శివ్వంపేట, ఏప్రిల్ 18: వడగండ్ల వానతో కోతకు వచ్చిన పంట దెబ్బతిని రైతులకు అపార నష్టం జరిగిందని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని పిల్లుట్ల, కొత్తపేట, రత్నాపూర్, అల్లీపూర్ గ్రామాల పరిధిలో వడగండ్లకు దెబ్బతిన్న పంటలను ఎమ్మెల్యే పరిశీలించి రైతులకు భరోసా కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆరుకాలం కష్టపడి పండించిన పంటలు కోత దశలో వడగండ్లతో నష్టపోవడం బాధాకరమన్నారు. బాధిత రైతులకు ఎకరాకు రూ. 25వేల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రభుత్వం పంటల బీమా డబ్బులు కట్టకపోవడంతో నష్టపోయిన రైతులకు ఒక్క రూపాయి కూడా రావడం లేదన్నారు.
రైతులెవరూ అధైర్యపడొద్దని, రైతులకు నష్టపరిహారం అందించే వరకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని, రైతుల పక్షాన పోరాటం చేస్తుందన్నారు. వ్యవసాయాధికారులు మండలంలోని ప్రతి గ్రామానికి వెళ్లి దెబ్బతిన్న పంటల వివరాలు సేకరించాలని ఆదేశించారు. అనంతరం కలెక్టర్‌తో ఫోన్లో మాట్లాడి రైతులకు త్వరగా నష్టపరిహారం అందేలా చూడాలని కోరారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రమణా గౌడ్, జడ్పీ కోఆప్షన్ మాజీ సభ్యులు మన్సూర్, మాజీ వైస్ ఎంపీపీ రమాకాంత్‌రెడ్డి, మాజీ సర్పంచ్‌లు పెద్దపులి రవి, సుగుణాశ్రీనివాస్, బొగ్గుల యాదగిరి, చింతస్వామి, హంసాన్పల్లి నర్సింహారెడ్డి, ఏవో లావణ్య, ఆర్ఐ కిషన్, ఏఈవో మౌనిక, దామోదర్‌రెడ్డి, సండ్ర సుదర్శన్ ఉన్నారు.