ఉమ్మడి మెదక్ జిల్లాలో బీఆర్ఎస్ శ్రేణుల సంబురాలు అంబరాన్నంటాయి. వచ్చే ఎన్నికల్లో పోటీచేయనున్న ఎమ్మెల్యే అభ్యర్థులను సోమవారం సీఎం కేసీఆర్ ప్రకటించారు. నర్సాపూర్, జనగామ మినహా అన్ని స్థానాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలకే సీట్లు కేటాయించడంతో కార్యకర్తలు, నాయకులు హర్షం వ్యక్తం చేశారు. చౌరస్తాల్లో పటాకులు కాల్చారు. స్వీట్లు పంచిపెట్టి, ఒకరికొకరు తినిపించుకున్నారు. బైక్‌లతో ర్యాలీలు తీశారు. డ్యాన్సులు చేస్తూ సందడి చేశారు. పలుచోట్ల ముఖ్యమంత్రి ఫ్లెక్సీలకు క్షీరాభిషేకాలు నిర్వహించారు. ఎమ్మెల్యేలను కలిసి పూలు, శాలువాలతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ముచ్చటగా మూడోసారి బీఆర్ఎస్ను గెలిపించడమే లక్ష్యంగా పనిచేస్తామని హామీ ఇచ్చారు.
– ఉమ్మడి మెదక్ జిల్లా న్యూస్‌నెట్‌వర్క్, ఆగస్టు 21
మెదక్, ఆగస్టు 21 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ మెదక్ అసెంబ్లీ టికెట్ సిట్టింగ్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డినే వరించింది. సోమవారం ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ మెదక్ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎం.పద్మాదేవేందర్‌రెడ్డి పేరును ఖరారు చేశారు. దీంతో మెదక్‌తో పాటు ని యోజకవర్గంలోని ఆయా మండలాల్లో బీఆర్ఎస్ శ్రే ణులు, నాయకులు, కార్యకర్తలు సంబురాల్లో మునిగిపోయారు. పార్టీలో కష్టపడి పనిచేసే వారికి పదవులు వస్తాయని, పదే పదే సమావేశాల్లో చెప్పిన సీఎం కేసీఆర్ ఇచ్చిన మాట ప్రకారం మెదక్ టికెట్‌ను పద్మాదేవేందర్‌రెడ్డికే కేటాయించారు.
రామాయంపేట, ఆగస్టు 21: మా సొంతూరుకు చెందిన ఎమ్మెల్యే పద్మక్కను ఈ సారి లక్ష మెజారిటీతో గెలిపిస్తామని మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్‌గౌడ్ తెలిపారు. మెదక్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు పద్మాదేవేందర్‌రెడ్డికి మరోసారి పార్టీ మెదక్ అసెంబ్లీ టికెట్ కేటాయించడంతో రామాయంపేటలో సంబురాలు మిన్నంటాయి. సోమవారం రెండున్నర గంటల వరకు బీఆర్ఎస్ నాయకులు టీవీల వద్దే అతుక్కుపోయారు. ఎట్టకేలకు ఎమ్మెల్యే బీఆర్ఎస్ టికెట్ పద్మా దేవేందర్‌రెడ్డికి కన్ఫర్మ్ కావడంతో పట్టణంలో సంబురాలు జరుపుకొన్నారు. బీఆర్ఎస్ శ్రేణులు వందలాదిగా బైకులు, ఆటోల్లో రోడ్డెక్కి నినాదాలు చేస్తూ భారీ ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లడుతూ పద్మక్కను గెలిపించేందుకు అభివృద్ధిని చూపిస్తామన్నారు. కార్యక్రమంలో వైస్ చైర్పర్సన్ పుట్టి విజయలక్ష్మి, మార్కెట్ కమిటీ చైర్మన్ సరాఫ్ యాదగిరి, సీనియర్ నాయకుడు పుట్టి యాదగిరి, పట్టణాధ్యక్షుడు గజవాడ నాగరాజు, రైతుబంధు అధ్యక్షుడు నర్సారెడ్డి, స్థానిక కౌన్సిలర్లు, కో ఆప్షన్ మెంబర్లు, దేవస్థాన కమిటీ డైరెక్టర్లు, సర్పంచ్‌లు సుభాష్రాథోడ్, సురేశ్, ఉమామహేశ్వర్, నరేందర్‌రెడ్డి కర్రె రమేశ్ పాల్గొన్నారు.
జడ్పీటీసీ నుంచి డిప్యూటీ స్పీకర్‌గా..
జడ్పీటీసీగా ప్రస్థానం ప్రారంభించిన పద్మాదేవేందర్‌రెడ్డి అంచెలంచెలుగా ఎదిగారు. పద్మాదేవేందర్‌రెడ్డి రాజకీయ ప్రస్థానంలో వివిధ పదవులు చేపట్టారు. ముందుగా 2001లో రామాయంపేట జడ్పీటీసీగా ప్రస్థానం ప్రారంభించిన పద్మా దేవేందర్‌రెడ్డి 2004లో రామాయంపేట ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2005లో ఉమ్మడి జిల్లా అధ్యక్షురాలుగా, మరోసారి కన్వీనర్‌గా పనిచేశారు. 2008లో జరిగిన ఉప ఎన్నికల్లో ఓటమిపాలయ్యారు. 2009లో మెదక్ నుంచి ఇండిపెండెంట్‌గా పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత 2014లో మెదక్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది డిప్యూటీ స్పీకర్ పదవిని చేపట్టా రు. 2018లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2022, జనవరి 26న బీఆర్ఎస్ మెదక్ జిల్లా అధ్యక్షురాలుగా నియమితులయ్యారు. మెదక్ జిల్లా కేంద్రం ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ జిల్లా అధ్యక్ష పదవిని మహిళకు కేటాయించడంతో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఆనందం వ్యక్తంచేశారు. డిప్యూటీ స్పీకర్‌గా, ఎమ్మెల్యేగా మెదక్ నియోజకవర్గంలో చురుగ్గా పనిచేస్తూ అభివృద్ధిలో ముందుకు దూసుకుపోతున్న ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డికి మళ్లీ బీఆర్ఎస్ మెదక్ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఖరారు చేశారు. దీంతో పార్టీ శ్రేణులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మెదక్ అభ్యర్థిగా పద్మాదేవేందర్‌రెడ్డికి మళ్లీ బీఆర్ఎస్ టికెట్ రావడంతో పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మెదక్‌లో బీఆర్ఎస్ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలు భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు. అనంతరం రాందాస్ చౌరస్తాలో స్వీట్లు పంచి పటాకులు కాల్చి సంబురాలు చేసుకున్నారు.
రాందాస్ చౌరస్తాలో భారీ బైక్ ర్యాలీ
మెదక్ మున్సిపాలిటీ, ఆగస్టు 21: మెదక్ అసెంబ్లీ బీఆర్ఎస్ అభ్యర్థిగా పద్మా దేవేందర్‌రెడ్డిని సీఎం కేసీఆర్ ప్రకటించడంతో మెదక్ నియోజకవర్గ వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు సంబురాల్లో మునిగిపోయారు. నియోజకవర్గంలోని మండల కేంద్రాలతో పాటు గ్రామగ్రామాన పటాకులు కాల్చి మిఠాయిలు పంచిపెట్టారు. జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాం పు కార్యాలయంలో జడ్పీ చైర్పర్సన్ లావణ్యారెడ్డి, మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, వైస్ చైర్మన్ మల్లికార్జున్‌గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ బట్టి జగపతి ఆధ్వర్యంలో రాందాస్ చౌరస్తా వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో మెదక్ పీఏసీఎస్ అధ్యక్షుడు హన్మంత్‌రెడ్డి, కౌన్సిలర్లు కృష్ణారెడ్డి, జయరాజ్, శ్రీనివాస్, లక్ష్మీనారాయణగౌడ్, కిశోర్, ఉమర్, సమియోద్దీన్, టీఆర్ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీశ్, రైతుబంధు అధ్యక్షుడు కిష్టయ్య, ఏఎమ్‌సీ డైరెక్టర్లు శంకర్, సాయిలు, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్ష కార్యదర్శులు గంగాధర్, కృషాగౌడ్, నాయకులు పాల్గొన్నారు.
పద్మాదేవేందర్‌రెడ్డి ఘన స్వాగతం..
మెదక్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పద్మాదేవేందర్‌రెడ్డి పేరును సీఎం కేసీఆర్ ప్రకటించిన తరువాత హైదరాబాద్ నుంచి మెదక్ క్యాంపు కార్యాలయానికి చేరుకున్న ఆమెకు బీఆర్ఎస్ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. పూలమాలలు, శాలువాలతో సన్మానించి మిఠాయిలు తినిపించారు.
నిజాంపేటలో..
నిజాంపేట, ఆగస్టు 21: మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డిని సీఎం కేసీఆర్ ప్రకటించినందుకు నిజాంపేటలో ఎంపీపీ సిద్ధరాములు, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సుధాకర్‌రెడ్డి స్వీట్లు పంచుకుని పటాకులు కాల్చి సంబరాలు చేసుకున్నారు. నిజాంపేట ప్రధాన వీధుల గుండా బైక్ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో కల్వకుంట, నిజాంపేట పీఏసీఎస్ చైర్మన్లు అందె కొండల్‌రెడ్డి, బాపురెడ్డి, యూత్ మండల అధ్యక్షుడు మావురం రాజు, ఏఎంసీ డైరెక్టర్లు వెంకటేశం, రవి, సోషల్ మీడి యా మండల అధ్యక్షుడు అబ్దుల్ ఆజీజ్, మండల ఇన్చార్జి శ్రీనివా స్, రజక సంఘం జిల్లా అధ్యక్షు డు సంగుస్వామి, చల్మెడ, నందిగామ ఎంపీటీసీలు బాల్‌రెడ్డి, సురేశ్, ఉప సర్పంచ్ బాబు, మాజీ ఎంపీపీ సంపత్ ఉన్నారు.
చిన్నశంకరం పేటలో
చిన్నశంకరంపేట, ఆగస్టు 21: మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డిని సీఎం కేసీఆర్ మళ్లీ మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థిగా ప్రకటించడంతో చిన్నశంకరంపేటలో సంబురాలు నిర్వహించారు. బస్టాండ్ వద్ద పటాసులు పేల్చి మిఠాయిలు పంచుకున్నారు. కార్యక్రమంలో సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, సింగిల్‌విండో చైర్మన్లు, నాయకులు పాల్గొన్నారు.
పాపన్నపేటలో సంబురాలు
పాపన్నపేట్, ఆగస్టు 21: మెదక్ అసెంబ్లీ బీఆర్ఎస్ టికెట్ పద్మాదేవేందర్‌రెడ్డికి ప్రకటించడంతో పాపన్నపేట మండలంలోని కొత్తపల్లిలో సోమవారం సంబురాలు జరుపుకొన్నారు. ఈ సందర్భంగా కార్యకర్తలు, నాయకులు కొత్తపల్లిలో పటాకులు కాలుస్తూ మిఠాయిలు తినిపించుకున్నారు. ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డికి మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు కుమ్మరి జగన్ అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు విష్ణువర్ధన్‌రెడ్డి, ఏడుపాయల చైర్మన్ బాలగౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ వెంకటరెడ్డి పాల్గొన్నారు.