సంగారెడ్డి కలెక్టరేట్, మే 1: జిల్లాలో నిరక్షరాస్యతను నిర్మూలించి 100 శాతం అక్షరాస్యత సాధించాలని సంగారెడ్డి కలెక్టర్ వల్లూరు క్రాంతి పిలుపునిచ్చారు. గురువారం సంగారెడ్డి కలెక్టరేట్లోని మినీ సమావేశ మందిరంలో నిర్వహించిన సమన్వయ సమావేశంలో ఆమె మాట్లాడారు. న్యూ ఇండియా లిటరసీ కార్యక్రమంలో భాగంగా మహిళా సంఘాల్లో ఉన్న మహిళలందరూ తప్పనిసరిగా 100 శాతం అక్షరాస్యత కలిగి ఉండాలన్నారు.
ఓపెన్ స్కూల్ విధానంలో అందిస్తున్న పదో తరగతి, ఇంటర్మీడియట్ కోర్సులను సద్వినియోగం చేసుకోవాలన్నారు. జిల్లాలో మహిళా సాధికారతలో భాగంగా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఇందులో భాగంగా డ్రోన్లు, మహిళా పెట్రోల్ బంకులు, వాణిజ్య సముదాయాలు, ఇటుకల తయారీ, విద్యార్థులకు ఏకరూప దుస్తుల కుట్టు వంటి కార్యక్రమాలు జిల్లాలో అందుబాటులోకి తెచ్చామన్నారు.
శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలకు 80 శాతం సబ్సిడీ కింద డ్రోన్లు అందించాలన్నారు. క్యాబ్ డ్రైవర్ శిక్షణ పొంది లైసెన్స్ తీసుకున్న మహిళలకు జిల్లాలోని ప్రైవేట్ కంపెనీల్లో క్యాబ్ డ్రైవర్లుగా ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్నారు.సమావేశంలో సంగారెడ్డి అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, డీఆర్డీవో జ్యోతి, మెప్మా పీడీ గీత, జిల్లా ఓపెన్ స్కూల్ కోఆర్డినేటర్ వెంకటస్వామి, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.