సిద్దిపేట,జూలై14: కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్లాలో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులు, పథకాల పరిశీలనకు వచ్చిన కేంద్ర బృందానికి అధికారులు వివరాలు అందించాలని సిద్దిపేట కలెక్టర్ హైమావతి సూచించారు. సిద్దిపేట జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో చేపట్టిన పథకాల పరిశీలనకు వచ్చిన కేంద్ర బృందం సభ్యులు జోసెఫ్, వినోద్‌తో సోమవారం ఆమె సమావేశమయ్యారు. క్షేత్రస్థాయిలో పర్యటించి పరిశీలించాల్సిన వివిధ పనులపై చర్చించారు.
ఈ సందర్భంగా సిద్దిపేట కలెక్టర్ మాట్లాడుతూ కేంద్ర గ్రామీణ అభివృద్ధిశాఖ పంపించిన బృందం నేటి నుంచి ఈ నెల 24వ తేదీ వరకు సిద్దిపేట జిల్లాలోని బెజ్జంకి, అకన్నపేట, కొమరవెల్లి మండలాల్లో క్షేత్రస్థాయిలో పర్యటిస్తుందన్నారు. ఎంఎన్ఆర్జీఎస్, పింఛన్లు, వాటర్‌షెడ్, గ్రామీణ సడక్యోజన, పీఎం ఆవాస్ యోజన, గ్రామపంచాయతీలు తదితర 12 రకాల పథకాల అమలును క్షేత్రస్థాయిలో పరిశీలించి లబ్ధిదారులతో మాట్లాడి కేంద్ర ప్రభుత్వ గ్రామీణాభివృద్ధిశాఖకు నివేదిక అందజేస్తారన్నారు.
ఆయా మండలాల్లో ఎంపీడీవోలు, ఎంపీవోలు, ఏపీఎంలు, ఏపీవోలు సంబంధిత అధికారులు అందుబాటులో ఉండి వివరాలు అందించాలని ఆదేశించారు. సమావేశంలో సిద్దిపేట జిల్లా అదనపు కలెక్టర్లు గరిమాఅగర్వాల్, అబ్దుల్‌హమీద్, డీఆర్డీవో జయదేవ్‌ఆర్యా, హౌసింగ్ పీడీ దామోదర్‌రావు, ఎల్డీఎం హరిబాబు, పంచాయతీరాజ్ ఈఈలు చిరంజీవి, శ్రీనివాస్‌రెడ్డి, డీపీవో దేవకీదేవి, డివిజినల్ పంచాయతీ అధికారులు, డీఆర్డీవో కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.