సంగారెడ్డి కలెక్టరేట్, అక్టోబర్ 7: ప్రజావాణి సమస్యలకు తక్షణమే పరిష్కారం చూపాలని సంగారెడ్డి కలెక్టర్ వల్లూరు క్రాంతి అధికారులను ఆదేశించారు. సోమవారం సంగారెడ్డి కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో భాగంగా బాధితుల నుంచి ఆమె అర్జీలు స్వీకరించారు. అనంతరం ఆమె మాట్లాడారు.వివిధ ప్రాంతాల నుంచి 55 మంది దరఖాస్తు చేసుకున్నారని, వాటిని వెంటనే పరిష్కరించాలన్నారు. శాఖల వారీగా పెండింగ్లో ఉన్న దరఖాస్తులను ఆన్లైన్ ప్లాట్ఫామ్లో సజావుగా క్లియర్ చేయాలన్నారు.
క్షేత్రస్థాయిలో మండల ప్రత్యేకాధికారులు పర్యటించి ప్రజా సమస్యలను పరిష్కరించాలన్నారు. సీజనల్ వ్యాధులపై ప్రజలను అప్రమత్తం చేయాలని, అందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. సమస్యల పరిష్కారానికి అధికారులు త్వరగా స్పందించి సత్వర పరిష్కారం చూపాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో సంగారెడ్డి అదనపు కలెక్టర్లు చంద్రశేఖర్, మాధురి, డీఆర్వో పద్మజారాణి, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.