సిద్దిపేట, నవంబర్ 26: గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అధికార యంత్రాంగాన్ని సిద్దిపేట జిల్లా కలెక్టర్ కె.హైమావతి ఆదేశించారు. ఎన్నికల ఏర్పాట్లపై బుధవారం సిద్దిపేటలోని ఐడీవోసీ సమావేశ మందిరంలో పోలీస్ కమిషనర్ విజయ్‌కుమార్‌తో కలిసి జిల్లా ఎన్నికల కోఆర్డినేషన్ కమిటీ సమావేశం నిర్వహించి అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. సిద్దిపేట జిల్లాలో మూడు విడతల్లో 508 గ్రామపంచాయతీల్లో ఎన్నికల నిర్వహణకు 4508 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎన్నికల ప్రవర్తన నియమావళికి పక్కాగా అమలు చేయాలన్నారు.
ఎస్ఎస్టీ, ఎఫ్ఎస్టీ తదితర బృందాల ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నవంబర్ 27న మొదటి విడత, 30న రెండో విడత, డిసెంబర్ 3న మూడో విడత నామినేషన్లు స్వీకరించనున్నట్లు చెప్పారు. నామినేషన్ దాఖలు చేయడానికి అభ్యర్థితో పాటు కేవలం ముగ్గురికే అనుమతి ఉంటుందని, నామినేషన్ కేంద్రానికి 100 మీటర్ల పరిధిలో ఎవ్వరినీ అనుమతించవద్దని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. నామినేషన్ల పరిశీలనకు సంబంధించి ఆర్డీవోలకు అప్పీలు చేయవచ్చని చెప్పారు. దశల వారీగా అభ్యర్థులు వారి నామినేషన్లను ఉపసంహరించుకోవచ్చని, పోలింగ్ ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్, మధ్యాహ్నం 2 గంటల నుంచి కౌంటింగ్ మండల కేంద్రాల్లోనే నిర్వహించనున్నట్లు తెలిపారు.