దుబ్బాక, మార్చి 26: వందలాది చెరువులు, కూడవెల్లి వాగు, మల్లన్నసాగర్ రిజర్వాయర్ ఉన్నప్పటికీ నీళ్లులేక దుబ్బాక ప్రాంతంలో యాసంగి వరిపంట ఎండిపోతున్నది. దీంతో రైతులు బోర్లు తవ్విస్తున్నారు. ఎన్నిబోర్లు తవ్వించినా చుక్కనీరు రావడం లేదు. అటు పంట ఎండిపోవడం, ఇటు బోర్ల తవ్వకానికి అప్పులు కావడంతో రైతులు దిగులు చెందుతున్నారు. బీఆర్ఎస్ హయాంలో ఈ ప్రాంతంలోని చెరువులు, కుంటలు, కూడవెల్లి వాగు మండుటెండల్లో సైతం జలకళ ఉట్టిపడి పంటలు పండాయి. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో సాగు భూములు సైతం బీడు బారుతున్నాయి.
చెరువులు,కుంటల్లో నీరులేక ఎడారిని తలపిస్తున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యంతో సాగునీరందక చేతికొచ్చే సమయంలో వరి పంటలు ఎండిపోతున్నాయి. మల్లన్నసాగర్ ప్రాజెక్టు నుంచి కూడవెల్లి వాగులోకి సకాలంలో సాగునీరు విడుదల చేయలేదు. దీంతోపాటు 4ఎల్ డిస్ట్రిబ్యూటర్ కాల్వల నిర్మాణం పూర్తికాక పోవడంతో రైతులు సాగునీటి కష్టాలు ఎదురయ్యాయి. నీరందక ఎండిన వరి పొలాలను రైతులు పశువులకు మేతకు వదిలేస్తున్నారు. ఏ పొలం చూసినా నెర్రెలిడి కనిపిస్తున్నాయి.
దుబ్బాక మండలం రామక్కపేట, రఘోత్తంపల్లి గ్రామాల్లో బుధవారం ‘నమస్తే తెలంగాణ’ ఫీల్డ్ విజిట్ చేసింది. నీరులేక పొట్టదశకు వచ్చిన వరి పంటలు ఎండిపోతుండడం కనిపించింది. పంటలను కాపాడుకునేందుకు రైతులు అప్పులు చేసి బోర్లు తవ్విస్తున్నా చుక్కనీరు రావడం లేదు.
ఈ రెండు గ్రామాల్లో నెల రోజుల్లో 200 బోరుబావులు తవ్వించినట్లు తెలిసింది. వీటిలో 90శాతం బోరుబావుల్లో చుక్కనీరు పడలేదు. చెరువులు నీరులేక బోసిపోయాయి. గతేడాది యాసంగితో పోల్చితే ఈసారి తక్కువ విస్తీర్ణంలో వరి సాగుచేసినప్పటికీ నీరందక పంటలు ఎండిపోతున్నాయి. దుబ్బాక మండలం ఆకారం సెక్టార్లో ఈ యాసంగిలో 3140 ఎకరాల వరి పంట సాగు చేయగా, ఇందులో 40శాతం పంట ఎండిపోయింది.
పంట మొత్తం ఎండిపోయింది
ఐదెకరాలకు రెండెకరాల్లో వరి పంట వేశాను. నీళ్లు లేక, కరెంట్ సరిగ్గా రాక వేసిన పంట మొత్తం ఎండిపోయింది. మల్లన్నసాగర్ నుంచి మా గ్రామానికి కాల్వల ద్వారా నీళ్లు వస్తాయని ఎంతో ఆశతో రైతులమంతా ఎదురుచూశాం. కాల్వ నిర్మాణం చేయకపోవడంతో సాగునీటి సమస్య నెలకొంది. భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. పంట కాపాడకునేందుకు రూ.1.50 లక్షలు అప్పు చేసి, రెండు బోరు బావులు తవ్వించిన. చుక్క నీరు పడలేదు. పొట్ట దశలో ఉన్న వరిపంటకు నీరు లేకపోవడంతో మొత్తం ఎండిపోయింది.
– బిట్ల యాదగిరి, రైతు, రామక్కపేట (సిద్దిపేట జిల్లా)
గింతగోస ఎప్పుడూ చూడలేదు..
మా రఘోత్తంపల్లిలో పెద్దచెరువు పక్కనే నాకు ఐదెకరాల భూమి ఉంది. గతంలో 5 ఎకరాల్లో పంట వేసేటోడిని. ఈసారి కొంత సందేహంతో యాసంగిలో నాలుగెకరాల్లో వరి పంట వేశాను. మార్చి మొదటి వారంలోనే చెరువులో నీరు పూర్తిగా అడుగంటిపోయింది. దీంతో సాగునీరు అందక వేసిన పంట ఎండిపోయింది. ఇప్పటికే సగానికి పైగా పంట ఎండిపోయింది. బోరు సరిగా పోస్తలేదు. ప్రస్తుతం పంట పొట్ట దశలో ఉంది. ఇప్పుడు పంటకు నీరు చాలా అవసరం. ఉన్న పంటను బతికించుకునేందుకు నీళ్ల ట్యాంకర్లు కూడా దొరకడం లేదు. నేను ఎప్పుడు నీళ్ల కోసం గింత గోస పడలేదు. కేసీఆర్ ఉన్నప్పుడు మల్లన్న సాగర్ నుంచి కూడవెల్లి వాగుకు, కాల్వలకు నీరు వదిలితే చెరువు, కుంటలు నిండి రెండు పంటలు మంచిగా పండినయి. ఇప్పుడు అంత తికమక అయ్యింది.
– నల్ల రాజిరెడ్డి, రైతు, రఘోత్తంపల్లి (సిద్దిపేట జిల్లా)