Summer | హైదరాబాద్, మే 8(నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో భానుడు నిప్పులు కురిపిస్తున్నాడు. ఎండ ప్రభావంతో జనంతో పాటు జంతువులు అల్లాడుతున్నాయి. వీధి కుకలపై వేసవి ఎండ ప్రభావం తీవ్రంగా ఉంటున్నది. ఒకవైపు నీళ్లు, ఆహారం దొరక, మరోవైపు ఎండ వేడితో శరీర ఉష్ణోగ్రతలు పెరిగి వీధి కుకలు అల్లాడిపోతున్నాయి.
ఇలాంటి పరిస్థితుల్లో వాటి ప్రవర్తనలో మార్పులు చోటుచేసుకుంటాయని పశువైద్యులు చెబుతున్నారు. ఈ సమయంలో వాటితో జాగ్రత్తగా ఉండాలని, లేకపోతే దాడికి పాల్పడే ప్రమాదం ఉంటుందని హెచ్చరిస్తున్నారు. వీధికుక్కలు కనిపించినప్పుడు వాటి కళ్లలోకి పరీక్షగా చూడకూడదని, వాటిని పట్టించుకోనట్టుగా ఉంటే దాడికి పాల్పడే అవకాశాలు తక్కువ అని సూచిస్తున్నారు. పెంపుడు కుక్కలను ఎక్కువసేపు ఎండలో ఉంచొద్దని, మాంసాహారం పెట్టకూడదని చెబుతున్నారు.
మరోవైపు హైదరాబాద్ నారాయణగూడలోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ (ఐపీఎం)కు కుకకాటు బాధితుల తాకిడి కూడా పెరిగింది. ఈ ఇనిస్టిట్యూట్‌కు సాధారణంగా నెలకు 2500 మంది కుకకాటు బాధితులు వస్తుంటారు. కానీ, ఏప్రిల్, మే నెలల్లో ఆ సంఖ్య 3,000కు పైగా ఉందని అధికారులు వెల్లడించారు. కుక్కల ప్రవర్తనలో మార్పులతో దాడులు పెరగడమే ఇందుకు కారణమని చెబుతున్నారు.
వేసవిలో కుక్కకాట్లు పెరుగుతాయి..
వేసవిలో కుక్కల్లో వచ్చే శారీరక మార్పులతో అవి గందరగోళంగా ప్రవర్తిస్తుంటాయి. వాటి దగ్గరకు వెళ్లినప్పుడు దాడి చేస్తాయి. కుక్క కరిస్తే నిర్లక్ష్యం చేయొద్దు. వెంటనే గాయాన్ని సబ్బుతో శుభ్రపరచాలి. గాయంపై నీళ్ల ధార పడేవిధంగా జాగ్రత్త తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల రేబిస్‌కు కారణమయ్యే వైరస్ బయటకు పోతుంది. ఆ తర్వాత వైద్యులను సంప్రదించి, యాంటీ రేబిస్ టీకా తీసుకోవాలి. ఈ టీకాలను ఐపీఎంలో ఉచితంగా అందిస్తున్నాం.
– డాక్టర్ శివలీల, ఐపీఎం డైరెక్టర్