రెండు రోజుల మహారాష్ట్ర పర్యటనకు సోమవారం రోడ్డు మార్గంలో బయలుదేరి వెళ్లిన సీఎం కేసీఆర్‌కు సంగారెడ్డి జిల్లాలో ఘనస్వాగతం లభించింది. మంత్రులు, ఎమ్మెల్యేలతో 600 వాహనాల్లో తరలివెళ్లిన భారీ కాన్వాయ్కి అధికారులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, ప్రజలు ఆత్మీయ ఆహ్వానం పలికారు. కంది వద్ద బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, హెచ్‌డీసీ చైర్మన్ చింతాప్రభాకర్, జడ్పీచైర్‌పర్సన్ మంజుశ్రీ, కర్ణాటక బోర్డర్ వద్ద కలెక్టర్ శరత్‌కుమార్, ఎస్పీ రమణకుమార్ స్వాగతం పలికారు. ముఖ్యమంత్రి వెంట మంత్రి హరీశ్‌రావుతోపాటు ఎమ్మెల్యేలు మహిపాల్‌రెడ్డి, మదన్‌రెడ్డి, క్రాంతికిరణ్, మాణిక్‌రావు, భూపాల్‌రెడ్డి వెళ్లారు. సంగారెడ్డి జిల్లా ముఖద్వారం బీహెచ్ఈఎల్ నుంచి రామచంద్రాపురం, పటాన్చెరు, కంది, సంగారెడ్డి, సదాశివపేట, కంకోల్, కోహీర్, జహీరాబాద్, రాష్ట్ర సరిహద్దులోని చివరి గ్రామమైన చరక్పల్లి వరకు రోడ్డుకిరువైపులా జనం భారీసంఖ్యలో చేరుకుని కాన్వాయ్‌పై పూల వర్షం కురిపించారు. కేసీఆర్ ఫొటోలు, ఫ్లెక్సీలు, బీఆర్ఎస్ జెండాలు పట్టుకుని సీఎం జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. మహిళలు బోనాలు, బతుకమ్మలతో తరలివచ్చి సందడి చేశారు. జిల్లాలో 100 కిలోమీటర్లకుపైగా ప్రయాణం సాగగా, ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు పకడ్బందీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
– సంగారెడ్డి న్యూస్ నెట్వర్క్, జూన్ 26
జహీరాబాద్, జూన్ 26: సీఎం కేసీఆర్ మహారాష్ట్ర పర్యాటనకు రోడ్డుమార్గంలో బయల్దేరారు. సోమవారం 12.30గంటలకు సీఎం కేసీఆర్ జహీరాబాద్ మండలంలోని చెరాగ్‌పల్లి శివారులో కర్ణాటక సరిహద్దు రవాణా శాఖ చెక్‌పోస్టుకు చేరుకున్నారు. చెక్‌పోస్టు వద్ద కలెక్టర్ శరత్, ఎస్పీ రమణకుమార్ సీఎం కేసీఆర్‌కు స్వాగతం పలికారు. ప్రగతిరథంలో ఉన్న సీఎం కేసీఆర్ అభివాదం చేశారు. జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్‌రావు నియోజకవర్గం సరిహద్దు కొత్తూర్(డి) నుంచి రాష్ట్ర సరిహద్దులో ఉన్న మాడ్గి శివారు వరకు భారీగా బ్యానర్లు ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే మాణిక్‌రావు ఆధ్వర్యంలో ముఖ్య నాయకులు సీఎం కేసీఆర్ వెంట మహారాష్ట్రకు తరలివెళ్లారు.
గులాబీ శ్రేణుల సందడి
సంగారెడ్డి, జూన్ 26(నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి కేసీఆర్ భారీ కాన్వాయ్‌తో సోమవారం మహారాష్ట్ర బయలుదేరివెళ్లారు. సీఎం కేసీఆర్ 600వాహనాల భారీ కాన్వాయ్‌తో హైదరాబాద్ నుంచి రోడ్డుమార్గంలో సంగారెడ్డి జిల్లా నుంచి మహారాష్ట్రకు వెళ్లారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ భారీ కాన్వాయ్‌తో హైదరాబాద్ నుంచి ఢిల్లీకి వెళ్లి చరిత్ర సృష్టించారు. అదేతరహాలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, బీఆర్ఎస్ శ్రేణులతో భారీసంఖ్యలో రోడ్డుమార్గంలో మహారాష్ట్రకు వెళ్లారు. సీఎం కేసీఆర్ ప్రత్యేక బస్సులో ప్రయాణించగా వాహనంలో ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు, ఇతర మంత్రులు, సంగారెడ్డి జిల్లా ఎమ్మెల్యేలు మహిపాల్‌రెడ్డి, క్రాంతికిరణ్, మాణిక్‌రావు, భూపాల్‌రెడ్డి ఉన్నారు. రాష్ట్రంలోని ఇతర ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సీఎం వెన్నంటే ఉన్నారు. సంగారెడ్డి జిల్లాలో 100 కిలోమీటర్లకు పైగా ప్రయాణించి సీఎం కేసీఆర్ మొదట కర్ణాటక ఆ తర్వాత మహారాష్ట్రలోకి ప్రవేశించారు. సంగారెడ్డి జిల్లాలో ప్రయాణించిన సీఎం కేసీఆర్‌కు అడుగడుగునా నీరాజనం పట్టారు. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు జిల్లా ప్రవేశద్వారమైన బీహెచ్ఈఎల్ నుంచి జిల్లా సరిహద్దు ప్రాంతమైన చెరక్పల్లి వరకు అడుగడుగునా సీఎం కేసీఆర్‌కు ఘన స్వాగతం పలికారు.
