చేర్యాల, జూలై 3: కాంగ్రెస్ పాలనలో ప్రొటోకాల్ ఉల్లంఘన యథేచ్ఛగా కొనసాగుతున్నది. సిద్దిపేట జిల్లా చేర్యాల పట్టణంలోని కల్యాణి గార్డెన్స్‌లో ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాల పంపిణీ గురువారం జరిగింది. సిద్దిపేట కలెక్టర్ హైమావతి మొదటి సారిగా హాజరైన అధికారిక కార్యక్రమంలో చేర్యాల ఏఎంసీ చైర్పర్సన్ నల్లనాగుల శ్వేతకు బదులుగా ఆమె భర్త వెంకటచారి స్టేజీపై కూర్చోవడంతో పాటు జ్యోతి ప్రజ్వలన చేయడం గమనార్హం.
దీంతో పాటు భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి లబ్ధిదారులను ఉద్దేశించి ప్రసంగిస్తున్న సమయంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్యకర్త అంతా రాజకీయం చేస్తున్నారు, అర్హులైన వారికి ఇండ్లు రావడం లేదని మండిపడ్డాడు. దీంతో పోలీసులు అక్కడికి చేరుకుని ఆ కార్యకర్తను సమావేశం జరుగుతున్న ప్రదేశం నుంచి బయటకు పంపించారు. స్టేజీ పై కాంగ్రెస్ మండల అధ్యక్షులు, పార్టీ నాయకులు కూర్చొని సమావేశం నడిపించారు.కలెక్టర్‌తో పాటు ఆర్డీవో తదితరులు హాజరైన అధికారిక కార్యక్రమంలో ప్రొటోకాల్ ఉల్లంఘన జరగడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
చేర్యాలను రెవెన్యూ డివిజన్ కేం ద్రంగా ఏర్పాటు చేయాలని కోరుతూ జేఏసీ ప్రతినిధులు, చైర్మన్ సభావేదిక పైకి వెళ్లి భువనగిరి ఎంపీ, సిద్దిపేట కలెక్టర్‌కు వివరిస్తుండగా పలువురు అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులు మైక్ లాక్కునే ప్రయత్నం చేశారు. అయినప్పటికి జేఏసీ నాయకులు మాట్లాడి వినతి పత్రం అందజేసి ‘జై చేర్యా ల’ నినాదాలు చేస్తూ వెళ్లిపోయారు.