బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తున్నది. జోరువానలతో ప్రాజెక్టులకు వరద పెరిగింది. చెరువులు నిండుకుండలను తలపిస్తున్నాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఘనపూర్, పోచారం, హల్దీ వాగు, నల్ల వాగు, నారింజ ప్రాజెక్టుల్లోకి వరద కొనసాగుతున్నది. సింగూరులోకి మళ్లీ ఇన్‌ఫ్లో పెరిగింది. రెండు జిల్లాల్లో 75శాతం చెరువులు మత్తడి దుంకుతున్నాయి. వర్షాలతో పలుచోట్ల ఇండ్లు, రోడ్లు దెబ్బతిన్నాయి. మంగళవారం మెదక్ జిల్లాలో 32.8మి.మీటర్ల వర్షపాతం నమోదైంది. భారీ వర్షాలతో అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్లు రాజర్షిషా, శరత్ ఆదేశాలు జారీ చేశారు. ఏ సమస్య వచ్చినా పరిష్కరించేలా కలెక్టరేట్లలో కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేశారు. రోజంతా వర్షం కురుస్తుండడంతో జనసంచారం స్తంభించింది. ప్రజలు ఇండ్లకే పరిమితమయ్యారు. రైతులు ఆనందం వ్యక్తం చేస్తూ జోరుగా వరి నాట్లలో నిమగ్నమయ్యారు.
మెదక్, జూలై 25 (నమస్తే తెలంగాణ) : వీఆర్ఏల ఎన్నో ఏండ్ల కలను సీఎం కేసీఆర్ నెరవేర్చారు. ఇన్నేండ్లు చాలీచాలని జీతంతో బతుకులు వెళ్లదీస్తున్న వీఆర్ఏల జీవితాల్లో వెలుగులు నింపారు. భవిష్యత్‌లో ఎలాంటి సమస్యలు రాకుండా అన్ని హక్కులు కల్పించారు. ఎన్నో ఏండ్ల కల సాకారం చేసిన సీఎం కేసీఆర్ మాకు దేవుడని వీఆర్ఏల సంఘం నాయకుడు పిట్ల రవీందర్ సంతోషం వ్యక్తం చేశారు. వీఆర్ఏలను ప్రభుత్వ ఉద్యోగులుగా మా ర్చుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాదు పేస్కేల్‌ను కూడా వర్తింపజేసింది. మంగళవారం ఆయన ‘నమస్తే తెలంగాణ’కు ఇంటర్వ్యూ ఇచ్చారు.
నమస్తే తెలంగాణ : వీఆర్ఏలను ప్రభుత్వ ఉద్యోగులు గుర్తించడం ఎలా అనిపించింది?
రవీందర్ : పట్టలేనంత సంతోషం గా ఉన్నది. ఇన్ని రోజులు చాలీచాలని వేతనంతో పనిచేస్తున్నాం. గతంలో గ్రామాలకు మస్కూరీగా పని చేశాం. గ్రామంలో ఏ పని చేయాలన్నా మస్కూరీ తప్పకుండా అవసరం. పంచాయతీలో ప్రతి పనిని క్రమం తప్పకుండా చేశాం. మంచి, చెడులకు ముం దుండి కష్టపడి పనిచేశాం. తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని గతంలో ధర్నా, నిరసన చేశాం. కానీ, ఏ ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకోలేదు.
నమస్తే తెలంగాణ : మెదక్ జిల్లాలో ఎంత మంది వీఆర్ఏలు పనిచేస్తున్నారు?
రవీందర్ : జిల్లాలో 1033 మంది వీఆర్ఏలు పనిచేస్తున్నారు. జిల్లావ్యాప్తంగా 469 గ్రామపంచాయతీల్లో 1033 మంది ఉన్నారు. వీరిలో కొందరు తహసీల్ కా ర్యాలయం, మరికొందరు ఆర్డీవో క్యాంపు కార్యాలయం, ఆర్డీవో కార్యాలయం, కొంత మంది కలెక్టరేట్లో పనిచేస్తున్నారు. చాలామంది గ్రామాల్లోనే ఉంటూ విధులు నిర్వర్తించేవారు. గతంలో వీఆర్ఏలు నైట్ డ్యూటీ లు సైతం చేస్తుండేవారు.
నమస్తే తెలంగాణ : రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని క్యాటగిరీల్లో పేస్కేల్ వర్తింపజేస్తున్నది?
రవీందర్ : సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు సోమవా రం రెవెన్యూశాఖ జీవో నంబర్ 81 విడుదల చే సింది. ఈ ఉత్తర్వులను సెక్రటరియేట్లో సీఎం కేసీఆర్ స్వయంగా వీఆర్ఏ జేఏసీ నాయకు లకు అందజేశారు. విద్యార్హతల ఆధారంగా వీఆర్ఏలకు ప్రభుత్వం మూడు క్యాటగిరీల్లో పే స్కేల్‌ను వర్తింపజేసింది. పదో తరగతి చదివివారికి లాస్ట్ గ్రేడ్ సర్వీస్(ఆఫీస్సబార్డినేట్), ఇంటర్ చదివినవారికి రికార్డు అసిస్టెం ట్, డిగ్రీ ఆపై చదివినవారికి జూనియర్ అసిస్టెంట్ లేదా సమానమైన పే స్కేల్ వర్తింపజేసింది. 61 ఏండ్లు దాటి నవారు, అనారోగ్యంతో ఉద్యోగం చేయనివారు, 2014 జూన్ 2 తర్వాత విధుల్లో ఉండగా మరణించిన వీఆర్ఏల వారసులకు విద్యార్హతల ఆధారంగా మూడు క్యాటగిరీల్లో ఉద్యోగాలు ఇవ్వనున్నారు.
నమస్తే తెలంగాణ : ఎన్నో ప్రభుత్వాల్లో పని చేశారు, అప్పుడు ఏమైనా న్యాయం జరిగిందా?
రవీందర్ : మా తాతల నుంచి మస్కూరీ పని చేస్తున్నారు. ఉద్యమాలు చేశారు, ఏ ఒక్క నాయకుడు పట్టించుకోలేదు. రూ.500 జీతంతో కాలం వెళ్లదీశారు. ఎన్నో ప్రభుత్వాలు మారాయి, అయినా మస్కూరీ తలరాత మారలేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ రెవెన్యూ వ్యవస్థలో మార్పులు తీసుకువచ్చారు. గతంలో వీఆర్వోలను ఆయా శాఖలకు బదిలీ చేశారు. ఇప్పుడు వీఆర్ఏలను ప్రభుత్వ ఉద్యోగులు గా అవకాశం కల్పిస్తూ, విద్యార్హతలను బట్టి పేస్కేల్ ఇవ్వనున్నారు. సీఎం కేసీఆర్‌కు వీఆర్ఏలమంతా రుణపడి ఉంటాం.