చేర్యాల, డిసెంబర్ 30: సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లికార్జునస్వామి ఆలయంలో సోమవారం ఆలయ వర్గాలు అత్యంత భక్తిశ్రద్ధలతో స్వామి వారికి లక్ష బిల్వార్చన, మహాన్యాస పూర్వక రుద్రాభిషేక పూజలు నిర్వహించారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు సుఖసంతోషాలతో జీవనం కొనసాగించేందుకు స్వామి వారు అనుగ్రహించాలని కోరుతూ ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు ఆలయవర్గాలు తెలిపాయి.
అనువంశిక వీరశైవ ఆగమశాస్త్రం ప్రకారం స్వామివారి ఆలయంలో స్వస్తిక్ పుణ్యహవచ నం, గణపతిపూజ, పంచచార్య పూజలు, రుద్రాభిషేకం, బిల్వార్చన, మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం, హారతి, మంత్రపుష్పం, మహానైవేద్యం తదితర పూజలను అర్చకులు నిర్వహించారు. లక్ష బిల్వాలను(మారేడు) స్వామి మూలవిరాట్ వద్ద సమర్పిస్తూ 1008 మల్లన్న నామస్మరణలను పటిస్తూ అత్యంత వైభవంగా భక్తిశ్రద్ధలతో బిల్వార్చన పూజలు కొనసాగించారు. పూజల్లో ఆల య అర్చకుడు పడిగన్నగారి మల్లికార్జున్ దంపతులు పాల్గొన్నారు. కార్యక్రమంలో ఏఈవో బుద్ధి శ్రీనివాస్, ఆలయ ప్రధానార్చకుడు మహాదేవుని మల్లికార్జున్, పర్యవేక్షకుడు శ్రీరాములు, ఆలయ కమిటీ సభ్యులు, ఆలయ అర్చకులు పాల్గొన్నారు.
రెండు రోజుల పాటు స్వామి వారి కల్యాణోత్సవాన్ని ఆలయవర్గాల ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించిన అర్చకులు, లక్ష బిల్వార్చన, మహాన్యాసపూర్వక పూజలతో కల్యాణ వేడుకలు ముగిసినట్లు ప్రకటించారు.రానున్న సంక్రాంతి పర్వదినం అనంతరం వచ్చే మొదటి ఆదివారం పట్నం వారంతో తిరిగి జాతర ఉత్సవాలు ప్రారంభమవుతాయన్నారు. మొదటి ఆదివారం పట్నం వారం సందర్భంగా హైదరాబాద్ భక్తులు పట్నం, అగ్నిగుండాల కార్యక్రమాలు నిర్వహించుకుంటారని,మొదటి వారానికి సుమారు లక్ష మంది భక్తులు కొమురవెల్లికి తరలివస్తారని వారు వెల్లడించారు.స్వామి వారి కల్యాణోత్సవ వేడుకలు విజయవంతంగా ముగియడంతో ఆలయవర్గాలు ఆలయ సంప్రదాయం మేరకు ఆలయ సిబ్బందిని ఈవో ఆధ్వర్యంలో అర్చకులు సన్మానించారు.