దుబ్బాక, మే 27: ఫర్టిలైజర్ దుకాణాల్లో కల్తీవిత్తనాలు విక్రయిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని దుబ్బాక సీఐ శ్రీనివాస్ సూచించారు. సోమవారం దుబ్బాక పట్టణంలో పలు ఫర్టిలైజర్ దుకాణాలను ఆయన నేతృత్వంలో వ్యవసాయశాఖ అధికారులు, పోలీసులు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సీఐ శ్రీనివాస్ అక్రమంగా విత్తనాలు, ఎరువులు విక్రయిస్తే ఆ దుకాణం లైసెన్స్ రద్దు చేయడంతో పాటు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తనిఖీలో దుబ్బాక ఎస్సై గంగరాజు, ఏఈవోలు సంతోష్‌కుమార్, హరీశ్‌కుమార్ పాల్గొన్నారు.
కొండపాక(కుకునూరుపల్లి), మే 27: కొండపాక మండలం దుద్దెడలో పలు ఫర్టిలైజర్ దుకాణాల్లో పోలీస్ టాస్క్‌ఫోర్స్ బృం దం, వ్యవసాయ శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సిద్దిపేట పోలీస్ కమిషనర్ అనురాధ ఆదేశాల మేరకు విత్తనాలు, ఎరువుల దుకాణాల్లో తనిఖీలు చేస్తున్నట్లు తెలిపారు. త్రీటౌన్ సీఐ విద్యాసాగర్, ఎస్సై విజయభాస్కర్, ఏవో ప్రియదర్శిని పాల్గొన్నారు.
జగదేవ్‌పూర్, మే27: ఒకే రకం విత్తనాలను రైతులు కొనుగోలు చేయడం ద్వారా డిమాండ్ పెంచి కృత్రిమ కొరత సృష్టించవద్దని మండల వ్యవసాయాధికారి వసంతరావు సూచించారు.మండలంలోని తీగుల్, అనంతసాగర్, తిమ్మాపూర్, తీగుల్‌నర్సాపూర్, పలుగుగడ్డ, మాందాపూర్, దౌలాపూర్, జగదేవ్‌పూర్ గ్రామాల్లో రైతులకు విత్తనాల కొనుగోలుపై వ్యవసాయ విస్తరణ అధికారులు అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా ఆయన వేసవిలో దుక్కి ప్రయోజనాలు, పచ్చి రొట్ట జనుము, జీలుగ విత్తనాలు పొలంలో అలకడం ద్వారా కలిగే మేలును వివరించారు. సరైన సస్యరక్షణ చర్యలు, పంట యాజమాన్య పద్ధతులు పాటించడం ద్వారా అధిక దిగుబడులు సాధించవచ్చని సూచించారు. కార్యక్రమంలో ఏఈవోలు, రైతులు పాల్గొన్నారు.
నంగునూరు, మే 27 : విత్తనాల కొనుగోలు విషయంలో రైతులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఏఈవో మీరాబాయి అన్నారు. మండలంలోని మైసంపల్లి, మగ్ధూంపూర్ గ్రామాల్లో సోమవారం విత్తన కొనుగోలులో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వ్యవసాయాధికారులు రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వదులుగా ఉన్న సంచుల్లో ఉన్న విత్తనాలు కొనుగోలు చేయరాదని.. విత్తనాలు కొనుగోలు చేసిన దుకాణం నుంచి తప్పకుండా రసీదు తీసుకోవాలన్నారు. విత్తన ప్యాకెట్, బిల్లును పంట కాలం పూర్తయ్యే వరకు భద్రంగా ఉంచుకోవాలన్నారు. వ్యవసాయశాఖ ద్వారా గుర్తింపు పొందిన ఆధీకృత డీలర్ల దగ్గర మాత్రమే విత్తనాలు కొనుగోలు చేయాలని.. ప్యాక్ చేసిన, లేబుల్ చేసిన విత్తనాలను కొనుగోలు చేయాలని సూచించారు.
చిన్నకోడూరు, మే 27: నకిలీ విత్తనాలు, కాలంచెల్లిన విత్తనాలు, పురుగు మందులు విక్రయించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్సై బాలకృష్ణ, మండల వ్యవసాయాధికారి జయంత్ కుమార్ హెచ్చరించారు.సోమవారం మండల కేంద్రంలోని సీడ్స్, ఫర్టిలైజర్ దుకాణాల్లో తనిఖీలు నిర్వహించారు.గ్రామాల్లో విడి విత్తనాలు, మందు లు విక్రయిస్తే వెంటనే డయల్ 100, సంబంధిత పోలీస్ స్టేషన్, లేదా సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ కంట్రోల్ రూమ్ నెంబర్ 87126 67100కు సమాచారం ఇవ్వాలన్నారు.
గజ్వేల్, మే 27: గజ్వేల్ మండలం ప్రజ్ఞాఫూర్లోని పద్మావతి రైతు సేవా కేంద్రంలో పోలీసులు, మండల వ్యవసాయాధికారి సం యుక్తంగా సోమవారం రాత్రి దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో కాలం చెల్లిన 140 కిలోల వరి విత్తనాలు,పురుగుల మందులు లభ్యమయ్యాయి. సీఐ సైదా, మండల ఏవో నాగరాజు, సిబ్బంది పాల్గొన్నారు.