చేర్యాల, ఆగస్టు 21: సాంకేతిక విద్యను నిర్వీర్యం చేసే నిర్ణయాలను ప్రభుత్వం వెంట నే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు సిద్దిపేట జిల్లా చేర్యాల పట్టణంలోని ఎంఈవో కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. అనంతరం పట్టణంలోని జాతీయ రహదారిపై ధర్నా నిర్వహించారు.ఈ సందర్భంగా బీఆర్ఎస్వీ పట్టణ అధ్యక్షుడు ఒగ్గు శ్రీశైలం మాట్లాడుతూ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో పాలిటెక్నిక్ విద్యను విలీనం చేయాలనే ఆలోచనను రేవంత్‌రెడ్డి మానుకోవాలన్నారు.
పాలిటెక్నిక్ విద్యను నిర్వీర్యం చేసే జీవో నెం.97ను రద్దు చేయడంతో పాటు విద్యార్థుల భవిష్యత్‌ను ప్రభావితం చేసే శక్తి పాలసీని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల వల్ల విద్యార్థులు ఈసెట్ ప్రవేశ పరీక్ష రాసే అర్హత కోల్పోయి కార్పొరేట్ కంపెనీల్లో తక్కువ వేతనాలకే పని చేసే పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు. డిప్లొమా విద్యార్థులకు ఎంతోకాలంగా అమల్లో ఉన్న లాటరీ ఎంట్రీ విధానాన్ని యథావిధిగా కొనసాగించాలన్నా రు. విద్యార్థులు నిర్వహించిన ధర్నా, ఆందోళన కార్యక్రమానికి బీఆర్ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జింకల పర్వతాలు యాదవ్ మద్దతు ప్రకటించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్వీ నాయకులు బోధాసు రుద్ర, సాక్షిత్, అనిల్, చందు, రాజు, వినయ్, మధు, రవి, పాలిటెక్నిక్ విద్యార్థులు పాల్గొన్నారు.