విద్యార్థుల్లో క్రమశిక్షణ అలవడేలా తనదైన రీతిలో శిక్షణ ఇస్తూ వారి జీవితాల్లో ‘చంద్ర’ కాంతులు నింపుతున్నారాయన. ఉపాధ్యాయుడిగా తన సబ్జెక్టును బోధిస్తూనే భావిభారత పౌరులను తీర్చిదిద్దడంలో విశేష పాత్ర పోషిస్తున్నారు. స్కౌట్స్ అండ్ గైడ్స్ ద్వారా తాను నేర్చుకున్న విజ్ఞానం, విలువలను పది మందికి పంచిపెట్టాలన్న ఆకాంక్ష ఆయనకు ఆ అంశంలో ప్రముఖ శిక్షకుడిగా పేరు తెచ్చిపెట్టింది. ఒక్క మాటలో చెప్పాలంటే స్కౌట్స్ అండ్ గైడ్స్‌కు కేరాఫ్‌గా మారిపోయారు నోముల చంద్రారెడ్డి!
హుస్నాబాద్, జనవరి 8: అక్కన్నపేట మండలం రామవరం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో గణిత ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న నోముల చంద్రారెడ్డి స్కౌట్స్ గైడ్స్‌లో అత్యున్నత శిక్షణ అయిన లీడర్ ట్రైనర్‌గా శిక్షణ పొందారు. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులతోపాటు రాష్ట్రంలోని ఉపాధ్యాయులకు సైతం శిక్షణ ఇస్తూ తనకు తానే సాటిగా నిలుస్తున్నారు.
స్కౌట్స్ అండ్ గైడ్స్‌లో అత్యున్నత శిక్షణ పూర్తి చేసిన చంద్రారెడ్డి…
చంద్రారెడ్డి స్కౌట్స్ అండ్ గైడ్స్ విభాగంలో బేసిక్, అడ్వాన్స్, హిమాలయ ఉడ్ బ్యాడ్జి, ప్రీ
ఏఎల్టీ, ఏఎల్టీ (అసిస్టెంట్ లీడర్ ట్రైనర్), ఎల్టీ (లీడర్ ట్రైనర్) శిక్షణలు పూర్తి చేశారు.
ఎల్టీ అనేది అత్యున్నత కోర్సుగా ఉంది. తాను పనిచేస్తున్న రామవరం ఉన్నత పాఠశాలలో ఒక బ్యాచ్‌ను తయారు చేసి వారికి వివిధ అంశాల్లో శిక్షణ ఇచ్చారు. ఇటీవల హైదరాబాద్‌లో రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన 35 మంది ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చారు. సిద్దిపేట జిల్లాలోని కస్తూర్బాగాంధీ, మోడల్, జిల్లా పరిషత్ పాఠశాలలకు చెందిన 32 మంది ఉపాధ్యాయులు తన సమక్షంలో శిక్షణ పొందారు. గణిత ఫోరం జిల్లా బాధ్యుడిగానూ గణిత శాస్త్రంలో విద్యార్థులకు మెళకువలు నేర్పిస్తున్నారు.
చంద్రారెడ్డికి దక్కిన ప్రశంసలు, అవార్డులు
స్కౌట్స్ అండ్స్ ట్రైనర్ ధృవీకరణ పత్రాన్ని గవర్నర్ తమిళిసై, రాష్ట్ర స్కౌట్స్ అండ్ గైడ్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత చేతుల మీదుగా అందుకున్నారు.
సైబర్ కాంగ్రెస్ పరీక్షలో చంద్రారెడ్డి శిక్షణ ఇచ్చిన ఇద్దరు విద్యార్థులు ప్రతిభ కనబర్చారు. తాను సిద్దిపేట సీపీ శ్వేత ద్వారా ప్రశంసా పత్రాన్ని పొందారు.
ఇస్రో వారు నిర్వహించిన ఆన్లైన్ పరీక్షలో ప్రతిభ చాటి సర్టిఫికెట్ పొందారు.
క్రమశిక్షణ కలిగిన ఉపాధ్యాయుడిగా జిల్లా విద్యాధికారులతో పలుమార్లు ప్రశంసలు అందుకున్నారు.
రాష్ట్రంలోని ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చిన సందర్భంగా ఎమ్మెల్సీ కవిత ద్వారా ప్రశంసలు దక్కాయి.
