సిద్దిపేట, ఫిబ్రవరి 5 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): సిద్దిపేట జిల్లా నర్మెట గ్రామ శివారులో 62 ఎకరాల విస్తీర్ణంలో రూ.300 కోట్లతో టీఎస్ ఆయిల్ ఫెడ్ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీ పను లు చురుగ్గా కొసాగుతున్నాయి. 2023 సెప్టెంబర్‌లో ఫ్యాక్టరీ నిర్మాణ పనులు ప్రారంభంకాగా, ఏప్రిల్ 2025 నాటికి పూర్తి చేసే లక్ష్యంగా పెట్టుకున్నారు. మూడేండ్ల క్రితం ఆయిల్‌పామ్ పంటసాగు చేసిన రైతులు పంట గెలలను ఇప్పటి వరకు వదిలి పెట్టారు. నాలుగో పంట దిగుబడి జూన్ వరకు రానున్నది. ఇటీవల మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు ఫ్యాక్టరీ నిర్మాణ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించి తగు సూచనలు, సలహాలు చేశారు. అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించి ఫ్యాక్టరీ నిర్మాణం చేస్తున్నారు. నూనె ఉత్పత్తి చేయడమే కాకుండా రిఫైనరీని మొదలు పెట్టి ఫైనల్ ప్రొడక్ట్‌ను ఇకడి నుంచే నేరుగా మారెట్లోకి పంపించే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. నాలుగు మెగా వాట్ల సెల్ఫ్ జనరేషన్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పా టు చేస్తున్నారు. వాడిన నీటిని వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ ద్వారా రీసైకిల్ చేసే పద్ధతిని ఇకడ పెడుతున్నారు. రైతుల పొలాల నుంచి నర్మేట ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీ వరకు తేవడానికి అవసరమైన రవాణా ఖర్చును కూడా రాష్ట్ర ఆయిల్‌ఫెడ్ వారు భరిస్తారు. పంటరాగానే రైతుల వద్ద కొనుగోలు చేసి వారానికి రెండు రోజులు రైతులకు డబ్బుల చెల్లింపులు చేస్తారు. ప్రస్తుతం ఫ్యాక్టరీ నిర్మాణ పనులు ముమ్మరంగా కొనసాగుతున్నప్పటికీ పూర్తికావడానికి మరో ఏడాది పట్టే అవకాశం ఉంది. రైతుల కు ఎలాంటి ఇబ్బంది లేకుండా జూన్ నుంచి ఇక్కడే తొలి పంట దిగుబడి కొనుగోలు చేస్తారు. ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ వారు కొన్న పంటను ఆశ్వరావుపేటకు తీసుకుపోయి అక్కడ ప్రాసెస్ చేస్తారు. సంవత్సరంలోగా ఫ్యాక్టరీ పనులు పూర్తి చేసుకున్న తర్వాత ఇక్కడనే రిఫైనరీ ద్వారా నూనె ఉత్పత్తిని చేస్తారు. ప్రస్తుతం ఫ్యాక్టరీ నిర్మాణ పనుల్లో భాగంగా 10 కోట్ల లీటర్లు పట్టే వాటర్ స్టోరేజీ ట్యాంకు, మూడు వే బ్రిడ్జీలు, ప్రహరీ, పరిపాలన భవనం, మెకానికల్ పనులు జరుగుతున్నాయి.
అంతర సేద్యం లేదా పంట మార్పిడి ద్వారా ఒక రైతు తన పొలంలో ఒకటి కంటే ఎక్కువ పంటలు పండించడం పంట వైవిద్యంగా చెప్పవచ్చు. ఈ విధానం ద్వారా అధిక ఆదాయం పొందే అవకాశం ఉంది. ఆయిల్‌పామ్‌కు జాతీయ మార్కెట్లో మంచి డిమాండ్ ఉండడం…గత కేసీఆర్ ప్రభుత్వ ప్రోత్సాహం..ఆయిల్ పామ్ సాగు చేయడానికి పెద్ద ఎత్తున రైతులు ముందుకు వచ్చారు. రాష్ట్రంలో ఖమ్మం, కొత్తగూడెం జిల్లాల తర్వాత కొత్తగా సాగు చేస్తున్న జిల్లాలో సిద్దిపేట జిల్లా అగ్రస్థానంలో ఉంది. నర్మెట ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీ పరిధిలో నూతనంగా ఏర్పడిన సిద్దిపేట జిల్లాతో పాటు జనగామ, యాదాద్రి- భువనగిరి, మహబూబాబాద్, గద్వాల్, నారాయణపేట జిల్లాలు వస్తాయి. 2020-21 నుంచి 2023-24 వరకు (ఇప్పటివరకు) అన్ని జిల్లాలో కలిపి 38,866 ఎకరాలు ఆయిల్‌పామ్ పంట సాగు చేశారు. సిద్దిపేట జిల్లాలో 10,962 ఎకరాలు, జనగామ జిల్లాలో 5,798 ఎకరాలు, యాదాద్రి-భువనగిరి జిల్లాలో 3,385 ఎకరాలు, మహబూబాబాద్ జిల్లాలో 6,668 ఎకరాలు, గద్వాల్ జిల్లాలో 6026 ఎకరాలు, నారాయణపేట జిల్లాలో 6027 ఎకరాలు ఆయిల్‌పామ్ మొక్కలు నాటినట్లు అధికారులు తెలిపారు. వీటిలో మొదటి ఏటా 870 ఎకరాలు, రెండో ఏటా 6610 ఎకరాలు, మూడో ఏటా 19,771 ఎకరాలు, నాలుగో ఏటా 11,615 ఎకరాలు మొత్తం ఆరు నూతన జిల్లాల పరిధిలో 8150 మంది రైతులు 38,866 ఎకరాల్లో ఆయిల్‌పామ్ మొక్కలు నాటారు.
