దుబ్బాక, అక్టోబర్ 9: దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డిని హైదరాబాద్ పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. బుధవారం వేకువజామున హైదరాబాద్‌లోని కొండాపూర్‌లో ఎమ్మెల్యే ఇంటి వద్దకు మాదాపూర్ సీఐ,ఎస్సైలతో పాటు పోలీసు సిబ్బంది భారీ సంఖ్యలో చేరుకుని ఎమ్మెల్యేను ఇంట్లో నుం చి బయటకు రాకుండా అడ్డుకున్నారు. బతుకమ్మ, దసరా పండుగ సందర్భంగా దుబ్బాక నియోజకవర్గంలో పర్యటించించేందుకు ఎమ్మెల్యే వస్తున్న క్రమంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇంటి నుం చి బయటకు వెళ్లొద్దని, తమకు పైఅధికారుల నుంచి ఆదేశాలు వచ్చాయంటూ ఎమ్మెల్యేకు పోలీసులు అడ్డుపడ్డారు. ఈ క్రమంలో పోలీసుల వైఖరిపై ఎమ్మెల్యే ఆసంతృప్తి వ్యక్తం చేశారు.
తన నియోజకవర్గంలో పర్యటించకుండా అడ్డుకోవడం ఏమిటని పోలీసుల తీరును తప్పుపట్టారు. మాదాపూర్‌లోని తన కార్యాలయానికి వెళ్ల్లడానికి పోలీసులు అనుమతించలేదని, తన వాహనంలో కాకుండా అవసరమైతే పోలీసు వాహనంలో కార్యాలయానికి వస్తానన్న వారు అనుమతించలేదని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
దీంతో పోలీసుల వైఖరిపై ఆయన సంతృప్తి వ్యక్తం చేసి డీసీపీ జయరాంతో ఫోన్లో మాట్లాడారు. డీసీపీ జయరాం సూచనల మేరకు పోలీసులు మాదాపూర్‌లోని కార్యాలయానికి ఎమ్మెల్యే ను తీసుకెళ్లారు. కార్యాలయం వద్ద ఎమ్మెల్యేను సాయంత్రం వరకు నిర్బంధించారు.
డీఎస్సీ ఫలితాలు విడుదల కాగా ఎంపికైన అభ్యర్థులకు బుధవారం నియామకపత్రాలను ప్రభుత్వం అందజేసింది. ఉపాధ్యాయ సంఘాలు 317 జీవో రద్దు చేయాలని డిమాండ్ చేయగా, వారికి బీఆర్ఎస్ మద్దతునిచ్చింది. ఈ క్రమంలో దుబ్బాక ఎమ్మెల్యే ప్రభాకర్‌రెడ్డిని ముందస్తుగా హౌస్ అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఎమ్మెల్యేను హౌస్ అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ దుబ్బాకలో బీఆర్ఎస్ నాయకులు మండిపడ్డారు. బీఆర్ఎస్ కౌన్సిలర్లు, నాయకులు గన్నే భూంరెడ్డి, ఆస యాదగిరి. స్వామి ఇల్లేందుల శ్రీనివాస్, లచ్చయ్య, శ్రీకాంత్, నరేశ్, శ్రీనివాస్, యాదగిరి ప్రభుత్వ తీరును ఖండించారు.