న్యాల్కల్, జనవరి 17 : నేరాల నియంత్రణలో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయని, నేరాలను కట్టడి చేయవచ్చని సంగారెడ్డి జిల్లా అడిషనల్ ఎస్పీ ఉష విశ్వనాథ్ అన్నారు. మంగళవారం మండలంలోని మామిడ్గి గ్రామంలో ప్రధాన వీధులు, చౌరస్తాల్లో సర్పంచ్ చంద్రన్న ఆధ్వర్యంలో రూ.2.30లక్షలతో ఏర్పాటు చేసిన 16 సీసీ కెమెరాలను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ నేరాల నియంత్రణ, శాంతి భద్రతలు కాపాడేందుకు సీసీ కెమెరాలు ఎంతగానో దోహదపడుతాయన్నారు.
మండలంలోని అన్ని గ్రామాల ప్రజలు, ప్రజాప్రతినిధులు ముందుకు వచ్చి సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. సీసీ కెమెరాల ఏర్పాటుతో నేరాలను అదుపు చేయవచ్చని, దొంగతనాలు నివారించేందుకు అవకాశం ఏర్పడుతుందన్నారు. రోడ్డు ప్రమాదాలు, దొంగతనాలు తదితర ఘటనలు జరిగిన పరిస్థితుల్లో సీసీ కెమెరాల ద్వారా వారిని గుర్తించి పట్టుకోవడానికి పోలీసులకు మూడో నేత్రంగా ఉపయోగపడుతుందన్నారు. గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేందుకు సహకరించిన గ్రామ సర్పంచ్ చంద్రన్నతో పాటు పాలకవర్గ సభ్యులను ఆమె అభినందించారు.
కార్యక్రమంలో జహీరాబాద్ డీఎస్పీ రఘు, రూరల్ సీఐ నోముల వెంకటేశ్, హద్నూర్, రాయికోడ్ ఎస్సైలు వినయ్‌కుమార్, ఏడుకొండలు, మామిడ్గి, మెటల్‌కుంట సర్పంచులు చంద్రన్న, ఫిటర్రాజు, ఉపసర్పంచ్ శరణయ్యస్వామి, ఎంపీటీసీ లక్ష్మి, నాయకులు తుక్కారెడ్డి, జగన్నాథ్‌రెడ్డి, మాణిక్‌రెడ్డి, మోహన్, జయరాజ్, లాజర్, తుక్కారెడ్డి, చంద్రారెడ్డి, నర్సింహారెడ్డి, మల్లయ్య స్వామి పాల్గొన్నారు.