సంగారెడ్డి, జనవరి 7(నమస్తే తెలంగాణ) : సొంత పార్టీకి చెందిన దళిత నాయకుడిపై పీపీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి దురుసుగా వ్యవహరించడం జిల్లా కాంగ్రెస్ వర్గాలతో పాటు రాష్ట్ర పార్టీలో సైతం చర్చనీయాంశంగా మారింది. మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్ల రిజర్వేషన్లు ఇంకా ఖరారు కాలేదు. అయినా ముందస్తుగానే సంగారెడ్డి, సదాశివపేట మున్సిపల్ చైర్మన్ల పేర్లను పార్టీ నాయకుల సమావేశంలో జగ్గారెడ్డి ప్రకటించారు. ఇదే వివాదానికి దారితీసింది.
ఇదేమని ప్రశ్నించిన దళిత నాయకుడిపై ఆవేశంతో ఊగిపోయాడు. సొంత పార్టీ నేత అని కూడా చూడకుండా దుర్బాషలాడా డు. మీటింగ్‌లో నుంచి వెళ్లిపోవాలంటూ తీవ్ర స్థాయిలో హెచ్చరించాడు. తన మాట వినని దళిత నేతను బలవంతంగా మీటింగ్‌లో నుంచి బయటకు పంపించి వేయడం కలకలం రేపింది. ఇది మంగళవారం సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం మల్కాపూర్ సమీపంలోని ఓ ఫంక్షన్హాల్లో సంగారెడ్డి, సదాశివపేట మున్సిపాలిటీ కాంగ్రెస్ నాయకులు, కౌన్సిలర్ల ఆశావహులతో మున్సిపల్ ఎన్నికల సన్నాహాక సమావేశంలో జరిగింది.
సంగారెడ్డిలోని శాంతినగర్‌కు చెందిన దళిత నాయకుడు సునీల్ అభ్యంతరం వ్యక్తం చేశారు. తాను 40 ఏండ్లుగా కాంగ్రెస్‌లో ఉంటూ పార్టీ కోసం పనిచేస్తున్నానని, తపనతో పాటు చాలా మంది పనిచేస్తున్నారని, తమకు పదవులు ఇవ్వరా అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. సునీల్ మాటలు విన్న జగ్గారెడ్డి ఆగ్రహంతో ఊగిపోయారు. సునీల్ నువ్వు కూర్చో నేను మాట్లాడతాను.. ఎక్కువ మాట్లాడితే ఇకపై నా దగ్గరికి కూడా రానివ్వను, నీ ఇష్టం.. ఇంకా ఎక్కువ మాట్లాడితే కౌన్సిలర్ టికెట్ కూడా రాదు’ అంటూ హెచ్చరించారు.
పార్టీ కోసం పనిచేస్తున్న మా కు పదవులు ఇవ్వరా అంటూ సునీల్ మరోసారి గట్టిగా మాట్లాడారు. దీంతో జగ్గారెడ్డి మండిపడుతూ ఏం సునీల్ నీ కెపాసిటీ ఏంటీ .. నీ లెక్కా పత్రం ఏంటీ.. పార్టీకి నీ కంట్రిబ్యూషన్ ఏంటీ.. నాటకాలు చేస్తున్నావా.. ఇంతమందిలో నాకు ఎదురు మాట్లాడతా వా.. ఫాల్తూగానివి, నాకు ఉల్టా మాట్లాడతావా’ అంటూ ఆవేశంగా ఊగిపోయారు. ఆపై సునీల్‌ను బలవంతంగా మీటింగ్ నుంచి బయటకు పంపించేశాడు. ఇదే క్రమంలో ఎవరూ వీడియో తీయవద్దని , మీటింగ్ వీడియో బయటకు వస్తే వీపులు పగులుతాయని మీడియాను జగ్గారెడ్డి హెచ్చరించాడు.
ఓటేయలేదని దళితుడి టార్గెట్
కోహీర్, జనవరి7: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో తమ పార్టీ నాయకుడికి ఓటేయలేదని దళితుడు బేగరి రాములును అధికార పార్టీ నాయకులు టార్గెట్ చేశారు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా కోహీర్ మండలం సజ్జాపూర్‌లో బుధవారం చోటుచేసుకున్నది. జీపీ ఎన్నికల్లో తనకు ఓటు వేయలేదని సర్పంచుగా ప్రమాణ స్వీకారం చేసిన సదరు అధికార పార్టీ నాయకుడు డిసెంబర్ 22న బేగరి రాములు ఇంటి నిర్మాణాన్ని అడ్డుకుని జేసీబీతో కూల్చివేయించారు. అనంతరం బాధితుడు బేగరి రాములు న్యాయం చేయాలని మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావును కలిసి వేడుకున్నారు.
ఇందు కు స్పందించి ఆయన రూ.లక్షను జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్‌రావు ద్వారా ఆర్థికసాయం అందజేశారు. 23న దళితుడి ఇంటి నిర్మాణం కూల్చివేత విష యం తెలుసుకున్న రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య గ్రామాన్ని సందర్శించి వివరాలు సేకరించారు. అనంతరం రెండోసారి మంగళవారం సజ్జాపూర్ గ్రామాన్ని సందర్శించి బాధితుడికి రూ.25 వేల పరిహారాన్ని ప్రభుత్వం తరఫున అందించారు. ఆర్డీవో, తహసీల్దార్, ఎంపీడీవో అధికారుల సమక్షంలోనే పరిహారాన్ని అందజేశారు. ఇంటి నిర్మాణం కోసం భూ మి పూజ నిర్వహించారు. బేగరి రాములు చేపట్టే ఇంటి నిర్మాణానికి అడ్డంకులు సృష్టించొద్దని ఆర్డీవో దేవుజాను ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య ఆదేశించారు.
కానీ, తెల్లవారే సరికి బేగరి రాములు కు రెవెన్యూ అధికారులు మళ్లీ నోటీసు లు అందజేశారు. పల్లెప్రకృతి వనంలోని ఖాళీ స్థలాన్ని ఆక్రమిస్తున్నాడని వెంటనే పనులు ఆపాలని నోటీసులో పేర్కొన్నారు. పూర్తి ఆధారాలతో 24 గంటల్లో కోహీర్ తహసీల్ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని సూచించారు. ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ వెంకటయ్య, ఎమ్మెల్యే మాణిక్రా వు భూమి పూజ చేసినా అధికారులు, కాంగ్రెస్ నాయకులు కలిసి దళితుడిని టార్గెట్ చేశారని స్థానికులు ఆరోపిస్తున్నారు. పల్లెప్రకృతి వనం కంటే ముందు నుంచే ఆ స్థలంలో బేగరి రాములుకు కల్లం ఉండేదని వివరించారు. ఓటు వేయలేదని ఆయన కుటుంబంపై కక్ష కట్టారని విమర్శిస్తున్నారు.