Jubilee hills by poll | పటాన్ చెరు, నవంబర్ 2: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ బలపర్చిన అభ్యర్థి మాగంటి సునీత విజయం ఖాయమని పటాన్ చెరు నియోజకవర్గ కోఆర్డినేటర్ ఆదర్శ్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. శనివారం రాత్రి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహించి మాట్లాడారు. ప్రజలకు అభివృద్ధి కొనసాగాలంటే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి సునీతను భారీ మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు.
బీఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రజల సంక్షేమం కోసం అనేక పథకాలు అమలు చేశారని గుర్తు చేశారు. రాష్ట్ర అభివృద్ధికి పునాది వేశారన్నారు. రైతుల కోసం రైతుబంధు, రైతుబీమా, వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరెంట్ వంటి పథకాలు అమలు చేశారు. పేదల కోసం డబుల్ బెడ్రూమ్ ఇళ్లు, అసరా పింఛన్లు, విద్యార్థుల కోసం ఫీజు రీయింబర్స్మెంట్, విదేశీ విద్యాసహాయం పథకాలను అమలు చేశారు.
ప్రతి గ్రామం, ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగునీరు అందించడానికి మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ వంటి ప్రాజెక్టులు విజయవంతంగా అమలు చేశారని చెప్పారు. ఈ పథకాలు నిరంతరాయంగా కొనసాగాలంటే జూబ్లీహిల్స్ ప్రజలు కారు గుర్తుకే ఓటు వేసి బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులు, పేదలు, విద్యార్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు అందరికీ తెలిసిందే అన్నా రు. సంక్షేమం, అభివృద్ధి, శాంతి మళ్లీ రావాలంటే బీఆర్ఎస్ గెలవాలి. కారు గుర్తుకే ఓటు వేయాలి. జూబ్లీహిల్స్ అభివృద్ధి కొనసాగించాలంటే మాగంటి గోపీనాథ్ సేవలను కొనసాగించడానికి, మాగంటి సునీత గెలిపించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో పటాన్ చెరు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, గోవర్ధన్ రెడ్డి , బీఆర్ఎస్ నాయకులు, న్యాయవాది బాలాపూర్ మాణిక్ యాదవ్, జిన్నారం వెంకటేష్ గౌడ్, సందీప్ గోస్వామి, మహేష్, సన్నీ, సతీష్ బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.