నర్సాపూర్,ఆగస్టు 6 : పరిసరాలను శుభ్రంగా ఉంచాలని మెదక్ జిల్లా ప్రత్యేకాధికారి భారతి హోళికేరి అధికారులకు సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛదనం-పచ్చదనంలో భాగంగా ఆమె మెదక్ కలెక్టర్ రాహుల్‌రాజ్‌తో కలిసి మంగళవారం మెదక్ జిల్లా నర్సాపూర్ మున్సిపాలిటీలో పర్యటించారు. అనంతరం నర్సాపూర్ పట్టణంలో ర్యాలీలో పాల్గొని 3వ వార్డులోని రాయరావు చెరువు, తూప్రాన్ మార్గంలోని కోమటికుంటను సందర్శించారు.
నాలుగో వార్డు నందు రక్షిత తాగునీటి నాణ్యతను పరిశీలించారు. అనంతరం ఒకటోవార్డులో విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పారిశుధ్య నిర్వహణ, పచ్చదనం పెంపు లక్ష్యంతో ప్రభుత్వం ఆగస్టు 5 నుంచి 9 వరకు స్వచ్ఛదనం-పచ్చదనం కార్యక్రమాన్ని అమలు చేస్తున్నదన్నారు. సీజనల్ వ్యాధుల నియంత్రణకు వారంలో రెండు రోజులు డ్రైడే గా పాటించాలని, ఇంట్లోని పాత టైర్లు, కొబ్బరి చిప్పలు, ప్లాస్టిక్ వస్తువుల్లో నిల్వ ఉన్న నీటిని తొలిగించాలని, ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.
డెంగీ వ్యాధి నియంత్రణలో మెదక్ జిల్లా పనితీరు మెరుగ్గా ఉం దని, భవిష్యత్‌లో ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని అధికారులకు సూచించారు. విద్యుత్ లైన్లు, తాగునీటి సరఫరా, పైప్లైన్లకు దూరంగా అవెన్యూ ప్లాంటేషన్ మొక్కలు నాటాలని సూచించారు.
నిర్దేశిత షెడ్యుల్ ప్రకారం స్వచ్ఛదనం-పచ్చదనం కార్యక్రమాలను పక్కాగా నిర్వహించి రాష్ట్రంలోనే మెదక్ జిల్లాను పథమ స్థానంలో ఉండే విధంగా కృషి చేయాలని మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్‌రాజ్ అన్నారు. ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తి స్థాయి లో తగ్గించాలని పిలుపునిచ్చారు. స్వచ్ఛదనం-పచ్చదనం కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో మెదక్ జిల్లా పంచాయతీ అధికారి యాదయ్య, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి శ్రీనివాసరావు, మున్సిపల్ కమిషనర్ జైత్రామ్నాయక్, మున్సిపల్ చైర్మన్ అశోక్‌గౌడ్, కౌన్సిలర్లు పాల్గొన్నారు.
శివ్వంపేట, ఆగస్టు 6 : స్వచ్ఛదనం-పచ్చదనం కార్యక్రమాన్ని పక్కాగా అమలు చేయాలని మెదక్ జిల్లా ప్రత్యేకాధికారి భారతిహోళికేరి, మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్‌రాజ్ అన్నారు. మెదక్ జిల్లా శివ్వంపేట మండలంలోని చిన్నగొట్టిముక్ల గ్రామాన్ని వారు సందర్శించి స్వచ్ఛదనం-పచ్చదనం కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రత్యేకాధికారి ప్రతాప్‌సింగ్, ఎంపీడీవో నాగేశ్వర్గుప్తా, ఎంపీవో తిరుపతిరెడ్డి, మాజీ సర్పం చ్ బాలమణీనరేందర్, మాజీ ఎంపీటీసీ నువ్వుల దశరథ, పాపయ్యచారి పాల్గొన్నారు.