సంగారెడ్డి కలెక్టరేట్, డిసెంబర్ 9: ప్రజావాణి ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని సంగారెడ్డి కలెక్టర్ వల్లూరు క్రాంతి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో అదనపు కలెక్టర్లు చంద్రశేఖర్, మాధురి, ట్రైనీ కలెక్టర్ మనోజ్‌లతో కలిసి కలెక్టర్ 74 అర్జీలు స్వీకరించారు. అనంతరం మాట్లాడుతూ అర్జీలు పెండింగ్‌లో పెట్టకుండా పరిష్కరించాలన్నారు.
ఆస్తితోపాటు డబ్బులు కాజేసిన కొడుకు ఇంటి నుంచి నెట్టేశాడని, ఏమి చేయాలో తెలియక ప్రజావాణికొచ్చి ఫిర్యాదు చేసింది ఓ వృద్ధురాలు. కలెక్టర్‌కు అందించిన ఫిర్యాదు ప్రకారం ఆమె మాటల్లోనే. నా పేరు పట్లొళ్ల అన్నమ్మ, మాది వట్పల్లి మండల కేంద్రం, నాకు ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్ద కొడుకు ప్రభుత్వ ఉద్యోగం చేస్తుండగా, చిన్నకొడుకు ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాడు. మాకు బూసరెడ్డిపల్లిలో 11 ఎకరాల భూమి ఉం డగా, ఆ భూమి సింగూర్ ముంపునకు గురైం ది.
దీంతో ప్రభుత్వం ఇచ్చిన భూమి డబ్బులను బ్యాంకులో జమ చేశాను. అయితే నా పెద్ద కొడుకు ఆ డబ్బులను బ్యాంకు నుంచి డ్రా చేయించి తీసుకున్నాడు. సంగారెడ్డిలోని శిల్పా వెంచర్లో రూ.75లక్షల విలువైన ఇల్లు కట్టుకున్నాడు. గ్రామంలోని రూ.50లక్షల విలువైన ఇల్లు తన పేరున చేయించుకున్నాడు. సంగారెడ్డి, వట్పల్లిలలో ఉన్న రెండు ఇండ్లు అతడి పేరున ఉన్నాయి. ఇప్పుడు భార్యతో కలిసి నాపై దాడి చేసి, ఇంటి నుంచి గెంటివేశాడు. ఆస్తిని కాజేయడమే కాకుండా, డబ్బులు తీసుకొని వేధింపులకు గురిచేస్తున్న పెద్దకొడుకుపై చర్యలు తీసుకోవాలి.
బైపాస్ రోడ్డులోని పాత డీఆర్డీఏ కార్యాలయంలో ఉన్న ఈవీఎంల స్ట్రాంగ్ రూమ్‌ను కలెక్టర్ పరిశీలించారు. ఎన్నికల నియమావళి, ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ప్రతి మూడు నెలలకు ఒక సారి ఈవీఏంల స్ట్రాంగ్ రూమ్ పరిశీలిస్తామన్నారు. స్ట్రాంగ్ రూమ్ ప్రాంతంలోని భద్రతా ఏర్పాట్లు, పోలీసు బందోబస్తు, సీఈ కెమెరాల పనితీరును క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు.