సంగారెడ్డి అక్టోబర్ 30 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ పాలనలో ఉన్న నారాయణఖేడ్‌కు బీఆర్ఎస్ పరిపాలనలో ఉన్న నారాయణఖేడ్‌కు జమీన్ ఆస్మాన్కు ఉన్నంత ఫరక్ ఉన్నదని, బీఆర్ఎస్ హయాంలో నారాయణఖేడ్ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు అన్నారు. నారాయణఖేడ్‌ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన బీఆర్ఎస్ను మరోసారి అధికారంలోకి తీసుకురావాలని, నారాయణఖేడ్‌ను అభివృద్ధి చేసిన హీరో భూపాల్‌రెడ్డిని భారీమెజార్టీతో గెలిపించాలని సీఎం కేసీఆర్ ప్రజలకు పిలుపునిచ్చారు. సోమవారం నారాయణఖేడ్‌లో ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి ఆధ్యక్షతన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాదసభ జరిగింది. సభకు సీఎం కేసీఆర్ ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. ఓట్లు వచ్చినప్పుడు ప్రజలు ఆగం కావద్దని, అభివృద్ధి చేసిన బీఆర్ఎస్ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఏ పార్టీ చరిత్ర ఏమిటో, ఏపార్టీ వైఖరి ఏమిటో ఓటర్లు ఆలోచించాలన్నారు. నారాయణఖేడ్‌లో బీఆర్ఎస్ ప్రభుత్వానికి ముందు పరిస్థితి ఎలా ఉందనేది ఓటర్లు ఆలోచించాలన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక నారాయణఖేడ్ ప్రజల తాగునీరు, సాగునీరు, కరెంటు కష్టాలు తీర్చిందని తెలిపారు. పొరుగునే ఉన్న కర్ణాటక రైతుల గతి ఏమవుతున్నదో ఇక్కడి ప్రజలు, రైతులు గమనిస్తూనే ఉన్నారు. కర్ణాటక రైతులు పడుతున్న కష్టాలు ఇక్కడి రైతులకు వద్దని, నారాయణఖేడ్ రైతులు సంతోషంగా ఉండాలంటే మరోమారు బీఆర్ఎస్ ప్రభుత్వానికి పట్టం కట్టాలని రైతులు, ప్రజలను కోరారు.
నారాయణఖేడ్ నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేసే బసవేశ్వర ఎత్తిపోతల పథకాన్ని స్వయంగా ప్రారంభిస్తానని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజా ఆశీర్వద సభలో తెలిపారు. నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి నల్లవాగుపై లిఫ్టు కావాలని కోరారు. బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే నల్లవాగుపై ఎత్తిపోతల పథకం ఏర్పాటు చేసే బాధ్యత నేనే తీసుకుంటానని హామీ ఇచ్చారు. జిల్లాలోని సింగూరు ప్రాజెక్టు అప్పుడప్పుడు ఎండిపోతుందని ఈ నేపథ్యంలోనే కాళేశ్వరం ప్రాజెక్టును సింగూరు ప్రాజెక్టును లింకు చేసినట్లు తెలిపారు. ఇకపై సింగూరు ప్రాజెక్టు శాశ్వత జలవనరుగా మారుతుందన్నారు. సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాలు పూర్తయితే నారాయణఖేడ్, జహీరాబాద్ నియోజకవర్గాలు సస్యశ్యామలం అవుతాయని తెలిపారు. బసవేశ్వర ఎత్తిపోతల పథకం, కాళేశ్వరం కాల్వల ద్వారా నారాయణఖేడ్ నియోజకవర్గంలోని 1.80 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని తెలిపారు. హెలికాప్టర్లో నారాయణఖేడ్ వచ్చే సమయంలో నల్లవాగు ప్రాజెక్టును చూస్తే నిండుగా కనిపించిందని, ప్రాజెక్టును చూసి సంతోషం వేసిందన్నారు. నల్లవాగు ప్రాజెక్టు ద్వారా రెండు పంటలు పండాలంటే దానిపై లిఫ్టు ఇరిగేషన్ ప్రాజెక్టు అవసరం అన్నారు. ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డిని మరోమారు గెలిపిస్తే నల్లవాగుపై లిఫ్టు ఇరిగేషన్ ప్రాజెక్టును ఏర్పాటు చేస్తామన్నారు. మాసాన్‌పల్లి రోడ్డు కావాలని, బీసీ గురుకుల పాఠశాలలు, ఇతర విద్యా సం స్థలు కావాలని ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి కోరారని తాము అధికారంలోకి రాగానే వాటిని మంజూరు చేస్తామని సీఎం కేసీఆర్ తెలిపారు. నారాయణఖేడ్ నియోజకవర్గంలోని తండాలు అన్నింటికి రోడ్లు వేశామని తెలిపారు.
