ములుగు, నవంబర్ 14 : ఆర్థిక వ్యవస్థకు ఊతమివ్వడంలో సహకార సంఘాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని సిద్దిపేట జిల్లా సహకార అధికారి వరలక్ష్మి, తెలంగాణ రాష్ట్ర సహకార యూనియన్ ఎండీ అన్నపూర్ణ అన్నారు. సిద్దిపేట జిల్లా ములుగులో ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన 72వ అఖిల భారత సహకార వారోత్సవాల్లో భాగంగా డీసీవో సహకార జెండాను ఎగురవేసి సహకార గేయాన్ని ఆలపించారు. అనంతరం సమావేశం ఏర్పాటు చేసి మెరుగైన సమాజ నిర్మాణంలో సహకార సంస్థల ప్రాముఖ్యతపై రైతులకు వివరించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… గ్రామీణ ప్రాంతాల్లో రైతులకు సహకార సంఘాలు వెన్నుదన్నుగా నిలిచాయన్నారు. సాంకేతికతను జోడించి పారదర్శకతతో బాధ్యతాయుతంగా సహకార సంఘాలు పనిచేస్తూ ఆర్థికాభివృద్ధికి చేయూతనిస్తూ, ‘ఆత్మనిర్బర్ భారత్’ సాధకాలుగా సహకార సంఘాలు పనిచేస్తున్నాయని కొనియాడారు. కార్యక్రమంలో డీసీసీబీ డైరెక్టర్ బట్టు అంజిరెడ్డి, జాయింట్ రిజిస్ట్రార్లు సంగీత, పరిమళ, శ్రీవల్లి, సురేఖ, జిల్లా సహకార ఆడిట్ అధికారి నాగేశ్వర్రావు, అసిస్టెంట్ రిజిస్ట్రార్లు శ్రీనివాస్‌రెడ్డి, రఘోత్తమ్‌రెడ్డి, డీసీసీబీ బ్రాంచ్ మేనేజర్ శ్రీకాంత్‌రెడ్డి, పీఏసీఎస్ సీఈవో రమేశ్‌బాబు, రైతులు పాల్గొన్నారు.