హుస్నాబాద్ ప్రాంతంలో జాతరలు, ఉత్సవాలు, సభలు, సమావేశాల్లో బాలభటులతో సేవలకు అందిస్తూ స్థానికుల ప్రశంసలు పొందారు.
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 2013లో రాష్ట్ర ప్రభుత్వ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు వరించింది.
2019లో సిద్దిపేట జిల్లాస్థాయి నిష్ట ట్రైనింగ్‌లో ప్రశంసాపత్రం సొంతం చేసుకున్నారు.
సిద్దిపేట జిల్లా స్థాయి వేదిక్ మ్యాథ్స్ ట్రైనింగ్‌లో జిల్లా అధికారుల ప్రశంసలు అందుకున్నారు.
చేర్యాల కేజీబీవీలో 2019, మేలో విద్యార్థులకు 30 రోజుల శిక్షణ ఇచ్చి డీఈవో ద్వారా ప్రశంసాపత్రం దక్కింది.
స్కౌట్స్ అండ్ గైడ్స్‌తో ప్రయోజనం
స్కౌట్స్ అంటే బాలురు, గైడ్స్ అంటే బాలికలు అని అర్థం. స్కౌట్స్ అండ్ గైడ్స్ విభాగంలో రాష్ట్రపతి అవార్డు తీసుకున్న వారికి కేంద్ర ప్రభుత్వం విధిగా రైల్వేశాఖలో ఉదోగం ఇవ్వాల్సి ఉంటుంది. మిగతా వారికి సైతం వివిధ విభాగాల్లో
ప్రాధాన్యత ఉంటుందని చంద్రారెడ్డి తెలిపారు.
క్రమశిక్షణ, సమయ పాలన అలవడుతుంది…
నేను ఎల్టీ పూర్తి చేశాను. నేను నేర్చుకున్నదాన్ని విద్యార్థులకు, ఆసక్తి గల ఉపాధ్యాయులకు నేర్పిస్తున్నాను. స్కౌట్స్ అండ్ గైడ్స్ శిక్షణతో క్రమశిక్షణ, సమయ పాలన, సేవాగుణం అలవడుతాయి. స్కౌట్స్అండ్ గైడ్స్ శిక్షణకు ప్రభుత్వం ప్రత్యేకంగా ఆదేశాలు జారీ చేయాలి.
– నోముల చంద్రారెడ్డి, స్కౌట్స్ అండ్ గైడ్స్
అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి, శిక్షకుడు
బాలభటుల శిక్షణ ఆనందంగా ఉంది
మా స్కూల్లో స్కౌట్స్ అండ్ గైడ్స్ శిక్షణ ఇస్తున్నారు. ఇందులో నేను చేరాను. సైనికులు, పోలీసుల్లాగా మార్చ్ఫాస్ట్ చేయడం గర్వంగా అనిపిస్తుంది. ప్రత్యేక యూనిఫామ్ వేసుకోవడంతో మమ్మల్ని ప్రతి ఒక్కరూ గౌరవిస్తున్నారు. చంద్రారెడ్డి సార్ ఆధ్వర్యంలో శిక్షణ పూర్తి చేసి జాతీయ స్థాయిలో రాణిస్తా.
– ఎస్.కార్తీక్,9వ తరగతి, రామవరం ఉన్నత పాఠశాల
విద్య, క్రమశిక్షణ నేర్పిస్తున్నారు
మా పాఠశాలలో విద్యతో పాటు బాలభటుల శిక్షణ ద్వారా క్రమశిక్షణ నేర్పిస్తున్నారు. యూనిఫామ్ ధరించామంటే మా ప్రవర్తనే వేరుగా ఉంటుంది. ఎంత కష్టమైనా వ్యాయామం చేస్తాం. చంద్రారెడ్డి సార్ మాకు స్కౌట్స్అండ్ గైడ్స్‌లో మెలకువలు నేర్పిస్తున్నారు. ఆయన చెప్పే ప్రతి అంశాన్ని మేము పాటిస్తున్నాం. పలు జాతరలు, ఉత్సవాలు, ప్రముఖుల పర్యటనల సమయంలో మేం మార్చ్ఫాస్ట్ చేయడం, సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం చేస్తున్నాం. చంద్రారెడ్డి సార్ ఇస్తున్న శిక్షణ మాకు ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నా.
-బి.భవాని, 8వ తరగతి, రామవరం ఉన్నత పాఠశాల