జిన్నారం, జనవరి 21 : మా పార్టీలో చేరండి. మీకు బీఫారం ఇవ్వడంతో పాటు ఖర్చులు మేము భరిస్తాం అని కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్ నేతలకు ఆఫర్ ఇస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరాలని కాకా పడుతున్నారు. మున్సిపల్ ఎన్నికల వేళ బీఆర్ఎస్ నేతలకు గాలం వేసేందుకు కాంగ్రెస్ నేతలు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. తగిన అభ్యర్థులు లేకపోవటంతో కాంగ్రెస్ నేతలు తలలు పట్టుకుంటున్నారు. సంగారెడ్డి జిల్లా జిన్నారం మున్సిపల్ పరిధిలో 18, గడ్డపోతారం మున్సిపల్ పరిధిలో 20 వార్డులు ఉన్నాయి.
ఈ వార్డుల్లో అభ్యర్థులను నిలబెట్టేందుకు ఆయా పార్టీల నాయకులు సమావేశాలు ఏర్పాటు చేసుకుని అభ్యర్థులను ఎంపిక చేసే పనిలో బిజీగా ఉన్నారు. పురపోరులో బీఆర్ఎస్ నేతల మధ్య తీవ్రమైన పోటీ ఉంది. ఒక్కో వార్డు నుంచి ముగ్గురు, నలుగురు నాయకులు టికెట్ల కోసం ఆశిస్తున్నారు. బీఆర్ఎస్ ముఖ్య నేతలు బలమైన అభ్యర్థులను రంగంలోకి దింపేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు, ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకతతో జిన్నారం, గడ్డపోతారం మున్సిపాలిటీల్లో హస్తం నుంచి పోటీచేసేందుకు అభ్యర్థులు దొరకడం లేదు.
అండూర్ గ్రామంలో కాంగ్రెస్ బరిలో నేతలు లేకపోవటంతో ఆశ చూపి బీఆర్ఎస్ నేతను కాంగ్రెస్లో చేర్పించుకున్నారు. జిన్నారం, శివానగర్, గడ్డపోతారం, మంగంపేట, రాళ్లకత్వ, అండూర్ తదితర గ్రామాల్లో కాంగ్రెస్ నేతలకు సరైన అభ్యర్థులు దొరకడం లేదు. దీంతో బీఆర్ఎస్లో పలుకుబడి ఉన్న నేతలను కాంగ్రెస్లోకి చేర్పించుకునేందుకు నాయకులు యత్నాలు చేస్తున్నారు. కాంగ్రెస్లో చేరేందుకు బీఆర్ఎస్ నేతలు సిద్ధ్దంగా లేకపోవటంతో కాంగ్రెస్ నేతలు తలలు పట్టుకుంటున్నారు. జిన్నారం, గడ్డపోతారం మున్సిపాలిటీలను తాము కైవసం చేసుకుంటామని బీఆర్ఎస్ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.