరిధిలోని రాజుతండాకు(ప్రస్తుతం దుబ్బతండా గ్రామ పంచాయతీ పరిధి) చెందిన సీఆర్పీఎఫ్ జవాన్ గుగులోతు నర్సింహానాయక్ పదేండ్ల క్రితం ఛత్తీస్‌గఢ్‌లోని కుసుమా జిల్లాలో ఎన్నికల బందోబస్తు విధులకు వెళ్లి మావోయిస్టులకు, జవాన్లకు జరిగిన ఎదురుకాల్పుల్లో అమరుడు అయ్యారు. దీంతో అప్పట్లో కట్కూర్‌లోని ఆర్మీ కుటుంబాల్లో భయం పట్టుకుంది. తమ బిడ్డలకు ఎప్పుడు ఏం ప్రమాదం జరుగుతుందోనని కలత చెందారు. కొందరు తల్లిదండ్రులు తమ బిడ్డలను ఉద్యోగాలను వదలి తిరిగి రావాలని కోరారు. కానీ, నర్సింహానాయక్ అంతిమయాత్రను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించి, ఆ కుటుంబానికి ఆదుకుంది.
నర్సింహానాయక్ జ్ఞాపకార్థం అతడి తండ్రి లింగయ్య విగ్రహం ఏర్పాటు చేశారు. అప్పుటి హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితెల సతీశ్‌కుమార్, సీఆర్పీఎఫ్ చీఫ్ కమాండెంట్, అప్పటి కరీంనగర్ జిల్లా ఎస్పీ, ఇతర అధికారులు హాజరై విగ్రహావిష్కరణ చేశారు. నర్సింహానాయక్ అమరుడు కావడం కట్కూర్ సైనికుల్లో మరింత గౌరవాన్ని పెంచింది. దీంతో గ్రామ యువత ఆర్మీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు. తన కొడుకు దేశం కోసం మరణించడం గర్వంగా ఉందంటూ నర్సింహానాయక్ తండ్రి లింగయ్య చెబుతుంటాడు. అతని జేబులో నిత్యం కొడుకు ఫొటో పెట్టుకుని దేశం కోసం తన బిడ్డ అమరుడు అయ్యాడని గర్వంగా చెబుతుంటాడు.