మెదక్, ఆగస్టు 3(నమస్తే తెలంగాణ): మెదక్‌ను టూరిస్ట్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులకు కలెక్టర్ ప్రతిమాసింగ్ ఆదేశాలు జారీ చేశారు. సోమవారం కలెక్టరేట్లో ఆర్వీ కన్సల్టెంట్ ప్రతినిధులు, నందన, టూరిజం డీఈ శ్రీశైలం, ఈడీఎం సందీప్, డీపీఆర్వో రామచంద్రరాజుతో సమీక్షించారు.
ఆర్వీ కన్సల్టెంట్ ప్రతినిధులు, టూరిస్ట్ శాఖ అధికారులు మెదక్ ఖిల్లా, పోచారం అభయారణ్యాన్ని సందర్శించి పలు విషయాలు కలెక్టర్‌కు వివరించారు. జిల్లాలో పర్యాటక అభివృద్ధికి పటిష్టమైన చర్యలు తీసుకోవాలన్నారు. ఆధ్యాత్మిక, చారిత్రక, పర్యావరణ ప్రదేశాలు ఉండడం జిల్లాకు వరమన్నారు. అధికారులు సమన్వయంతో పనిచేసి జిల్లాను టూరిస్ట్ హబ్‌గా ఏర్పాటు చేసేందుకు కృషి చేయాలన్నారు.
మెదక్ జిల్లాలో ఎస్ఐఆర్ ఎన్యుమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ ప్రక్రియపై కలెక్టర్ ప్రతిమా సింగ్‌తో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్‌రెడ్డి వీడియో కాన్ఫరెన్స్‌లో సమీక్ష నిర్వహించి పలు సూచనలు చేశారు. డిజిటలైజేషన్ ప్రక్రియను పారదర్శకంగా పూర్తిచేసేందుకు అధికారులు కృషి చేయాలన్నారు. ఎస్ఐఆర్ డిజిటలైజేషన్ పోలింగ్ కేంద్రాల రేషనలైజేషన్ ప్రక్రియపై సమీక్షించారు. ఒకే కుటుంబానికి చెందిన సభ్యులకు వేర్వేరు పోలింగ్ కేంద్రాల్లో ఓటు ఉంటే వారిని ఒకే పోలింగ్ కేంద్రం కిందకు వచ్చేలా రేషనలైజేషన్ చేయాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ నగేశ్, ఆర్డీవో రామకృష్ణ, తహసీల్దార్ లక్ష్మణ్‌బాబు, ఎన్నికల సూపరింటెండెంట్ సింగ్, అధికారులు తదితరులు పాల్గొన్నారు.