మక్క రైతులకు సీఎం కేసీఆర్ అండగా నిలబడ్డారు. పంట కనీస మద్దతు ధర రూ.1962 ప్రకటించడంతో అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మెదక్ జిల్లాలో ఈ యాసంగిలో 3,368 ఎకరాల్లో పంట సాగు చేయగా, నేటి నుంచి కొనుగోళ్లు ప్రారంభకానున్నాయి. కేంద్ర ప్రభుత్వం మద్దతు ధర ఇవ్వకపోవడంతో పాటు కొనుగోలు చేయమంటూ చేతులెత్తేయడంతో తెలంగాణ సర్కారు మక్క రైతులను ఆదుకోవాలని నిర్ణయించింది. ఇందుకోసం జిల్లాలో మార్క్‌ఫెడ్ ఆధ్వర్యంలో అధికారులు 17 కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. నాలుగు వేల మెట్రిక్ టన్నులకుపైగా పంటను సేకరించేలా చర్యలు తీసుకుంటున్నారు. కొనుగోలు కేంద్రాల్లో ఎలాంటి ఇబ్బందులు రాకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. నేడు రామాయంపేటలో కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించనుండగా, రైతులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మక్కలను నేరుగా కేంద్రాలకు తరలించి మద్దతు ధర పొందాలని, దళారులను నమ్మి మోసపోవద్దని సూచిస్తున్నారు.
మెదక్, ఏప్రిల్ 30 (నమస్తే తెలంగాణ): మొక్కజొన్న రైతులకు సీఎం కేసీఆర్ మద్దతు ధర ప్రకటించడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మెదక్ జిల్లాలో మార్క్‌ఫెడ్ ఆధ్వర్యంలో మొక్కజొన్న కొనుగోలుకు 17 కేంద్రాలు ప్రారంభించి, సేకరించే కార్యాచరణను సిద్ధం చేస్తున్నారు. నేటి నుంచి పీఏసీఎస్ ఆధ్వర్యంలో వీటిని ప్రారంభించనున్నారు. మక్కల కొనుగోలు కేంద్రాల ప్రారంభింనుండడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. యాసంగిలో పండించిన మొక్కజొన్న పంట అకాల వర్షాలతో దెబ్బతిని, ఇబ్బందుల్లో ఉన్న మక్క రైతులను ఆదుకునేందుకు సీఎం కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం మక్క లు కొనకున్నా యాసంగిలో పండిన మక్కలు కొనాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు మార్ఫెడ్ ఆధ్వర్యంలో మకల కొనుగోళ్ల ఏర్పాట్లలో అధికారులు నిమగ్నమయ్యారు. అందు లో భాగంగా మెదక్ జిల్లాలో మార్ఫెడ్ ఆధ్వర్యంలో 17 కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. జిల్లాలో 3 నుంచి 4వేల మెట్రిక్ టన్నులకు పైగా మక్కలు కొనే అవకాశమున్నది.
Medak8
మక్కకు మద్దతు ధర రూ.1,962
తెలంగాణ ప్రభుత్వం మక్క రైతులను ఆదుకునేందుకు మద్దతు ధర రూ.1962 కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నది. దీంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆరుగాలం పండించిన మొక్కజొన్నను దళారులకు విక్రయించేవారు. దీంతో పెట్టుబడి కూడా రాకుండా పోయేది. ప్రభుత్వ మద్దతు ధర కంటే తక్కువ రేటుకు విక్రయించేవారు. కేంద్ర ప్రభుత్వం మొక్కజొన్న పంటకు మద్దతు ధర ప్రకటించకపోగా, కొనుగోలు కూడా చేయడంలేదు. దీంతో తెలంగాణ ప్రభుత్వం మక్క రైతులకు మద్దతు ధర కల్పిస్తూ కొనుగోలు చేయాలని నిర్ణయించింది. గతంలో మక్కకు మద్దతు ధర రూ.1962, 1870, 1850, 1760 ఉండేది. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం రూ.1,962 ధర ఇస్తున్నది.
జిల్లా వ్యాప్తంగా 3,368 ఎకరాల్లో మక్క సాగు
జిల్లాలో ఈసారి రైతులు 80 వేల ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేశారు. జిల్లాలో వరి తర్వాత మొక్కజొన్న పంటను ఎక్కువగా సాగు చేశారు. యాసంగిలో మొక్కజొన్న 3,368 ఎకరాల్లో సాగు చేశారు. గతంలో కేంద్ర ప్రభుత్వం మక్క పంట కొనకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. చివరకు దళారులకు విక్రయించి, నష్టాలు చవిచూశారు. ఈసారి కూడా కొనమని చెప్పడంతో తమ రైతులు నష్టపోవద్దనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం మొక్కజొన్న పంటను కొనేందుకు ముందుకొచ్చి, కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నది. దీంతో రైతులకు భరోసా కల్పిస్తున్నది. ఇందులో భాగంగా మే ఒకటో తేదీ నుంచి మక్కల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
జిల్లాలో ఏర్పాటు చేయనున్న కేంద్రాలివే..
మక్కల కొనుగోలుకు మెదక్ జిల్లాలో 17 కేంద్రాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. జిల్లాలోని తూప్రాన్, కల్వకుంట్ల, నిజాంపేట, రామాయంపేట పీఏసీఎస్‌ల ఆధ్వర్యంలో మక్కల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. అల్లాదుర్గం, శివ్వంపేట, చేగుంట, పెద్దశంకరంపేట, నర్సాపూర్, వెల్దుర్తి, మెదక్, చిన్న ఘనపూర్ పీఏసీఎస్‌లు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు.
కేంద్రాల వద్ద ఇబ్బందులు లేకుండా చూస్తాం
ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా మెదక్ జిల్లాలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాం. మక్కల కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. జిల్లాలో పీఏసీఎస్‌ల ఆధ్వర్యంలో 17 కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తాం. రైతులు నేరుగా మక్కలను కొనుగోలు కేంద్రాలకు తరలించాలి. దళారులను నమ్మి మోసపోవద్దు. ప్రతిఒక్కరి పంటను తప్పకుండా కొంటాం. రామాయంపేటలో మక్కల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభిస్తాం.
– నర్సింహారావు, మార్క్‌ఫెడ్ మేనేజర్, మెదక్