సిద్దిపేట అర్బన్, నవంబర్ 3 : రాష్ట్రంలో ఉద్యోగులకు ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు చేయక కాంగ్రెస్ ప్రభుత్వం అన్యాయం చేస్తున్నదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు విమర్శించారు. ఆదివారం సిద్దిపేటలోని విపంచి కళా నిలయంలో జరిగిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు పొన్నమల రాములు ఉద్యోగ విరమణ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాములుతో తనకు రెండు దశాబ్దాల అనుబంధం ఉందన్నారు.
ప్రజా ఉద్యమాలు, సామాజిక సేవ ద్వారా తమకు పరిచయం ఏర్పడిందన్నారు. వారి కృషితోనే సిద్దిపేట పట్టణంలో మొట్ట మొదటి ఉపాధ్యాయ భవనం ఏపీటీఎఫ్ నిర్మించుకున్నామని తెలిపారు. విరమణ ఉద్యోగానికే కాని, ప్రజాసేవకు కాదన్నారు. అట్టడుగు వర్గాలకు రిజర్వేషన్ల ఫలితం అందేలా భవిష్యత్‌లో ఆయన పాటుపడాలన్నారు. ఇందుకు తన సహకారం ఎంతో ఉంటుందన్నారు. ఏ ప్రభుత్వ ఉద్యోగి రిటైరైనా వారం రోజుల్లో రిటైర్మెంట్ బెనిఫిట్స్ వస్తాయని, కానీ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు ఇస్తదో చెప్పడం లేదన్నారు.
పెండింగ్ 3 డీఏలు ఇస్తామని ఇవ్వలేదన్నారు. ఇప్పుడు 5 డీఏలు పెండింగ్ ఉన్నట్లు తెలిపారు. కొత్త పీఆర్సీ వెంటనే అమలు చేస్తామని చెప్పి 11 నెలలు గడిచినా ఉలుకూ పలుకు లేదన్నారు. పాత పెన్షన్ విధానం తెస్తామని చెప్పి ఇప్పటి వరకు ఒక కమిటీ కూడా వేయలేదని హరీశ్‌రావు విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు 7 వేల మంది రిటైర్ ఉద్యోగులకు గ్రాట్యుటీ బెనిఫిట్స్, జీపీఎఫ్, ఇన్సూరెన్స్ డబ్బులు ఇవ్వలేదన్నారు.
దేశంలో రిటైర్డ్ ఉద్యోగులకు మూడేండ్ల తర్వాత రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇస్తున్న ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ అని ఎద్దేవా చేశారు. ఉద్యోగులు దాచుకున్న డబ్బులు ఇవ్వకపోవడం దురదృష్టకరమన హరీశ్‌రావు అన్నారు. కార్యక్రమంలో దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి, రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య, మాజీ ఎమ్మెల్సీ ఫరూఖ్ హుస్సేన్, టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు గ్యాదరి పరమేశ్వర్, మున్సిపల్ మాజీ చైర్మన్ రాజనర్సు, టీపీటీఎఫ్ నాయకులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.