సంగారెడ్డి మీదుగా మహారాష్ట్రకు సీఎం కేసీఆర్
ముఖ్యమంత్రి కేసీఆర్ సోమ, మంగళవారాల్లో రెండురోజులు మహారాష్ట్రలో పర్యటించనున్నారు. అబ్కి బార్ కిసాన్ సర్కారు పేరుతో సీఎం కేసీఆర్ మహారాష్ట్రలో సంచలనం సృష్టించనున్నారు. ఇందులో భాగంగానే సీఎం కేసీఆర్ కేబినెట్ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి రోడ్డు మార్గంంలో హైదరాబాద్ నుంచి మహారాష్ట్ర వెళ్లారు. ఉదయం 10.30 గంటలకు హైదరాబాద్ నుంచి బయలుదేరిన సీఎం కేసీఆర్ 11.15 గంటలకు సంగారెడ్డి జిల్లా ప్రవేశద్వారమైన బీహెచ్ఈఎల్కు చేరుకున్నారు. 600కు పైగా వాహనాల శ్రేణితో సీఎం కేసీఆర్ సంగారెడ్డి జిల్లాలో ప్రవేశించారు. సీఎం కేసీఆర్ ప్రత్యేక బస్సులో రామచంద్రాపురం, పటాన్చెరు, కంది, సంగారెడ్డి, సదాశివపేట, కంకోల్, కోహీర్, జహీరాబాద్ మీదుగా జాతీయ రహదారిపై 12గంటల వరకు ఎక్కడా ఆగకుండా ప్రయాణం చేశారు. సీఎం కేసీఆర్ ప్రత్యేక బస్సు వెన్నంటే మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నాయకులు వాహనాలు వేగంగా తరలివెళ్లాయి. 65వ నెంబరు జాతీయ రహదారిపై 600కుపైగా వాహనాలు ఒకదాని వెంట ఒకటి వేగంగా తరలివెళ్లడం చూసి జనం ఆశ్చర్యచకితులయ్యారు. సీఎం కేసీఆర్ కాన్వాయ్ వెళ్లినతర్వాత కూడా బీఆర్ఎస్ నాయకులు వాహనాల్లో పెద్దసంఖ్యలో మహారాష్ట్రకు వెళ్తూనే ఉన్నారు. 12.10 గంటలకు తెలంగాణ రాష్ట్ర సరిహద్దులోని చివరి గ్రామమైన చరక్పల్లి మీదుగా కర్ణాటకలోకి ఆ తర్వాత మహారాష్ట్రలోకి ప్రవేశించింది. సీఎం కేసీఆర్ పర్యటన నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
సీఎం కేసీఆర్‌కు అడుగడుగునా స్వాగతం
సంగారెడ్డి మీదుగా మహారాష్ట్ర వెళ్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌కు బీఆర్ఎస్ సంగారెడ్డి జిల్లా ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, ప్రజలు ఘనస్వాగతం పలికారు. సీఎం కేసీఆర్ ప్రయాణించే 65 జాతీయరహదారికి ఇరువైపులా సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావుకు స్వాగతం పలుకుతూ ఎమ్మెల్యేలు భారీ కటౌట్లు, ప్లెక్సీలను పెద్దసంఖ్యలో ఏర్పాటు చేశారు. పటాన్చెరు, సంగారెడ్డి, అందోలు, జహీరాబాద్ నియోజకవర్గాలోని బీఆర్ఎస్ నాయకులు రోడ్డుకు ఇరువైపులా ఉండి సీఎం కేసీఆర్‌కు స్వాగతం పలికారు. సీఎం కేసీఆర్ బస్సులో నుంచి పార్టీ నాయకులను, కార్యకర్తలను చూసి అభివాదం చేస్తూ హుషారు నింపారు. సీఎం కేసీఆర్ వాహనంపై బీఆర్ఎస్ నాయకులు గులాబీపూలు చల్లుతూ, సీఎం కేసీఆర్ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. పటాన్చెరులు ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి సోదరుడు మధుసూదన్‌రెడ్డి, ఇతర ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్‌కు ఘన స్వాగతం పలికారు.
