ఝరాసంగం, ఆగస్టు 27: శనివారం అమావాస్య రావడంతో ఝరాసంగం మండలంలోని ఏడాకులపల్లి, బర్దీపూర్ గ్రామాల శివారులో ఉన్న సప్తపురి శనిఘట్ దేవాలయంలో భక్తులు భారీగా తరలివచ్చారు. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. మండలంతో పాటు న్యాల్కల్, రాయికోడ్, మునిపల్లి, మొగుడంపల్లి మండలాల నుంచి భక్తులు తరలిరావడంతో దేవాలయం జన సందోహంగా మారింది. భక్తులు పుణ్యస్నాన్నాలు ఆచరించి, శనైశ్చర స్వామికి తైలాభిషేకం చేశారు. ఆలయ ఆవరణలో శనైశ్చరుడికి డోలారోహణం, హోమ గుండంలో కొబ్బరి కాయలు వేశారు. 1108 కలశాలతో స్వామికి తైలాభిషేకం చేశారు.
ఈ సందర్భంగా పూజారులు సిద్ధేశ్వర నందగిరి మహరాజ్, సంగమేశ్వర్ మాట్లాడుతూ జిల్లాలో సప్తపురి శనిఘాట్ ఎక్కడా లేదని, ఏడాకులపల్లిలోనే ఉందని తెలిపారు. శనైశ్చరుడిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారన్నారు. ప్రతి అమావాస్య రోజున సప్తపురి శనిఘాట్ను సందర్శించిన భక్తులకు శని బాధలు పూర్తిగా తొలగిపోతాయని భక్తులు నమ్ముతారన్నారు. కుల, మత వర్గ విభేదాలు లేకుండా ప్రతిఒక్కరూ స్వామివారిని దర్శించుకున్నట్లు చెప్పారు. శని అమావాస్య చాలా ప్రముఖమైన రోజని తెలిపారు. అనంతరం గ్రా పెద్దల ఆధ్వర్యంలో అన్నదానం చేశారు. కార్యక్రమంలో బర్దీపూర్ దత్తగిరి ఆశ్రమ పీఠాధిపతి అవధూత గిరి మహరాజ్, ఆలయ పాలక మండలి సభ్యులు భాస్కర్‌రెడ్డి, రఘునందన్‌రెడ్డి, వీరారెడ్డి, శివ్వన్న, విష్ణువర్దన్‌రెడ్డి సంగారెడ్డి, బీరప్ప, శివన్న, భక్తులు పాల్గొన్నారు.