మునిపల్లి, మార్చి 2 : అందోల్ నియోజకవర్గం నుంచి గెలిచి రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న దామోదర రాజనర్సింహ సొంత నియోజకవర్గంలో జరుగుతున్న ఘటనలపై స్పందించడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రెండు వారాల క్రితం మునిపల్లి మండలం అంతారంలో ఇరువర్గాలకు మధ్య గొడవ చోటుచేసుకుంది. ఈ ఘటనలో తండ్రిపై ఇతరులు దాడిచేస్తుండగా అడ్డుకోబోయి పదో తరగతి విద్యార్థిని అలియా బేగం(15) తీవ్రంగా గాయపడి దవాఖానలో చికిత్స పొందుతూ విషమించి మృతిచెందింది.
ఈ ఘటన జిల్లాతో పాటు రాష్ట్రవ్యాప్తంగా తెలిసినప్పటికీ మంత్రి దామోదర్ రాజనర్సింహ కనీసం స్పందించలేదని, బాధిత కుటుంబాన్ని పరామర్శించక పోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మండలంలోని అంతారం గ్రామానికి చెందిన పి.రవి అనే వ్యక్తి భార్య,తల్లితో కలిసి అంతారం నుంచి సదాశివపేట వైపు వెళ్తుండగా ఫిబ్రవరి 25 రాత్రి బుధేరా వద్ద ఫ్లైఓవర్‌పై గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో ముగ్గురు అక్కడికక్కడ దుర్మరణం చెందారు.
దీంతో ఈ కుటుంబంలోని ముగ్గురు చిన్నారులు అనాథలుగా మారారు. ఇంటి పెద్దలను కోల్పో యి ముగ్గురు చిన్నారులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. వీరిని మంత్రి పరామర్శించి ధైర్యం చెప్పలేదు. ఇటువైపు పలుమార్లు వచ్చినా బాధిత కుటుంబాలను మంత్రి పరామర్శించక పోవడంపై, బాధిత కుటుంబాలకు అండగా నిలవాల్సిన మంత్రి, ఇటువైపు చూడక పోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.