పహాణీల ఆధారంగా భూయజమానుల గుర్తింపు
కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్
సిద్దిపేట ప్రజావాణిలో అర్జీల స్వీకరణ
ములుగులో ధరణి పైలట్ ప్రాజెక్టు సందర్శన
సిద్దిపేట అర్బన్, జూన్ 20 : ప్రజా సమస్యలపై తక్షణమే స్పందించాలని అధికారులను కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో ఆయన పాల్గొన్నారు. జిల్లా వ్యాప్తంగా వివిధ సమస్యల పరిష్కారం కోసం వచ్చిన అర్జీలను అదనపు కలెక్టర్(స్థానిక సంస్థలు)తో కలిసి స్వీకరించారు. ప్రజావాణికి 91 దరఖాస్తులు వచ్చాయని కలెక్టర్ పేర్కొన్నారు. ఎంతో ఆశతో తమ సమస్యలు తీరుతాయని ప్రజావాణి కార్యక్రమానికి ప్రజలు వస్తారని, వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా సంబంధిత శాఖల అధికారులు తక్షణమే స్పందించి సమస్యను పరిష్కరించి న్యాయం చేయాలన్నారు. ఇందులో భాగంగా సిద్దిపేట పట్టణం గణేశ్‌నగర్‌కు చెందిన పిన్నం రాజమౌళి అనే దివ్యాంగుడు తనకు వినికిడి లోపం ఉందని, యంత్రం ఇవ్వాల్సిందిగా కోరగా, స్పందించిన కలెక్టర్, వయో వృద్ధుల సంక్షేమ శాఖ ద్వారా అప్పటికప్పుడే తెప్పించి అందజేశారు. జిల్లా రెవెన్యూ అధికారి చెన్నయ్య, కలెక్టరేట్ ఏవో రెహ్మాన్, అధికారులు పాల్గొన్నారు.
పెండింగ్‌లో ఉండొద్దు..
భూ సమస్యలు పెండింగ్‌లో ఉండకుండా వీలైనంత తొందరగా పరిష్కరించాలని ఆర్డీవోలు, తహసీల్దార్లకు కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ ఆదేశించారు. ధరణిలోని భూసమస్యలను పరిష్కరించేందుకు సోమవారం కలెక్టరేట్ కార్యాలయంలో ఆర్డీవోలు, తహసీల్దార్లకు అవగాహన కల్పించారు. ముందుగా అన్ని మండలాల తహసీల్దార్లతో పాటు కలెక్టరేట్ రెవెన్యూ బృందాన్ని పరిచయం చేసుకున్నారు. ప్రజావాణిలో వచ్చిన ధరణి సమస్యలను పరిష్కరించే పద్ధతి గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. భూసమస్యలు పరిష్కరించుకోవడానికి తప్పనిసరిగా చెక్ లిస్ట్ గురించి తెలుసుకోవాలన్నారు. ప్రజావాణి అర్జీలను సకాలంలో పరిష్కరించి కలెక్టరేట్‌కు రిపోర్ట్ పంపాలని తెలిపారు. అడిషనల్ కలెక్టర్ ముజామ్మిల్‌ఖాన్, డీఆర్వో చెన్నయ్య, ఆర్డీవోలు అనంతరెడ్డి, విజయేందర్‌రెడ్డి, జయచంద్రారెడ్డి, ఏవో రహ్మాన్, రెవెన్యూ బృందం పాల్గొన్నారు.
పక్కాగా ఎంపిక ప్రక్రియ
ములుగు, జూన్ 20 : పాత పహాణీలను క్షుణ్ణంగా పరిశీలించి, వాటి ఆధారంగా భూయజమానులను గుర్తించి, ధరణి సమస్యలను పరిష్కరిస్తున్నామని కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ అన్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు పైలట్ ప్రాజెక్ట్‌గా ములుగులో చేపట్టిన ధరణి కార్యక్రమంలో సోమవారం కలెక్టర్ పాల్గొన్నారు. అధికారులతో కలిసి రికార్డులను పరిశీలించారు. ములుగు పంచాయతీ పరిధిలో ధరణి భూ సమస్యలున్న రైతుల లిస్టు తయారు చేసి, వారు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేలా చొరవ తీసుకోవాలని సర్పంచ్ బట్టు మాధవిని సూచించారు. గ్రామస్తులందరికీ అందుబాటులో ఉండేలా జీపీలో మీసేవా కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. రెవెన్యూ అధికారులు తమ పూర్తి సమయాన్ని కేటాయించి, వందశాతం భూసమస్యలను పరిష్కరించాలని సూచించారు. రైతుల నుంచి ఏవైనా కొత్త సమస్యలు వస్తే, అధికారులు వాటిని నోట్ చేసుకోవాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఆర్డీవో విజయేందర్‌రెడ్డి, డీసీసీబీ డైరెక్టర్ బట్టు అంజిరెడ్డి, డిప్యూటీ తహసీల్దార్ రఘువీర్‌రెడ్డి పాల్గొన్నారు.