‘మీరు భవిష్యత్‌లో ఏం కావాలనుకుంటున్నారు’ అనే అంశంపై ఓ వ్యాసం రాసుకొని రావాలంటూ ఓ పాఠశాలలోని మూడో తరగతి విద్యార్థులకు ఉపాధ్యాయుడు హోం వర్క్ ఇచ్చారు. అందులో కొందరు విద్యార్థులు తాము ఏమేమి ఉద్యోగం సాధించాలనుకుంటున్నారో రాసి తీసుకొచ్చారు. మరికొందరు మాత్రం తాము స్మార్ట్‌ఫోన్‌గా మారిపోవాలనుకుంటున్నట్లుగా రాశారు. తమ తల్లిదండ్రులు తమ కన్నా స్మార్ట్ఫోన్లనే ఎక్కువగా ఇష్టపడుతున్నందున వాటి స్థానంలో తాము ఉండాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.
దీంతో ఆ పసి హృదయాలు తమ తల్లిదండ్రుల ప్రేమ కోసం ఎంతలా ఆరాటపడుతున్నాయో గమనించిన ఆ ఉపాధ్యాయుడికి ఒక్కసారిగా గుండె బరువెక్కినట్లుగా అనిపించింది. ఇదే విషయం.. ఇటీవల ఓ వాట్సాప్ సందేశంగా కూడా వచ్చింది. 90 శాతం మంది ప్రజలు తమ పిల్లలతో గడిపే సమ యం కంటే స్మార్ట్ఫోన్లను వినియోగించే సమయమే అధికమని ఇటీవల నిర్వహించిన సర్వేల్లో వెల్లడైంది కూడా.
– గజ్వేల్, సెప్టెంబర్ 20:
పిల్లల ఎదుగుదలపై ప్రభావం...
పిల్లలకు ప్రేమను అందించాల్సిన తల్లిదండ్రులు సెల్ఫోన్లకు అడిక్ట్ కావడంతో పిల్లల ఎదుగుదలపై తీవ్ర ప్రభావం పడుతోంది. దీంతో తల్లిదండ్రుల ప్రేమకు పిల్లలు దూరమై చెడు వ్యసనాలతోపాటు ఒంటరితనాన్ని కూడా కోరుకునే ప్రమాదముంది. తల్లిదండ్రులు సరైన సమయంలోనూ తమకు తోడుగా లేరనే భావన వారిలో మొదలై మానసికంగా కుంగిపోయే ప్రమాదముంది.
తల్లిదండ్రుల ఆత్మీయతకు బాల్యం దూరం..
ఫోన్ రింగ్ వినిపించగానే ఎన్ని ముఖ్యమైన పనులున్నా వదిలేసి వెళ్తున్న తల్లిదండ్రులు.. తమ పిల్లలు ఎన్నిసార్లు పిలిచినా పలకడంలేదు. వాస్తవానికి నేడు చాలా ఇండ్లల్లో ఇదే పరిస్థితి కన్పిస్తోంది. చాలామంది తల్లిదండ్రులు స్మార్ట్ఫోన్లనే ప్రపంచంగా గడిపేస్తున్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు ఫోన్ల వైపే చూస్తున్నారు తప్ప.. పిల్లలు ఎలా చదువుతున్నారనే విషయాలు మాత్రం పెద్దగా పట్టించుకోవడంలేదు.
గతంలో స్కూల్‌కు వెళ్లిన పిల్లలు.. ఉదయం నుంచి సాయంత్రం వరకు పుస్తకాలతో కుస్తీ పట్టి ఇంటికి వస్తే.. తల్లిదండ్రులు వారిని ప్రేమగా పలుకరించేవారు. రాగానే స్నానం చేయించి కొద్దిసేపు కబుర్లు చెబుతూ స్నాక్స్ తినిపించేవారు. తరువాత హోంవర్క్స్ చేయించే వారు. కానీ.. ఇప్పుడు తల్లిదండ్రులు ఎక్కువసేపు స్మార్ట్ఫోన్లతోనే గడిపేస్తుండడంతో సాయంత్రం వేళ స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన వారిలో చాలా మంది పిల్లలు తల్లిదండ్రుల ప్రేమానురాగాల కోసం తాపత్రయపడాల్సి వస్తోంది.
