హుస్నాబాద్, ఫిబ్రవరి 5: సీఎం రేవంత్‌రెడ్డి అసభ్య పదజాలంతో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను దూషించడాన్ని నిరసిస్తూ సోమవారం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని అక్కన్నపేట చౌరస్తాలో బీఆర్ఎస్ నాయకులు ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. అనంతరం సీఎం రేవంత్‌రెడ్డి ఫ్లెక్సీని దహనం చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ శ్రేణులు మాట్లాడుతూ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా తెలంగాణ రాష్ర్టాన్ని తెచ్చిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై సీఎం రేవంత్‌రెడ్డి ఇష్టమొచ్చినట్లు మాట్లాడటం సరికాదన్నారు. ఇప్పటికైనా నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని హితవుపలికారు. తొమ్మిదేండ్లలో తెలంగాణ రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో ముందు వరుసలో నిలిపిన గొప్ప నాయకుడు కేసీఆర్ అని కొనియాడారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి కాగానే అహం పెరిగిందన్నారు.
ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చి ప్రజా సంక్షేమం కోసం పనిచేయాలని రేవంత్‌రెడ్డికి సూచించారు. భవిష్యత్‌లో ఇటువంటి వ్యాఖ్యలు చేస్తే ప్రజలు, బీఆర్ఎస్ కార్యకర్తలు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో హుస్నాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ ఆకుల రజిత, వైస్‌చైర్‌పర్సన్ అయిలేని అనిత, బీఆర్ఎస్ పట్టణ, మండల శాఖ అధ్యక్షులు ఎండీ అన్వర్, వంగ వెంకట్రామ్రెడ్డి, మాజీ ఎంపీపీ ఆకుల వెంకట్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ఎడబోయిన తిరుపతిరెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ సుద్దాల చంద్రయ్య, నాయకులు అయిలేని మల్లికార్జున్‌రెడ్డి, వాల నవీన్, గందె చిరంజీవి, పోలవేని సంపత్, చిట్టి గోపాల్‌రెడ్డి, బొల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు.