చిన్నశంకరంపేట, అక్టోబర్ 16: ఉపాధ్యాయులు విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహించి నాణ్యమైన విద్యను అందించాలని మెదక్ కలెక్టర్ రాహుల్‌రాజ్ అన్నారు. బుధవారం ఆయన చిన్నశంకరంపేట జడ్పీ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలో విద్యార్థులకు గణితం బోధించారు. వంట గదులను, మూత్రశాలను పరిశీలించారు. ఉపాధ్యాయులతో సమావేశమై పలు సూచనలు చేశారు. విద్యార్థులకు పలు ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టారు.
విద్యార్థుల నుంచి సరైన సమాధానం రాకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. గణితం, ఆంగ్లంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఉపాధ్యాయులకు సూచించారు. పదోతరగతి విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించి, మంచి ఫలితాలు సాధించాలన్నారు. ఇప్పటి నుంచే 9వ తరగతి విద్యార్థులకు పదో తరగతి సిలబస్‌పై అవగాహన కల్పించాలని ఆదేశించారు. మెనూ ప్రకారం విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని, పాఠశాల ఆవరణ ను, మూత్రశాలను ఎప్పటికప్పుడు పరిశీలించి శుభ్రంగా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.
ఎలాంటి సమాచారం లేకుం డా పాఠశాలకు గైర్హాజరైతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం చిన్నశంకరంపేట గ్రామంలోని మురుగు కాలువలను పరిశీలించారు. డ్రైడేను కచ్చితంగా అమలు చేయాలన్నారు. ఇంటి పరిసరాల్లో నీటి నిల్వ లేకుండా చూసుకోవాలన్నారు. వ్యక్తిగత పరిశుభ్రతతోపాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో దామోదర్, ఎంపీవో, ఉపాధ్యాయులు ఉన్నారు.