ఇస్నాపూర్ చౌరస్తా వద్ద బీఆర్ఎస్ నేత నీలం మధుముదిరాజ్ భారీసంఖ్యలో కార్యకర్తలతో కలిసి సీఎం కేసీఆర్‌కు స్వాగతం పలికారు. సంగారెడ్డి మండలం కవలంపేట వద్ద డీసీసీబీ వైస్‌చైర్మన్ మాణిక్యం పార్టీ నాయకులు, ప్రజలతోకలిసి సాఏ్వగతం పలికారు. కంది వద్ద బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, జెడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీజైపాల్‌రెడ్డి, ప్రొటోకాల్‌ను అనుసరించి కర్ణాటక సరిహద్దు సమీపంలోని చెరక్పల్లి గ్రామం వద్ద కలెక్టర్ శరత్, ఎస్పీ రమణకుమార్ సీఎం కేసీఆర్‌కు స్వాగతం పలికారు. బీఆర్ఎస్ నాయకులు కేసీఆర్ ఫొటోలు, జెండాలు పట్టుకుని సీఎం జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. మహిళలు సీఎం కేసీఆర్ బస్సుపై పూలుచల్లుతూ స్వాగతం పలికారు. సదాశివపేట, కోహీర్, జహీరాబాద్‌లో సీఎం కేసీఆర్‌కు బీఆర్ఎస్ శ్రేణులు ఘనస్వాగతం పలికాయి. సీఎం కేసీఆర్ పర్యటనతో జాతీయ రహదారి 65పై సందడి నెలకొంది. మహారాష్ట్రకు బయలుదేరుతున్న మెదక్, సంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తెలంగాణ సరిహద్దులో కలెక్టర్, ఎస్పీ స్వాగతం
సీఎంతో ఎమ్మెల్యే మదన్‌రెడ్డి
నర్సాపూర్, జూన్ 26: రెండు రోజుల పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మహారాష్ట్రకు భారీ కాన్వాయ్‌తో బయలుదేరారు. నర్సాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే చిలుముల మదన్‌రెడ్డి, ఇతర ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ నాయకులు సైతం ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు బయలుదేరారు. హైదరాబాద్‌లోని ప్రగతిభవన్ నుంచి రోడ్డుమార్గంలో రెండు ప్రత్యేక బస్సులు, 600 కార్లతో కూడిన భారీ కాన్వాయ్‌తో బయలుదేరారు. వీరిలో ఎమ్మెల్సీ యాదవరెడ్డి, ఆత్మకమిటీ చైర్మన్ గొర్రె వెంకట్‌రెడ్డి, జడ్పీ కోఆప్షన్ సభ్యుడు మన్సూర్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ రావూఫ్ ఉన్నారు.
సీఎం కేసీఆర్‌కు చింతా ప్రభాకర్ ఘనస్వాగతం
కంది, జూన్ 26: మహారాష్ట్ర పర్యటనకు వెళ్తున్న సీఎం కేసీఆర్‌కు కంది చౌరస్తాలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. రాష్ట్ర చేనేత అభివృద్ధి సంస్థ చైర్మన్ చింతా ప్రభాకర్ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు సీఎం కేసీఆర్ కాన్వాయ్‌పై పూలవర్షం కురిపించి స్వాగతం పలికారు. ప్రగతి రథం నుంచి సీఎం కేసీఆర్ చిరునవ్వుతో పార్టీ శ్రేణులకు అభివాదం చేస్తూ ముందుకుసాగారు. సీఎంకు స్వాగతం పలుకుతూ ప్రధాన రహదారిపై పెద్దఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అదేవిధంగా కౌలంపేట్లో డీసీసీబీ వైస్‌చైర్మన్ పట్నం మానిక్యం సీఎం కేసీఆర్‌కు స్వాగతం పలికారు. డప్పుచప్పుళ్లు, పార్టీ జెండాలతో స్వాగతం పలికారు. స్వాగతం పలికిన వారిలో జడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీజైపాల్‌రెడ్డి, కంది ఎంపీపీ సరళాపుల్లారెడ్డి, జడ్పీటీసీ కొండల్‌రెడ్డి, సీడీసీ చైర్మన్ కాసాల బుచ్చిరెడ్డి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ నరహరిరెడ్డి, బీఆర్ఎస్ కంది మండల అధ్యక్షుడు మధుసూదన్‌రెడ్డి, నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.