రామచంద్రాపురం,డిసెంబర్29: సరైన రోడ్లు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని చిన్నారులు రోడ్డెక్కారు. ఫ్ల్లకార్డులు చేత పట్టుకొని నిరసన చేపట్టారు. ఆదివారం తెల్లాపూర్‌లో నైబర్‌హుడ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గేటెడ్ కమ్యూనిటీ వాసు లు, చిన్నారులు కలిసి రోడ్లను బాగుచేయాలంటూ నిరసిస్తూ రోడ్డుపైకి వచ్చారు. ఉస్మాన్‌నగర్‌లోని హాల్‌మార్క్ కౌంటీ నుంచి బ్లూ బ్లాక్ స్కూల్ వరకు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా టీనా అధ్యక్షుడు ఈశ్వరిగారి రమణ మాట్లాడుతూ.. తెల్లాపూర్, ఉస్మాన్‌నగర్ పరిధిలో రోడ్లు బాగా లేకపోవడంతో గేటెడ్ కమ్యూనిటీవాసులు చాలా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.
చిన్నారులను స్కూల్స్‌కి పంపించాలంటే స్కూల్ బస్సులు కాలనీల్లో తిరుగలేని పరిస్థితి ఉన్నదని చెప్పారు. సన్సియవిల్లాస్ నుంచి బ్లూ బ్లాక్ స్కూల్ వరకు ఉన్న మున్సిపల్ రోడ్డుకు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి శంకుస్థాపన చేసినప్పటికీ పనులు మొదలు కాలేదని తెలిపారు. వట్టినాగులపల్లి నుంచి ఉస్మాన్‌నగర్ వరకు ఉన్న హెచ్ఆర్డీసీఎల్ రోడ్డు పనులు మధ్యలోనే నిలిచాయని, హెచ్ఎండీఏ అధికారులు భూసేకరణ చేస్తేనే రోడ్డు పనులను పూర్తి చేస్తామని హెచ్ఆర్డీసీఎల్ అధికారులు సమాధానం ఇస్తున్నారని తెలిపారు. రోడ్డు పనులతో పాటు తాగునీటి పైప్‌లైన్ పనులు నిలిచిపోవడంతో తాగునీటి ఇబ్బందులు వస్తున్నాయని తెలిపారు. నిరసనలో మదన్మోహన్, రామ్‌కుమార్, అనిల్, సాయిపవన్ పాల్గొన్నారు.