మెదక్, మార్చి 12(నమస్తే తెలంగాణ): పల్లెల్లో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించేందుకు బీఆర్ఎస్ హయాంలో పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు చేశారు. పల్లె ప్రజలకు ఆరోగ్యాన్ని కల్పించేందుకు వాకింగ్ ట్రాక్లు సైతం ఏర్పాటు చేశారు. గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించి, వారికి ఉజ్వల భవిష్యత్ కల్పించేదుకు క్రీడా ప్రాంగణాలు నిర్మించారు. గ్రామాల్లో పరిసరాలు పరిశుభ్రంగా ఉంచేందుకు తడి, పొడి చెత్తను సేకరించి, దాంతో సేంద్రియ ఎరువులు తయారు చేసేందుకు డంపింగ్ యార్డులు ఏర్పాటు చేశారు. మెదక్ జిల్లాలోని 21 మండలాల్లో ఉన్న 492 గ్రామ పంచాయతీలో పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు చేశారు.
పల్లె ప్రకృతి వనాల ఏర్పాటుకు ప్రతి పంచాయతీకి రూ.2 నుంచి రూ. 3 లక్షల వరకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఖర్చుచేసింది. అందులో అనేక రకాల మొక్కలు పెంచారు. పండ్లు, పూల మొక్కలతో పాటు అడవి చెట్లు పెంచారు. ప్రజలకు ఆరోగ్యానికి అనుకూలమైన వాతావరణం కలిపించేందుకు చెట్లు నాటారు. కాలుష్యం తగ్గించడంతో పాటు స్వచ్ఛమైన గాలి లభించేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతి గ్రామంలో హరితహారంలో భాగంగా చెట్లు నాటించింది. ప్రస్తుత ప్రభుత్వం పల్లె ప్రకృతి వనాలపై చిన్నచూపు చూడడంతో చెట్లను సంరక్షించే నాథుడు కరువయ్యాడు. ఎండుతున్న చెట్లకు రక్షించేందుకు అధికారులు కనీస చర్యలు చేపట్టడం లేదు. దీంతో రోజురోజుకు పచ్చదనం కనుమరుగవుతున్నది.
బీఆర్ఎస్ ప్రభుత్వంలో మెదక్ జిల్లాలో 492 పంచాయతీల్లో పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు చేశారు. పచ్చదనంతో పాటు ప్రజలకు ఆరోగ్యంపై అవగాహన పెంచేందుకు అందులో వాకింగ్ ట్రాక్లు ఏర్పాటు చేయించారు. గ్రామాల్లో ప్రజలకు స్వచ్ఛమైన గాలి లభించేలా చర్యలు తీసుకున్నారు. రోజూ ప్రకృతి వనాల్లో వాకింగ్ చేసేందుకు మట్టిదార్లు నిర్మించారు. వాకింగ్ చేసే సమయంలో విశాంత్రి తీసుకునేందుకు బెంచీలు ఏర్పాటు చేశారు. తాగునీటి సౌకర్యం కలిపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహణ పట్టించుకోక పోవడం, సంరక్షణ చర్యలు తీసుకోకపోవడంతో పల్లె ప్రకృతి వనాలు కనిపించకుండా పోతున్నాయి. ప్రజాప్రతినిధులు, అధికారులు పట్టించుకోవడం లేదు. దీంతో గ్రామీణులకు ఆహ్లాదం ఆవిరవుతున్నది.
గ్రామాల్లోని చెత్తను సేకరణ చేసి తడి, పొడి చెత్తను వేరు చేసి సేంద్రియ ఎరువులు తయారు చేసేందుకు రూ.లక్షలు ఖర్చు చేసి డంపింగ్ యార్డులు నిర్మించారు. గ్రామాల్లో చెత్త సేకరించేందుకు ప్రతి పంచాయతీకి ట్రాక్టర్ కొనుగోలు చేశారు. గ్రామాల్లో సేకరించిన తడి, పొడి చెత్తను వేరుచేయడం లేదు. ప్రస్తుతం డంపింగ్ యార్డులు వృథాగా పడి ఉన్నాయి. సేంద్రియ ఎరువులు తయారు చేయడంలేదు.
బీఆర్ఎస్ హయాంలో గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ప్రతి పంచాయతీలో క్రీడ ప్రాంగణం ఏర్పాటు చేశారు. ఈ క్రీడాప్రాంగణాలు నిరాదరణకు గురవుతున్నాయి. క్రీడా ప్రాంగణాల్లో ఏర్పాటు చేసిన పరికరాలు కనిపించకుండా పోయాయి. ఎక్కడ చూసినా పిచ్చి మొక్కలు, ముళ్లపొదలు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే నిర్వహణ మరచడంతో రూ.లక్షలు ఖర్చు చేసి ఏర్పాటు చేసిన క్రీడాప్రాంగణాలు నిరాదరణకు గురవుతున్నాయి.