మెదక్, ఆగస్టు 23 (నమస్తే తెలంగాణ) : ప్రజలకు, రైతులకు ప్రయోజనకారిగా ఉండేలా ఆర్వోఆర్ చట్టాన్ని తెచ్చేందుకు ప్రభుత్వం కృషిచేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ రాహుల్‌రాజ్ తెలిపారు. శుక్రవారం ఐడీవోసీ కార్యాలయ సమావేశపు హాల్లో ఆర్వోఆర్ ముసాయిదా చట్టం-2024 అమలుపై వివిధ వర్గాల ప్రజల నుంచి సలహాలు, సూచనలు తీసుకునేందుకు ఏర్పాటు చేసిన చర్చా వేదికలో తూప్రాన్ ఆర్డీవో జయచంద్రారెడ్డి, నర్సాపూర్ ఆర్డీవో జగదీశ్వర్‌రెడ్డి, మెదక్ ఆర్డీవో రమాదేవితో కలిసి జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ… రైతుల ఇబ్బందులు గుర్తించిన ప్రభుత్వం అందరితో సమాలోచన చేసి చట్టం తెచ్చేందుకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఈ చర్చా వేదిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం నూతన హకుల రికార్డు బిల్లు- 2024 రూపకల్పన సందర్భంగా న్యాయవాదులు, రైతులు, రైతు సంఘాలు, రైతులు, ఉద్యోగ విరమణ చేసిన అధికారులు, సిబ్బంది, మేధావులు ఇలా అన్నివర్గాల ప్రజల అభిప్రాయ సేకరణకు చర్చా వేదిక నిర్వహించినట్లు తెలిపారు. ఈ చట్టం రూపకల్పనలో క్షేత్రస్థాయిలో ప్రజల సూచనలు, సలహాలను తీసుకోవాలని, ఈ నూతన ముసాయిదా చట్ట రూపకల్పనలో భాగంగా అభిప్రాయ సేకరణలో ఇచ్చిన సలహాలు,
సూచనలు ప్రభుత్వానికి అందజేయనున్నట్లు తెలిపారు. ఆర్వోఆర్ చట్ట రూపకల్పనలో భాగంగా ప్రభుత్వం అభ్యంతరాలు సలహాలు, సూచనలకు వెబ్సైట్ అందుబాటులోకి తెచ్చిందని, వెబ్సైట్లో మీ సలహాలు, సూచనలు అందజేయాలని ఆయన సూచించారు.సమావేశంలో వ్యవసాయ శాఖ జిల్లా అధికారి గోవింద్, అన్ని మండలాల తహసీల్దార్లు, న్యాయవాదులు, రిటైర్డు ఉద్యోగులు, రైతు సంఘాల నాయకులు, రైతులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
సిద్దిపేట కలెక్టరేట్, ఆగస్టు 23: సిద్దిపేట జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో శుక్రవారం కలెక్టర్ మనుచౌదరి అధ్యక్షతన తెలంగాణ ప్రభుత్వ నూతన ఆర్వో ఆర్ 2024 ముసాయిదా బిల్లుపై చర్చా వేదికను నిర్వహించారు. ఈ వేదికలో కలెక్టర్ మాట్లాడుతూ.. తెలంగాణ నూతన ఆర్వోఆర్-2024 ముసాయిదా బిల్లు మేధావులకు, ఆడ్వకేట్లకు,ప్రజాప్రతినిధులకు, రాజకీయ పార్టీల ప్రతినిధులకు, విలేకరులకు, ప్రజలకు అవగాహన కల్పించి చట్టంలో పొందుపర్చాల్సిన 20 అంశాలపై వారి నుంచి సలహాలు, సూచనలు తీసుకోవడానికి చర్చావేదిక నిర్వహించినట్లు తెలిపారు. ఈ చర్చా వేదికలో మీరు ఇచ్చిన సలహాలు, సూచనలు ప్రతి ఒక్కటి రికార్డు చేశామని, వాటిని ప్రభుత్వానికి అందజేస్తామని తెలిపారు. కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా అదనపు కలెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి, సిద్దిపేట, గజ్వేల్, హుస్నాబాద్ ఆర్డీవోలు సదానందం, బన్సీలాల్ రామ్మూర్తి, కలెక్టర్ ఏవో రెహమాన్, తదితరులు పాల్గొన్నారు.