సిద్దిపేట అర్బన్,జూలై 8: సిద్దిపేట జిల్లాలోని నీటిపారుదల ప్రాజెక్టుల పెండింగ్ భూ సేకరణ త్వరగా పూర్తిచేయాలని ఆర్అండ్ఆర్ కమిషనర్ శివకుమార్నాయుడు సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం సిద్దిపేట జిల్లా కలెక్టరేట్ మినీ సమావేశ మందిరంలో కలెక్టర్ కె.హైమావతితో కలిసి జిల్లాలో పెండింగ్లో ఉన్న ఇరిగేషన్ ప్రాజెక్టుల భూసేకరణపై సమీక్షించారు. జి ల్లాలో భూ సేకరణ, ఆర్అండ్ఆర్ పెండింగ్ సమస్యల గురించి కలెక్టర్ వివరించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ దేవాదుల ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా సిద్దిపేట జిల్లాలోని చేర్యాల, కొమురవెల్లి, కొండపాక, మద్దూరు, ధూళిమిట్ట మండలాల్లో పెండింగ్లో ఉన్న కాల్వల నిర్మాణాలకు అవసరమైన భూమిని సేకరించాలన్నారు. గౌరవెల్లి ప్రాజెక్టులో భాగంగా పెండింగ్లో ఉన్న కాల్వల భూ సేకరణను త్వరగా పూర్తిచేయాలన్నారు. మల్లన్నసాగర్ నిర్వాసితులకు అందించాల్సిన పెండింగ్ డబ్బులను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి త్వరగా అందేలా చూస్తామన్నారు. సమీక్షలో సిద్దిపేట జిల్లా అదనపు కలెక్టర్ లక్ష్మీకిరణ్, సిద్దిపేట,గజ్వేల్ ఆర్డీవోలు సదానందం, చంద్రకళ, ఇరిగేషన్, రెవెన్యూశాఖల అధికారులు పాల్గొన్నారు.