ఫ్యాక్టరీలో మొదట గంటకు 30 టన్నుల గెలల క్రషింగ్ సామర్థ్యంతో నిర్మాణం పూర్తవుతుంది. గెలల పరిమాణం, సామర్థ్యం పెరుగుతున్న కొద్దీ క్రషింగ్ సామర్థ్యాన్ని గంటకు 120 టన్నులకు పెంచుకునే వీలును ముందుగానే ఏర్పాటు చేసుకుంటున్నారు. గంటకు 120 టన్నుల గెలల క్రషింగ్ సామర్థ్యంతో ఫ్యాక్టరీ నిర్మాణం కావడం భారతదేశంలోనే తొలిసారి అని చెప్పవచ్చు. నర్మెట ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీ భవిష్యత్‌లో ఒక సిద్దిపేట జిల్లాలోని ఆయిల్‌పామ్ గెలలకు మాత్రమే కాకుండా సమీప జిల్లాలైన జనగామ, మహబూబాబాద్, గద్వాల్, నారాయణపేట, యాదాద్రి-భువనగిరి జిల్లాల ఆయిల్‌పామ్ గెలలను ప్రాసెస్ చేసేందుకు అత్యాధునిక సామర్థ్యంతో మలేషియా టెక్నాలజీతో నిర్మిస్తున్నారు.
నర్మెట ఫ్యాక్టరీ వద్ద జూన్ నుంచి ఆయిల్ పామ్ గెలల కొనుగోలు షురూ కానుంది. సంప్రదాయ నూనె గింజల ఆయిల్‌పామ్ పంట నూనే దిగుబడి 4 నుంచి 5 రెట్లు అధికంగా ఉంటుంది. మొక్కలు నాటిన తర్వాత నాలుగో సంవత్సరం నుంచి కాపు మొదలై 30 ఏండ్ల వరకు నిరంతర దిగుబడితోపాటు ఆదాయం వస్తుంది. తెగుళ్లు, చీడపీడలు ఇతర పంటలతో పోలిస్తే ఆయిల్‌పామ్‌లో చాలా తక్కువ. ఈ పంట ప్రకృతి వైపరీత్యాలను సమర్థవంతంగా తట్టుకుంటుంది. కోతులు, అడవి పందుల బెడద ఉండదు. ఇతర పంటల మాదిరిగా ధాన్యాన్ని ఆరబెట్టడం, తూర్పార పట్టడం, తేమ శాతం నిలవడంలాంటి సమస్యలు ఆయిల్‌పామ్‌లో లేవు. దళారీ వ్యవస్థ అసలే ఉండదు. రైతు గెలలు కోసిన తర్వాత నేరుగా ఫ్యాక్టరీకి తరలించి మూడు రోజుల్లో గెలలు, రవాణా చార్జీలు పొందే అవకాశం ఉంటుంది. ఆయిల్‌పామ్ సాగు వల్ల నిరంతర దిగుబడి, ఆదాయంతో రైతుల ఆర్థిక పురోగతి, అత్యున్నత దశకి చేరుకొని రైతు మాత్రమే కాకుండా రైతు భావితరాలు కూడా ఆయిల్‌పామ్ లబ్ధిపొందే అవకాశం. ఇతర పంటలో పొలిస్తే ఖర్చులపోను అయిల్‌పామ్ సాగు వల్ల ఏడాదికి ఎకరాకు నికరంగా రూ.1,00,000 ఆదాయం వస్తుంది. మొదటి మూడేండ్లు ఆదాయం కోసం అంతర పంటలుగా కూరగాయలు, మొక్కజొన్న ,పత్తి ,బొబ్బెర్లు, పెసర్లు, కందులు, ఉలువలు పొద్దుతిరుగుడు, అరటి, బొప్పాయి, వేరుశనగ లాంటి పంటలు పండించవచ్చు. ఐదేండ్ల తర్వాత కూడా అంతర పంటలుగా కోకో, పొట్టి మిరియాలు మొదలగు సాగుచేసి అదనపు ఆదాయం పొందే అవకాశం ఉంది.
1) క్రూడ్ పామాయిల్ మిల్లు
2) పామ్ కెర్నల్ ఆయిల్ మిల్లు
3) విద్యుత్ ఉత్పత్తి కోసం కో జనరేషన్ ప్లాంట్
4) వ్యర్థాల రిసైక్లింగ్ కోసం కండెన్షేషన్ ప్లాంటు
5) క్రూడ్ పామాయిల్‌ను
రిఫైనరీ చేయడానికి మిల్లు
6) ఇతర మిల్లింగ్ పనులు