గజ్వేల్, జనవరి 8: పరోపకారార్థం ఇదం శరీరం… అన్న సూక్తిని పాటించేవారెందరో ప్రస్తుతం మనకు కనిపిస్తున్నారు. గొప్పగా వ్యాపారాలు చేస్తూ ఏడాదంతా బిజీబిజీగా గడిపే వ్యాపారులు ఒక లక్ష్యాన్ని పెట్టుకుని ఆ లక్ష్యం కోసం అంకితమై తమ వ్యాపారాలు, ఉద్యోగాలను పక్కన పెట్టి సమాజానికి సేవలందించడానికి రావడం అభినందనీయం. రౌండ్ టేబుల్ ఇండియా అనే స్వచ్ఛంద సంస్థ 60 సంవత్సరాలుగా దేశవ్యాప్తంగా తనదైన సేవలందిస్తూ సేవా తత్పరతను చాటుతోంది. ఈ సంస్థ సభ్యులు సమాజానికి తమవంతుగా సేవలందించాలన్న లక్ష్యంతో పనిచేస్తూ ముందుకు సాగుతున్నారు.
దేశవ్యాప్తంగా 7,890 తరగతి గదుల నిర్మాణం…
దేశవ్యాప్తంగా ఇప్పటివరకు ప్రభుత్వ పాఠశాలల్లో 3,347 ప్రాజెక్టులను నిర్వహించి 7,890 తరగతి గదులను నిర్మించారు. ఈ నిర్మాణాలకు రూ.380 కోట్లు ఖర్చు చేసింది. ఈ నిధులన్నీ దాతల ద్వారా సేకరించినవే.
సేవల తీరు తెన్నులివీ..
ముందుగా తమకు తెలిసిన, తమకు వచ్చిన విజ్ఞప్తుల మేరకు అవసరం ఉన్న పాఠశాలలను సేవా సంస్థ బృందం పరిశీలిస్తుంది. అక్కడ ఏమేమి వసతులు అవసరం ఉన్నాయో సదరు పాఠశాలల ప్రధానోపాధ్యాయుయులు, ప్రజాప్రతినిధులను అడిగి తెలుసుకుంటారు. ఆయా పాఠశాలలకు అవసరమైన వసతులను కల్పించడానికి దాతల సహకారాన్ని కోరుతారు. దాతలు ఆర్థికంగా సహకరించడానికి సిద్ధమవగానే ఆ ప్రాజెక్టును పూర్తి చేయడానికి అవసరమైన పనులు చేపడతారు. దాతల నుంచి వచ్చిన డబ్బులో నయాపైసా కూడా తమ సొంతానికో, రవాణా చార్జీలకో వీరు ఏమాత్రం వినియోగించకుండా ఆ మొత్తాన్ని ప్రాజెక్టును పూర్తి చేయడానికే వినియోగిస్తారు. ‘దత్తత, స్వీకరించు, మెరుగుపర్చు’ అన్న విధానంలో వీరు తమ సేవలను కొనసాగిస్తున్నారు. ఈ సంస్థలో 18-40 మధ్య వయస్సు ఉన్నవారే పనిచేస్తారు. వీరంతా ఒకరినొకరు ఉత్సాహపరుస్తూ, కొత్త విషయాలను నేర్చుకుంటూ ఒకరి ఆలోచనలను మరొకరు పంచుకుంటారు. అందరూ సమ అధికారాలను కలిగి లక్ష్యాన్ని పూర్తి చేయడానికి పనిచేస్తారు.
తెలుగు రాష్ర్టాల్లో సేవలందిస్తున్న సికింద్రాబాద్ ట్విన్ ఏరియా రౌండ్ టేబుల్ చాప్టర్ -148
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల్లోనూ సికింద్రాబాద్ ట్విన్ ఏరియా రౌండ్ టేబుల్ చాప్టర్ -148 కూడా ఈ విధమైన సేవలందిస్తున్నది. గత 24 సంవత్సరాలుగా తెలుగు రాష్ర్టాల్లో రౌండ్ టేబుల్ సంస్థ సమాజ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నది. వీరు మొత్తం 17 మంది సభ్యులున్నారు. రౌండ్ టేబుల్ ఇండియా సికింద్రాబాద్ ట్విన్ చాప్టర్ -148 ప్రస్తుత చైర్మన్గా రసూల్ జహీర్ వ్యవహరిస్తున్నారు. ఇంకా విషన్ గుప్తా, ఆదర్శ్ కచం, రమేశ్ కుమార్, చేతన్, సిద్ధార్థలతో పాటు మరో 11 మంది సభ్యులున్నారు. రౌండ్ టేబుల్ సంస్థ ఇప్పటివరకు తెలుగు రాష్ర్టాల్లో 24సంవత్సరాల వ్యవధిలో 437 ప్రాజెక్టుల్లో భాగంగా 600ల తరగతి గదులు, పలు ప్రాంతాల్లో మరుగుదొడ్లను కూడా నిర్మించారు. ఇటీవలే గజ్వేల ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో రెండు గదులను నిర్మించగా, ఈ ప్రాజెక్టుకు జడ్పే, బజాజ్, నీరుస్ తదితర సంస్థలతోపాటు జితేందర్ సింగ్ దాతలుగా ముందుకొచ్చారు. ఆరు నెలల ఆరు రోజుల కాలంలోనే రెండు తరగతి గదులను నిర్మించడంతోపాటు విద్యార్థుల అవసరాలకు మరుగుదొడ్లు, మూత్రశాలలు నిర్మించారు. కరోనా సమయంలోనూ రౌండ్ టేబుల్ సంస్థ ఆధ్వర్యంలో హైదరాబాద్ ఉస్మానియా దవాఖానలో ఐసీయూ వార్డును నిర్మించారు.
‘ఫ్రీడం త్రో ఎడ్యుకేషన్’ అన్నదే వీరి నినాదం…
రౌండ్ టేబుల్ సంస్థ నినాదం ‘ఫ్రీడం త్రో ఎడ్యుకేషన్’. అంటే చిన్నారులకు, యువతకు విద్యనిస్తే వారికి రెక్కలు ఇచ్చినట్టే. విద్యను అందించి వారిలో వ్యక్తిత్వ, మేధా వికాసాన్ని కలిగిస్తే వారే స్వతంత్రంగా జీవించగలిగే స్థాయికి ఎదుగుతారన్నది సంస్థ ముఖ్య ఉద్దేశం.