ఇలాంటి పరిస్థితులే ఇంకా కొనసాగితే పసి పిల్లల్లో ఒంటరితనం పెరిగి పెను పరిణామాలకు దారితీస్తుందనే మానసిక వైద్యులు చెబుతున్నారు. తల్లిదండ్రుల ఆత్మీయత బాల్యానికి ఎంతలా దూరమవుతోందో తాజా పరిస్థితులే తెలియజేస్తున్నాయి.
ఇంటింటా స్మార్ట్‌ఫోన్..
ఈ రోజుల్లో ప్రతి ఇంట్లో స్మార్ట్‌ఫోన్ సర్వసాధారణమైంది. నిద్రలేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు దాంతోనే గడుపుతున్నారు. ఒకరు ఆఫీస్ మెయిల్స్ చూస్తుంటే.. మరొకరు సరదా కోసం గేమ్స్ ఆడుకుంటున్నారు. ఇంకొకరు ప్లేస్టోర్‌లో యాప్స్ డౌన్లోడ్ చేసుకుంటున్నారు. ఇలా నిత్యం ఏదో విధంగా స్మార్ట్‌ఫోన్‌కు అంకితమవుతూనే ఉన్నారు. పాఠశాలల్లో గడుపుతున్న పిల్లలకు సెలవుల్లోనూ తల్లిదండ్రుల ప్రేమ పూర్తిస్థాయిలో దక్కడంలేదు. పిల్లలు ఇంటి వద్ద ఉన్నప్పుడు తల్లిదండ్రులు వారికి సమయం కేటాయించడంలేదు. ఫోన్లకు బ్యాక్ కవర్, టెంబర్ గ్లాస్ అంటూ ఖర్చుపెడుతున్న తల్లిదండ్రులు.. తమ పిల్లల సంరక్షణపై మాత్రం శ్రద్ధను తగ్గిస్తున్నారు.
తల్లిదండ్రుల మార్పుతోనే పిల్లల భవిష్యత్..
తల్లిదండ్రుల్లో మార్పు వస్తేనే పిల్లల్లో కూడా మార్పు మొదలవుతుంది. వారి భవిష్యత్తు బంగారు మయమవుతుంది. పాఠశాలకు వచ్చే విద్యార్థుల్లో ఎక్కువగా సంతోషంగా లేనివారే కనిపిస్తుంటారు. కొందరు విద్యార్థులు చదువులో ముందున్నా వారిలో మానసిక ఎదుగుదల మాత్రం లోపిస్తోంది. ఆటపాటలకు దూరంగా ఉంటున్నారు. తల్లిదండ్రులు వారితో గడిపి ప్రతి విషయం వారితో పంచుకుంటే పిల్లల్లో తల్లిదండ్రులపై ప్రేమ, గౌరవం పెరుగుతాయి.
– సుగుణాకర్, ప్రధానోపాధ్యాయుడు, అహ్మదీపూర్, గజ్వేల్ మండలం
పిల్లలకు ప్రేమను పంచాలి..
తల్లిదండ్రులు ఇళ్లల్లో వీలైనంత వరకు స్మార్ట్ఫోన్లకు దూరం ఉంటే మంచిది. కార్యాలయాల్లో పనులు అక్కడే వదిలేయాలి. పిల్లలతో ఎక్కువసేపు గడపాలి. నేడు ఉమ్మడి కుటుంబాలు తగ్గడంతో పిల్లల ఆలనాపాలనా చూసే పెద్దదిక్కు లేక పోయింది. దానికి తోడు తల్లిదండ్రులిద్దరూ వృత్తి ఉద్యోగ వ్యాపకాల్లో ఉండడంతో ఫోన్ల వినియోగం అనివార్యమైంది. అయినప్పటికీ పిల్లల అవసరాలు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాల్సిన బాధ్యత తల్లిదండ్రులపైనే ఉంది. తల్లిదండ్రులు ప్రేమ చూపకపోతే బాల్యం పెడదోవపట్టే ప్రమాదం ఉంది.
– ఎం.రమేశ్, ఏసీపీ, గజ్వేల్