జహీరాబాద్, మే 24 : హైదరాబాద్-ముంబయికి జహీరాబాద్ మీదుగా వెళ్లాల్సిన బుల్లెట్ ట్రైన్ ప్రజాప్రతినిధుల, నాయకుల నిర్లక్ష్యంతో రూటు మారింది. రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలకు చెందిన కీలక నేతలు, ప్రజాప్రతినిధులు కేంద్రంలో చక్రం తిప్పడం మూలంగా కోకాపేట్,వికారాబాద్, కల్బుర్గి మీదుగా బుల్లెట్ ట్రైన్ లైన్ వెళ్లేలా రూట్ మార్చినట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. ఫలితంగా నిమ్జ్ ప్రాజెక్టు, పారిశ్రామిక స్మార్ట్‌సిటీలతో పాటు జహీరాబాద్ ప్రాంత అభివృద్ధికి తీరని అన్యాయం జరుగుతుందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
హైదరాబాద్-నాగ్‌పూర్ ఇండస్ట్రియల్ కారిడార్ అభివృద్ధిలో భాగంగా సంగారెడ్డి జిల్లాలోని న్యాల్కల్, ఝరాసంగం మండలాల పరిధిలో నిమ్జ్ ప్రాజెక్టులో ప్రపంచ స్థాయి ఇంటిగ్రేటెడ్ ఇండస్ట్రియల్ స్మార్ట్‌సిటీ ఏర్పాటుకు ఇటీవల ప్రధాని మోదీ హైదరాబాద్ నుంచి వర్చువల్‌గా శంకుస్థాపన చేసిన సంగతి తెలిసిందే. 2024లో కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా 12 గ్రీన్‌ఫీల్డ్ ఇండస్ట్రియల్ స్మార్ట్‌సిటీలు ప్రకటించగా, వాటిలో తెలంగాణకు ఒకటి కేటాయించింది. న్యాల్కల్, ఝరాసంగం మండలాల పరిధిలో నిమ్జ్ ప్రాజెక్టు కోసం మొదటి విడతలో సేకరించిన 3245 ఎకరాల్లో ఈ స్మార్ట్‌సిటీని ఏర్పాటు చేస్తున్నారు. దీనికోసం రూ.2300 కోట్లతో లేవుట్ అభివృద్ధి, రహదారులు, విద్యుత్, డ్రైనేజీ, తాగునీటి సదుపాయం, పార్కులు, ఇంటర్నెట్ తదితర మౌలిక వసతుల కల్పన పనులు వేగంగా చేపడుతున్నారు. ఇప్పటికే నిమ్జ్ ప్రాజెక్టులో ప్రైవేటు రక్షణ రంగ సంస్థ వెమ్ టెక్నాలజీ, కార్ల తయారీలో పేరుగాంచిన హ్యుందాయ్ పరిశ్రమ ఏర్పాటుకు 1200 ఎకరాల భూములు ప్రభుత్వం కేటాయించింది. ప్రస్తుతం ఆయా పరిశ్రమల ఏర్పాటు పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.

తొలుత జహీరాబాద్ నుంచి డీపీఆర్ సిద్ధం…
మొదటి విడత డీఆర్‌పీలో హైదరాబాద్-ముంబయి మధ్య 900 కిలోమీటర్ల దూరాన్ని కేవలం 3 గంటల్లోనే చేరుకునేలా కేంద్రం ప్రభుత్వం బుల్లెట్ ట్రైన్‌ను ప్రతిపాదించింది. దీనికోసం సంబంధిత రైల్వే అధికారులు సర్వేలు, భూ పరీక్షలు సైతం నిర్వహించారు. అప్పట్లో హైదరాబాద్, జహీరాబాద్ పట్టణంలో బుల్లెట్ ట్రైన్ ఆగేందుకు స్టేషన్ల ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఈ బుల్లెట్ ట్రైన్ లైన్‌తో నిమ్జ్, స్మార్ట్‌సిటీలతో పాటు సంగారెడ్డి, సదాశివపేట్, పటాన్చెరు ప్రాంతాలకు పారిశ్రామిక వేత్తలు, శాస్త్రవేత్తలు, ఐటీ ఉద్యోగులు తదితరులకు రాకపోకలు సాగించేందుకు ఎంతగానో ఉపయోగపడనున్నది.
జహీరాబాద్ ప్రాంతంలోని నిమ్జ్, స్మార్ట్‌సిటీలో పరిశ్రమల ఏర్పాటుకు పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామిక వేత్తలు ముందుకు వస్తున్న క్రమంలో, రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలకు చెందిన ప్రజాప్రతినిధులు, కీలక నేతలు కేంద్రంలో చక్రం తిప్పి బుల్లెట్ ట్రైన్ రూట్‌ను మార్చివేశారు. సంబంధిత రైల్వే అధికారులు సిద్ధం చేసిన రెండో విడత డీపీఆర్‌లోని అలైన్మెంట్లో బుల్లెట్ ట్రైన్ రూట్‌ను మార్చివేశారు. ఫలితంగా నిమ్జ్ ప్రాజెక్టులో ఏర్పాటు చేయనున్న పరిశ్రమల ఏర్పాటు కార్యకలాపాలు, ఇప్పుడిప్పుడే జహీరాబాద్ ప్రాంతంలోని స్మార్ట్సిటీలోకి రానున్న ప్రపంచస్థాయి పరిశ్రమలు, రవాణా, కనెక్టివిటీ పరంగా తీవ్ర ప్రభావం చూపనుందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా జహీరాబాద్ ప్రాంత ప్రజాప్రతినిధులు, నాయకులు కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి డీఆర్‌పీలో హైదరాబాద్, జహీరాబాద్ పట్టణం మీదగా బుల్లెట్ ట్రైన్ వెళ్లేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.