బీఆర్ఎస్ హయాంలో నారాయణఖేడ్ దశాదిశ మారిందని సీఎం కేసీఆర్ అన్నారు. గతంలో చాలాసార్లు నారాయణఖేడ్ వచ్చానని, మంత్రిగా ఉన్న సమయంలో నారాయణఖేడ్‌లో పర్యటించి అభివృద్ధి పనులు చేశానన్నారు. అప్పుడు నారాయణఖేడ్‌లో డబ్బారేకుల ఇండ్లు ఉండేవని, ఇప్పుడు హెలికాప్టర్లో నుంచి చూస్తే నారాయణఖేడ్ పట్టణం బాగా అభివృద్ధి చెందిందని, రెండు అంతస్తులు, మూడంతస్తుల భవనాలు కనిపించాయని తెలిపారు. గతంలో నారాయణఖేడ్‌కు ప్రభుత్వ ఉద్యోగులు రావాలంటే భయపడేవారని తెలిపారు. కానీ ప్రస్తుతం ప్రభు త్వ ఉద్యోగులు బ్రహ్మాండంగా ఇక్కడే ఉండాలని కోరుకుంటున్నారని తెలిపారు. నారాయణఖేడ్‌కు ఆర్డీవో కార్యాలయం మంజూరు చేశామని, దీంతో చాలా వసతులు వచ్చాయన్నారు. ఉప ఎన్నికల్లో హరీశ్‌రావు ప్రచారం కోసం వస్తే చిమ్నీబాయి అనే మహిళ మంచినీళ్లు లేవు, మీకు ఎందుకు ఓటు వేయాలని ప్రశ్నించిందన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డిని గెలిపించగానే ఇంటింటికీ తాగునీరు అందజేశామని తెలిపారు.
మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డిపై కత్తితో దాడి చేయడాన్ని సీఎం కేసీఆర్ తీవ్రంగా ఖండించారు. ప్రభాకర్‌రెడ్డిని పరామర్శించేందుకు వెళ్లాలని అనుకున్నట్లు చెప్పారు. అయితే ప్రాణాపాయం లేదని తెలియడంతో ఖేడ్ ప్రజలు తనకోసం వేచిచూస్తున్నారని తెలిసి వచ్చినట్లు తెలిపారు. ప్రభాకర్‌రెడ్డిపై దాడి జరిగిన నేపథ్యంలో మనస్సు బాధగా ఉందని, అందుకే ఎక్కువ సమయం ప్రసంగించటంలేదని, ప్రభాకర్‌రెడ్డిని పరామర్శించేందుకు వెళ్లాల్సివస్తున్నట్లు తెలిపారు. సభకు మంత్రి హరీశ్‌రావు హాజరుకావాల్సి ఉన్నప్పటికీ ప్రభాకర్‌రెడ్డికి మెరుగైన చికిత్స అందించేందుకు హైదరాబాద్ వెళ్లినట్లు చెప్పారు. ఎంపీ బీబీపాటిల్, ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి, జెడ్పీచైర్‌పర్సన్ మంజుశ్రీజైపాల్‌రెడ్డి, ఎమ్మెల్సీ రఘోత్తంరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ భూపాల్‌రెడ్డి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు చింతా ప్రభాకర్, కార్పొరేషన్ చైర్మన్ మఠం భిక్షపతి, నాయకులు భూపాల్‌రెడ్డి, బుచ్చిరెడ్డి, మున్సిపల్‌చైర్‌పర్సన్ రుబీనాబేగంమజీద్, వైస్‌చైర్మన్ పరశురాం, ఏఎంసీ చైర్మన్ సువర్ణ షెట్కార్, వైస్‌చైర్మన్ విజయ్‌బుజ్జి పాల్గొన్నారు.