సంగారెడ్డి, మే 30: ప్రభుత్వం విత్తనాలు, ఎరువుల కొరత లేకుండా చర్యలు తీసుకుందని, ఎవరైనా కొరత సృష్టిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ వల్లూరు క్రాంతి హెచ్చరించారు. గురువారం కలెక్టరేట్లోని మినీ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ పంటలు సాగు చేసే ముందు రైతులను ఇబ్బందులకు గురిచేసే విధంగా విత్తనాలు, ఎరువుల కొరత సృష్టించిన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు.
వానకాలం సాగుకు అవసరమైన అన్ని రకాల విత్తనాలు రైతులకు అందించేందుకు అధికారులు సిద్ధం చేశారన్నారు. జిల్లాలో పత్తి సాగుకు రైతులు అత్యధికంగా మొగ్గు చూపడంతో వారికి అవసరమైన మేరకు పత్తి విత్తనాలు సరఫరా చేసేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. జిల్లా 3.60లక్షల ఎకరాల్లో పత్తి సాగుకు అన్నదాతలు సిద్ధమయ్యారని, వారి కోసం 3,76,422 కిలోల పత్తి విత్తన ప్యాకెట్లు జిల్లాకు చేరుకున్నాయన్నారు. ఇంకా అవసరమైతే తెప్పించి రైతులకు అందజేస్తామని చెప్పారు. విత్తనాల కోసం రైతులెవరూ ఆందోళన చెందకుండా డీలర్ల వద్ద విత్తనాలు తీసుకోవాలని, అందుబాటులో లేకుంటే మండల వ్యవసాయాధికారులకు సమాచారం అందించాలన్నారు.
వానకాలం సాగుకు సిద్ధమైన రైతాంగానికి అవసమైన పచ్చిరొట్ట విత్తనాలను రాయితీపై ప్రభుత్వం సరఫరా చేస్తుందని, జిల్లాకు సరిపడా చేరుకున్నాయని కలెక్టర్ వెల్లడించారు. రైతులను అందోళనకు గురిచేసేందుకు ప్రచా రం చేస్తున్న వారిని పట్టించుకోకుండా అధికారుల సలహాలు, సూచనలు తీసుకోవాలని సూచించారు. జిల్లాకు 3,900 క్వింటాళ్ల జీలుగు విత్తనాలు, 1,981 క్వింటాళ్ల జను ము, 5,881 క్వింటాళ్ల పచ్చిరొట్ట విత్తనాలు కేటాయించారన్నారు. ప్రస్తుతానికి 2,217 క్వింటాళ్ల జీలుగ విత్తనాలు, 4,198 క్వింటాళ్ల పచ్చిరొట్ట విత్తనాలు చేరుకున్నాయన్నారు.
జిల్లాలోని 55 కేంద్రాలతో రైతులకు విత్తనాలు సరఫరా చేస్తున్నామని, 2,028 క్వింటాళ్ల జీలుగ విత్తనాలు రెండు, మూడు రోజుల్లో వస్తాయని, పూర్తిస్థాయిలో విత్తనాలు జిల్లాకు రాగానే అందిస్తామని కలెక్టర్ స్పష్టం చేశారు. రైతులను మోసం చేసి లబ్ధి పొందేందుకు డీలర్లు పాల్పడితే కఠిన చర్యలు తప్పవన్నారు. ముఖ్యంగా నకిలీ విత్తనాలను డీలర్లు అమ్మినా, నాణ్యతలేని విత్తనాలు అమ్మినా ఆయా దుకాణాలపై దాడులు చేసి లైసెన్సుల రద్దుకు ప్రభుత్వాని సిఫారుసు చేస్తామన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ మాధురి, అదనపు ఎస్పీ సంజీవ్రావ్, జిల్లా వ్యవసాయాధికారి నర్సింహరావు పాల్గొన్నారు.