జిన్నారం, జూన్ 9: బొల్లారం పారిశ్రామికవాడలోని పలు రసాయన పరిశ్రమలు ప్రజారోగ్యాన్ని దెబ్బతీసేలా వాయు కాలుష్యానికి కారణమవుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సోమవారం తెల్లవారుజామున పారిశ్రామిక వాడలోని పలు పరిశ్రమలు యథేచ్ఛగా వాతావరణంలోకి ఫ్యాక్టరీ గొట్టాల ద్వారా విష వాయువులను విడుదల చేయడంపై స్థానికులు భయాందోళన వ్యక్తం చేశారు.
విష వాయువులను నిబంధనలకు విరుద్ధంగా విడుదల చేస్తూ పర్యావరణంతో పాటు ప్రజారోగ్యానికి తీవ్ర విఘాతం కలిగిస్తున్నారని మండిపడుతున్నారు. విడుదలైన వాయువులు ఘాటైన వాసనలతో శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయని స్థానికులు వాపోయారు. వృద్ధులు, మహిళలు, చిన్నపిల్లలు విష వాయువులతో దీర్ఘకాలిక వ్యాధులకు గురవుతున్నారని, బాధ్యులైన పరిశ్రమలపై పీసీబీ అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.