మిరుదొడ్డి, ఏప్రిల్ 5: ఎన్నికల సమయంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేస్తానని కామారెడ్డిలో చేసిన డిక్లరేషన్ అమలు చేయకుండా సీఎం రేవంత్‌రెడ్డి బీసీలను మోసం చేశారని శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాశ్ అన్నారు. ఆదివారం సిద్దిపేట జిల్లా అక్బర్పేట-భూంపల్లి మండలం భూంపల్లిలో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో నిర్మించిన పెద్దమ్మతల్లి ఫంక్షన్ హాల్‌ను దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి, రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్యతో కలిసి ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా బండ ప్రకాశ్ మాట్లాడుతూ.. మత్స్య కారులకు ఉచితంగా చేప పిల్లలను పంపిణీ చేసి ఉపాధి చూపిన గొప్ప చరిత్ర దేశంలోనే కేసీఆర్‌కు దక్కిందన్నారు. మత్స్య కారులకు సంక్షేమానికి సంక్షేమ పథకాలు అమలు చేశారని గుర్తుచేశారు. రూ.8 కోట్ల నిధులతో రాష్ట్రంలోని ముదిరాజ్‌లకు ముదిరాజ్ భవనాలను నిర్మించారన్నారు. కామారెడ్డి డిక్ల్లరేషన్ అమలుకు బీసీలు ఐక్యంగా ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. కేసీఆర్ పాలనలో పల్లెలు ఎంతో అభివృద్ధిని సాధించాయని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి అన్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం పార్టీలకతీతంగా ఎమ్మెల్యేలకు నిధులు కేటాయించి నియోజకవర్గాల అభివృద్ధికి తోడ్పాటును అందించిందన్నారు. నేడు రాష్ట్రంలో అలాంటి పరిస్థితులు లేవన్నారు. కేసీఆర్ మల్లన్న సాగర్ ప్రాజెక్టు, రంగనాయ సాగర్, కొండ పోచమ్మ వంటి ప్రాజెక్టులు నిర్మిస్తే, సీం రేవంత్ వాటి పిల్ల కాలువలు కూడా తవ్వించడం లేదని విమర్శించారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ జెన్నారెడ్డి, మిరుదొడ్డి ఏఎంసీ చైర్మన్ సంయుక్త శ్రీధర్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు జీడిపల్లి రవి, మిరుదొడ్డి మాజీ ఎంపీపీ పంజాల కవితా శ్రీనివాస్ గౌడ్, ముదిరాజ్ సంఘం నాయకులు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.