కంగ్టి, డిసెంబర్ 4: గత పాలకులు ఆ తండాలకు వెళ్లి ఓట్లడిగి గెలుపొంది తమ పబ్బం గడుపుకున్నారే తప్పా.. వారి జీవితాలు మారేలా చర్యలు తీసుకోలేదు. కంగ్టి నుంచి కేవలం ఐదు కిలోమీటర్ల లోపు ఉండే జీర్గితండా, చందర్ తండాలకు గతేడాది వరకు ప్రయాణించాలంటే నరకప్రాయంగా ఉండేది. రెండు తండాలకు చెందిన గిరిజనులు గతంలో పాలించిన ఎమ్మెల్యేలకు తమ తండాలకు బీటీ రోడ్లు కల్పించాలని వందలమార్లు విన్నవించుకున్నా పట్టించుకోలేదు. నారాయణఖేడ్ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్‌రెడ్డి గెలుపొందిన తరువాత తండాల్లో పర్యటించినప్పుడు ఆ తండాలకు చెందిన గిరిజనులు తమతండాలకు బీటీ రోడ్లు ఏర్పాటు చేయాలని విన్నవించుకున్నారు. గతంలో ఇచ్చిన హామీ మేరకు ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి గత నాలుగు సంవత్సరాల క్రితమే జీర్గి తండాకు రూ.1.75 కోట్లు, చందర్తండాకు రూ.1.65 కోట్ల నిధులు మంజూరు చేశారు. రెండు రోడ్లకు సంబంధించిన కాంట్రాక్ట్ పనులు కాంగ్రెస్ నాయకుడికి రావడంతో కావాలని టీఆర్ఎస్పై బురద చల్లేందుకు పనులు ప్రారంభించలేదు. ఇది గమనించిన ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి ఇతరులకు కాంట్రాక్ట్ వచ్చేలా చర్యలు తీసుకుని, గతేడాది పనులు ప్రారంభించారు. ఇటీవల రోడ్ల ఏర్పాటు పనులు పూర్తయ్యాయి. దీంతో రెండు తండాలకు ప్రయాణం సుగమం అయ్యిందని చెప్పవచ్చు.
జీర్గితండా, చందర్నాయక్తండాలకు బీటీరోడ్లు ఏర్పాటుకావడంతో రోడ్డు గుండా ఉన్న భూముల విలువలు అమాంతం పెరిగిపోయాయి. రోడ్డు ఏర్పాటుకు ముందు ఇక్కడ రూ.5 లక్షలు పలికిన ఎకరా భూమి ప్రస్తుతం రూ.15 లక్షలు పలుకుతున్నది. రోడ్ల ఏర్పాటుతోనే భూము ల విలువలు పెరిగాయని తండాలకు చెందిన గిరిజనులు చెబుతున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం గిరిజన సంక్షేమం కోసం పాటుపడుతుందని చెప్పడానికి రోడ్ల ఏర్పాటే నిదర్శనంగా చెప్పుకోవచ్చు. కాంగ్రెస్ నాయకులు కేవలం మొరం రోడ్లను వేసి నిధులు కాజేసారే తప్ప పక్కా రోడ్డుకు పూనుకోలేదని ఇక్కడి ప్రజలు ఆరోపిస్తున్నారు.
నారాయణఖేడ్ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్‌రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుని జీర్గితండా, చందర్తండాలకు రోడ్లు ఏర్పాటయ్యాయి. కాంగ్రెస్ నాయకులు రోడ్డు వేయకుండా రెండుసంవత్సరాల పాటు ఇబ్బందులు పెట్టిన ఎమ్మెల్యే కష్టపడి రోడ్డు ఏర్పాటయ్యేలా పూనుకున్నారు.
– రాథోడ్ శివాజీ, చందర్తండా, కంగ్టి
జీర్గితండా, చందర్నాయక్తండాలకు రోడ్ల ఏర్పాటుతో ప్రయాణం సుగుమమైంది. గతంలో ఈరోడ్లపై వాహనాల గుండా ప్రయాణించాలంటే చాలా ఇబ్బందులకు గురయ్యే వాళ్లం. గతేడాది నుంచి ఏరాత్రైనా తండాలకు సురక్షితండా ఇంటికి చేరుకుంటున్నాం.
– ఆర్.అశోక్, చందర్తాండ, కంగ్టి